Top 5 This Week

Related Posts

ఇదీ కొండపల్లి గణేష్ ‘ఛీటింగ్’ బాగోతంలో అసలు ట్విస్ట్!

(సమీక్ష శైలి కథనం)
ఒంటి నిండా బంగారం.. బెంజ్ కారులో సంచారం.. ప్రతిష్టాత్మకమైన మైహోం భుజాలో నివాసం.. వరుసగా రూ. 29.00, రూ. 51.00 లక్షలకు వినాయకుడి లడ్డూను వేలంలో దక్కించుకోవడం ద్వారా ఆర్థిక ‘స్థితి’మంతునిగా విశ్వసనీయతను భ్రమింపజేయడం.. రియల్ ఎస్టేట్, వైన్ షాపుల వ్యాపారాలంటూ పలువురిని నమ్మించడం.. భారా రాబడులంటూ ప్రేరేపించడం.. తద్వారా పెట్టుబడులు స్వీకరించినందుకు ‘అగ్రిమెంట్’ కూడా చేసుకోవడం.. ఇచ్చిన హామీ ప్రకారం లాభాలు ఏవని ప్రశ్నిస్తే చిరునామా మార్చి ఉడాయించడం.. మరోవైపు ఆ తర్వాత కొద్ది నెలలకే ఖమ్మం కోర్టులో దివాళా పిటిషన్ (ఐపీ) దాఖలు చేయడం. అంతకు ముందే హైదరాబాద్ లో పలువురి నుంచి రూ. కోట్లలో వసూళ్లు చేసి మోసగించడం.. ఇదీ వ్యాపారం ముసుగులో కొండపల్లి గణేష్ ఛీటింగ్ బాగోతం.

సైబరాబాద్ EOW (ఎకనమిక్స్ అఫెన్సెస్ వింగ్) విభాగపు పోలీసులు గణేష్ పై నమోదు చేసిన కేసులో అతను పలువురిని ఎలా మోసగించాడనే అంశాన్ని పోలీసులు ఎఫ్ఐఆర్ లో సుదీర్ఘంగా వివరించారు. అందులోని వివరాల సారాంశం ప్రకారం.. మై హోం భుజాలో నివాసముండే కొండపల్లి గణేష్ తనను తాను వైన్ షాపులు, రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో నిమగ్నమైన సక్సెస్ ఫుల్ బిజినెస్ మేన్ గా పలువురిని పరిచయం చేసుకున్నాడు. గత సెప్లెంబర్ లో మైహోం భుజాలో జరిగిన వినాయకుని లడ్డూ వేలం తర్వాత గణేష్ అపార్ట్మెంట్ లోని నివాసితులకు లడ్డూను పంపిణీ చేశాడు.

అదే సమయంలో మైహోం భుజాలోనే నివాసముండే బోయినపల్లి కిరణ్ ద్వారా ఆళ్ల సిల్వియా, ఆమె భర్త శ్రీనివాసరెడ్డిని సంప్రదించాడు. అనంతరం గణేష్ తోపాటు బోయినపల్లి కిరణ్ లు సిల్వియా శ్రీనివాసరెడ్డి దంపతుల నివాసానికి వచ్చి, తమ వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టాలని వారిని ఒప్పంంచారు. మూడు నెలలకోసారి ఆరు శాతం చొప్పున మంచి రాబడిని ఇస్తామని వారికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మైహోం భుజాలోనే గల తమ ఆఫీసులో ఎక్సెల్ ఫార్మాట్ లో వివరణాత్మక ప్రదర్శను కూడా ఇవ్వడం ద్వారా ప్రతిపాదిత పెట్టుబడుల గురించి వివరించి, ఆకర్షణీయమైన రాబడిని ఇస్తామని వారికి వాగ్దానం చేశారు.

