Top 5 This Week

Related Posts

నాటకీయ పరిణామాల మధ్య ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్

చెన్నై: చెన్నైలో మంగళవారం ఉదయం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. నటి త్రిషపై చేసిన వ్యాఖ్యలు చేశారనే అభియోగాలపై నమోదైన కేసులో తమిళనాడు పోలీసులు ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్‌ను ఆయన నివాసం వద్ద అరెస్టు చేశారు. సోమవారం జరిగిన ఒక ర్యాలీలో నటి త్రిష గురించి స్టాలిన్ జూనియర్ చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారితీశాయి. డీఎంకే నేత ఉదయనిధి చేసిన ఆ అభ్యంతరకర వ్యాఖ్యలను అధికార టీవీకే (TVK) పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది.

అయితే పోలీసులు తనను అదుపులోకి తీసుకుని వెళ్తున్నప్పుడు చిరునవ్వుతో కనిపించిన ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ, ఈ అరెస్టును ఒక ‘జోక్’ గా భావిస్తున్నానని, దీనిని “చట్టపరంగా ఎదుర్కొంటానని” చెప్పారు. ఉయదనిధి అరెస్టు రాజకీయ కక్షసాధింపు చర్యగా డీఎంకే విమర్శించింది. ‘ఎవరికీ వ్యతిరేకంగా ఏమీ అనలేదు. విజయ్ వైఫల్యాలను ఉదయనిధి ఎత్తిచూపారు. ఆ ప్రసంగంలో అవమానకరమైనదేమీ లేదు. ఆయన త్రిష పేరును కూడా ప్రస్తావించలేదు’ అని డీఎంకే నేత టీకేఎస్ ఎలాంగోవన్ అన్నారు.

ఇదే సందర్భంలో టీవీకే నేత అమెరికై నారాయణన్ మాట్లాడుతూ, ఉయయనిధి అరెస్టుపై వచ్చిన కక్షసాధింపు ఆరోపణలను తోసిపుచ్చారు. ‘సీఎం విజయ్ కు, లేదా టీవీకేకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఉదయనిధి స్టాలిన్‌ను అరెస్టు చేయలేదు, ఒక మహిళను అవమానించినందుకే పోలీసులు అతన్ని అరెస్టు చేశారు’ అని ఆయన అన్నారు. ఉదయనిధి తన పేరును ‘వల్గర్-నిధి’గా మార్చుకోవాలని టీవీకే నేత నారాయణ్ ఏద్దేవా చేస్తూ వ్యాఖ్యానించారు.

సోమవారం తంజావూరులో కావేరీ వివాదంపై జరిగిన నిరసన సభలో ఉదయనిధి ప్రసంగిస్తూ, తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్‌పై విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల తమిళనాడుకు కావేరీ నీటిలో ఒక్క చుక్క కూడా రాలేదని ఆయన ఆరోపించారు. అయితే ఇదే సమయంలో సభలోని కొందరు ‘త్రిష.. త్రిష’ నినదించడంతో పరిస్థితి వివాదాస్పదంగా మారింది. ఈ సమయంలో ఉదయనిధి తన ప్రసంగాన్ని ఆపి, ముఖంలో వెటకారపు నవ్వుతో అభ్యంతరకరమైన, ద్వంద్వార్థం వచ్చేలా స్పందించారు. ఈ సందర్భంగా చేసిన ఆయా వ్యాఖ్య రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపింది.

