ఖమ్మం: సీతారామ ప్రాజెక్టు లింక్ కెనాల్ పనుల్లో డొల్లతనం మళ్లీ బట్టబయలైంది. పాలకపార్టీ పెద్దలకు సన్నిహితునిగా పేరుగాంచిన ఖమ్మం జిల్లాకు చెందిన ఓ బడా కాంట్రాక్టర్ పనితనపు నిర్వాకం ఇంకోసారి సాక్షాత్కరించింది. మొన్న ఏన్కూరు వద్ద కెనాల్ సీసీ లైనింగ్ ధ్వంసమైన దృశ్యాలను మరువకముందే, అంతకన్నా భయంకరమైన డ్యామేజీ దృశ్యాలు తాజాగా జూలూరుపాడు వద్ద కనిపించడం గమనార్హం. దీంతో ఈ లింక్ కెనాల్ నిర్మాణం కోసం ప్రభుత్వం వెచ్చించిన దాదాపు 72.00 కోట్ల రూపాయల నిధులు ‘సీతారామ’ ప్రాజెక్టులో దుర్వినియోగమయ్యాయనే విమర్శలు వస్తున్నాయి.
ఏన్కూరు వద్ద లింక్ కెనాల్ ధ్వంసమైన ఘటనపై ‘సమీక్ష’ న్యూస్ ఈనెల 14న వార్తా కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. దీంతో స్పందించిన అధికారగణం సూచనతోనో, పాలకుల ఆదేశంతోనోగాని ఆఘమేఘాలపై ధ్వంసమైన సీసీ లైనింగ్ పనులకు కాంట్రాక్టర్ మరమ్మత్తులు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పరిణామాలను ప్రజలు మరువకముందే తాజాగా జూలూరుపాడు మండలంలోనూ సీతారామ ప్రాజెక్టు లింక్ కెనాల్ నిర్మాణపు పనులు ధ్వంసమైన తీరు ‘నాణ్యత’ను ప్రశ్నిస్తోంది.
ఇదీ చదవండి:
ఓ కేబినెట్ మంత్రికి, సీఎం సన్నిహితుడైన మరో నాయకుడికి అత్యంత ‘ఆప్తుడు’గా ప్రాచుర్యం పొందిన ఈ బడా కాంట్రాక్లర్ నిర్వహించిన సీతారామ ప్రాజెక్టు లింక్ కెనాల్ పనుల నాణ్యత ఎలా ఉందో అక్షర రూపంలో ఎంత చెప్పినా తక్కువే.. దిగువన గల దృశ్యాలను చూస్తే బడా కాంట్రాక్టర్ పనుల్లోని నాణ్యత డొల్లతనపు బాగోతం కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. ఇక ఆ చిత్రాలను చూసేయండి మరి..!