ఆ తర్వాత సిల్వియా భర్త శ్రీనివాసరెడ్డిని సంప్రదించి తమ వ్యాపారాల్లో వీలైనంత త్వరగా పెట్టుబడి పెట్టేలా పదే పదే ఒప్పించారు. గణేష్, కిరణ్ ల మాటలను, హామీలను, వాగ్ధానాలను విశ్వసించిన సిల్వియా రూ. 5.00, రూ. 5.50, రూ. 4.00, రూ. 2.00 లక్షల చొప్పున మొత్తం రూ. 31.00 లక్షలను తమకు గల వివిధ బ్యాంకు ఖాతాల నుంచి బదిలీ చేయడంతోపాటు నగదు చెల్లింపుల ద్వారా కూడా పెట్టుబడులు పెట్టారు. ఈ సందర్భంగా గత డిసెంబర్ 10వ తేదీన రూ. 100 విలువైన నాన్ జ్యుడిషియల్ స్టాప్ పేపర్ పై ఒప్పందం కుదుర్చుకుని మరీ గణేష్ వ్యవస్థల్లో పెట్టుబడులుగా పెట్టారు.

ఇదీ చదవండి:

అయితే చేసుకున్న ఒప్పందం ప్రకారం రావలసిన లాభాల గురించి సిల్వియా శ్రీనివాసరెడ్డిలు గణేష్ ను ప్రశ్నించగా, వారం, పక్షం, నెలరోజుల చొప్పున వాయిదాలు పెడుతూ, చివరికి బాధితుల ఫోన్ కాల్స్ కు స్పందించకుండా గణేష్ తప్పించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే మైహోం భుజాలోని తన నివాసాన్ని, ఆఫీసును ఖాళీ చేశాడు. దీంతో ఖంగుతిన్న సిల్వియా శ్రీనివారెడ్డి తాము మోసపోయామని, తమ కష్టార్జితాన్ని ఛీటింగ్, అక్రమ పద్ధతుల ద్వారా తమ నుంచి తీసుకుని నమ్మించి గణేష్ మోసం చేశాడని విశ్వసించారు.

ఈ పరిణామాల్లోనే మైహోం భుజాలోని ఇతర నివాసితులను, పరిచయస్తుల ద్వారా గణేష్ గురించి ఆరా తీయగా, బోయినపల్లి కిరణ్ తో అతను కుమ్ముక్కై, భారీ లాభాల పేరుతో ఆశ చూపి, తమ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేవిధంగా ప్రజలను ప్రేరేపించే ఒక నెట్ వర్క్ ను నడుపుతున్నారని సిల్వియా తెలుసుకున్నారు. తన తరహాలోనే మరికొందరు కూడా గణేష్ మాటలను నమ్మి పెట్టుబడులు పెట్టి, మోసపోయారని ఆమె సమాచారం సేకరించారు.

గణేష్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన బొచ్చా అప్పలనాయుడు రూ. 26.85 లక్షలు, సి. శ్రీ కృప రూ. 40.00 లక్షలు, జి. నాగహరీష్ రూ. 30.00 లక్షలు, సముద్రాల రవిశంకఱ్ రూ. 65.00 లక్షలు, సముద్రాల హరిత రూ. 1.53 కోట్లు కలిపి మొత్తం రూ. 3.14 కోట్ల చొప్పును సమర్పించుకుని బాధితులుగా మిగిలారు. వీరికి కూడా క్రమం తప్పకుండా అధిక లాభాలు ఇస్తామని, ఎప్పుడు అడిగినా అసలు మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని గణేష్ హామీ ఇచ్చాడు. గణేష్ హామీలను, వాగ్ధాలను విశ్వసించిన ఆయా బాధితులు మొత్తంగా రూ. 3.45 కోట్లను పెట్టుబడులుగా పెట్టారు.

ఈ అంశంలో పెట్టుబడులు పెట్టిన బాధితులు తమకు వాగ్దానం చేసిన ప్రకారం.. గడువు ముగిసిన తర్వాత, హామీ ఇచ్చిన రాబడిని చెల్లించాలని గణేష్ ను పదేపదే కోరారు. కానీ అతను వారి పెట్టుబడులను చెల్లించకపోగా, చెల్లించడానికి కూడా నిరాకరించాడు. బాధితుల నుంచి పెట్టుబడులుగా స్వీకరించిన మొత్తాలను తన సహచరుల, బినామీలకు బదిలీ చేయడంతోపాటు, వారి పేర్లతో ఆస్తులను సమకూర్చుకున్నాడు. తద్వారా బాధితుల నిధులను దారి మళ్లించి, అక్రమంగా కాజేశాడని పోలీసులు పేర్కొన్నారు.