ఉదయనిధి వ్యాఖ్యను టీవీకే పార్టీ తీవ్రంగా ఖండిస్తూ, డీఎంకే నేతపై చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్‌కు లేఖ రాసింది. అలాగే ఆ పార్టీ నాయకుడు ఉదయనిధిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. ‘సభలోని వ్యక్తుల నినాదాల ప్రేరణతో ఉదయనిధి స్టాలిన్ ఒక ప్రముఖ మహిళా ప్రజా వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని అభ్యంతరకరమైన, ద్వంద్వార్థం, అసభ్యకరమైన అర్థాలు వచ్చేలా వ్యాఖ్యలు చేశారు’ అని టీవీకే తన ఫిర్యాదులో పేర్కొంది. ‘అత్యున్నత స్థాయి రాజకీయ వేదిక నుంచి ఇలాంటి భాషను ఉపయోగించడం వల్ల, బహిరంగ ప్రదేశాల్లో మహిళలను కేవలం ఒక వస్తువుగా చూడటం, వారిని మాటలతో వేధించడం వంటివి సాధారణ విషయాలుగా మారిపోయే ప్రమాదం ఉంది’ అని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

కాగా అంతకుముందు తమిళనాడు బీజేపీ కూడా స్పందిస్తూ, ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది.
‘తంజావూరులో ముఖ్యమంత్రి విజయ్, త్రిషల గురించి ఉదయనిధి స్టాలిన్ చేసిన ద్వంద్వార్థపు వ్యాఖ్యల ప్రసంగం అసహ్యకరమైనదిగా, అశ్లీలమైనదిగా, నీచమైనదిగా పేర్కొంటూ, సిగ్గుచేటు. నిజానికి, తల్లి, భార్య, కుమార్తె ఉన్న ఒక దుర్మార్గుడు లేదా దొంగ కూడా ఇంత నీచంగా మాట్లాడడు. అలా మాట్లాడేవారిని ఏ తల్లీ, భార్యా, కుమార్తె కూడా క్షమించరు. కానీ ‘ద్రవిడ నమూనా’ అని చెప్పుకునే వ్యక్తులు బహిరంగంగా ఇలా మాట్లాడుతుంటే మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్ మౌనంగా చూస్తూ ఉండిపోవడం సిగ్గుచేటు’ అని బీజేపీ ప్రధాన ప్రతినిధి నారాయణన్ తిరుపతి సోమవారం వ్యాఖ్యానించారు. ‘ఈ నీచమైన ప్రసంగం కారణంగా ఉదయనిధి స్టాలిన్‌ను అరెస్టు చేసి జైలుకు పంపడం తమిళనాడుకు గౌరవాన్ని తెచ్చిపెడుతుంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.


అయితే నటిత్రిష గురించి అభ్యంతరకరమైన రీతిలో తమిళనాడుకు చెందిన కొందరు మాట్లాడటం ఇదే మొదటిసారి కాకపోవడం గమనార్హం. ఇటువంటి సందర్భాల్లో ఆ వ్యక్తులు తరచుగా సీఎం విజయ్ ను ప్రధాన టార్గెట్ గా ఎంచుకుంటున్నట్లు కనిపిస్తోంది. వారిద్దరి మధ్య సంబంధం ఉందనే పుకార్లు వచ్చినప్పటి నుండి, సినీ, రాజకీయ రంగాలకు చెందిన వ్యక్తులు దీనిపై ఇష్టానుసారం వ్యాఖ్యానిస్తూ వస్తున్నారు. రాజకీయాల్లోకి ప్రవేశించే ముందు విజయ్ ‘త్రిష ఇంటి నుండి బయటకు రావాలి’ అని తమిళనాడు బీజేపీ నాయకుడు నైనార్ నాగేంద్రన్ ఈ ఏడాది ప్రారంభంలో వ్యాఖ్యానించారు.

కాగా ఈ అంశంపై తంజావూరు తూర్పు పోలీసులు ఉదయనిధి స్టాలిన్‌పై బీఎన్ఎస్ చట్టంలోని 61, 79, 192, 196, 296(b), 351(2), 352 సెక్షన్లు, అలాగే ‘తమిళనాడు మహిళల వేధింపుల నిరోధక చట్టం’లోని సెక్షన్ 4, ఐటీ చట్టంలోని సెక్షన్ 67 కింద కేసు నమోదు చేశారు.

Popular Articles