నిందితుడు కొండపల్లి గణేష్ పెట్టుబడిదారులను మోసగించడానికి అగ్రిమెంట్ పత్రాలపై సంతకాలు చేసి, ఒప్పందాలను గౌరవించడకుండా, పెట్టుబడులను తిరిగి చెల్లించకుండా, పారిపోయి, ఉద్ధేశపూర్వకంగా తప్పించుకుంటున్నాడని పేర్కొన్నారు. అమాయక పెట్టుబడిదారులను మోసం చేయడానికి నిందితుడు కొండపల్లి గణేష్ ఇదే పద్ధతిని అవలంభిస్తున్నాడని, అనేక మందిని కుట్ర, నేరపూరితంగా మోసగిస్తున్నాడని బాధితురాలి ఫిర్యాదులోని పలు అంశాలను పోలీసులు ప్రస్తావించారు.

కొండపల్లి గణేష్ ప్రతిష్టాత్మక మైహోం భుజా రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో నివసించడం ద్వారా 2024, 2025 సంవత్సారాల్లో రూ. 29.00, రూ. 51.07 లక్షల చొప్పున వినాయకుని లడ్డూను వేలంలో దక్కించుకోవడం ద్వారా ఉద్ధేశపూర్వక విశ్వసనీయతను ఏర్పరచుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. తద్వారా ఆర్థికంగా తాను పటిష్టంగా ఉన్నట్లు, నమ్మదగిన వ్యక్తిగా ముద్ర వేయడం ద్వారా గణేష్ అనేక మంది నివాసితులను పెట్టుబడులు పెట్టేలా ప్రేరేపించినట్లు పోలీసులు కోర్టుకు నివేదించారు.

ఇలా పలువురి నుంచి పెద్ద మొత్తాలను వసూలు చేసిన తర్వాత, బాధితుల నుంచి తప్పించుకునే ఉద్ధేశంతో తన నివాసాన్ని గణేష్ హైహోం భుజా నుంచి గచ్చిబౌలిలోని పి. జనార్థన్ రెడ్డి నగర్ కాలనీలో గల రాంకీ టవర్స్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కు మార్చాడని పోలీసులు స్పష్టం చేశారు. నిందితుడు గణేష్ మొదటి నుంచీ నిజాయితీ లేని, మోసపూరిత ఉద్ధేశంతో అనేక మంది బాధితులకు తప్పుడు వాగ్గానాలు చేసి, పెట్టుబడులు పెట్టేలా ప్రేరేపించాడన్నారు. తద్వారా మోసం, నేరపూరిత విశ్వాస భంగం, కుట్ర వంటి శిక్షార్హమైన నేరాలపై బాధితుల ఫిర్యాదు మేరకు చట్ట ప్రకారం కేసు నమోదు చేసినట్లు సైబరాబాద్ క్రైమ్స్ అండ్ EOW పోలీసులు పేర్కొన్నారు.

అయితే మైహోం భుజాలో నివసించే సిల్వియా శ్రీనివాసరెడ్డి నుంచేగాక, పలువురు నుంచి రూ. 3.45 కోట్లు వసూల్ చేసి అడ్రస్ మార్చిన కొండపల్లి గణేష్ గత ఏప్రిల్ నెలఖారున ఖమ్మం కోర్టులో దివాళా పిటిషన్ దాఖలు చేయడం అసలు ట్విస్ట్. తనకు అప్పులిచ్చిన మొత్తం 95 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ, రూ. 33 కోట్ల 5 లక్షల, 95 వేల రూపాయలకు గణేష్ ఖమ్మం ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో తన లాయర్ ద్వారా ఐపీ దాఖలు చేశాడు. అయితే తన దివాళా పిటిషన్ లో ప్రతివాదులుగా గణేష్ చేర్చిన 95 మందిలో హైదరాబాద్ కు చెందిన ఆళ్ల సిల్వియా శ్రీనివాసరెడ్డి వంటి బాధితుల పేర్లు ఉన్నాయా? లేవా? అనేది పరిశీలించాల్సి ఉంది.

Popular Articles