Top 5 This Week

Related Posts

మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయ సేకరణ: భట్టి

హైదరాబాద్: మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పనులపై ప్రజాభిప్రాయ సేకరణ జరపనున్నట్లు తెలంగాణా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. పదిహేను రోజులపాటు ఈ అంశంలో ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తామన్నారు. విలువైన సూచనలు చేసినవారితో కేబినెట్ సబ్ కమిటీ భేటీ అవుతుందని భట్టి పేర్కొన్నారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పనులు ప్రజాస్వామ్య పద్ధతిలో కొనసాగుతాయన్నారు. మంగళవారం సచివాలయంలో మంత్రి, మూసీ క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యుడు పొన్నం ప్రభాకర్ తో కలిసి మూసీనది పునరుజ్జీవన పనుల ప్రగతిపై అధికారులతో చర్చించారు.

ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ, మార్చి 31 నుంచి ఏప్రిల్ 15 వరకు ఆన్ లైన్ లో musirdc@gmail.com మెయిల్ ఐడి ద్వారా మూసీ పునరుజ్జీవనంపై ప్రజల అభిప్రాయాలు స్వీకరిస్తామన్నారు. ఆన్ లైన్ లో వచ్చిన విలువైన సలహాలు, సూచనలను అన్నింటిని అధికారులతో కూర్చొని, విశ్లేషణ చేసి అభిప్రాయాలు వెల్లడించిన వారితో నేరుగా దశలవారీగా సబ్ కమిటీ సభ్యులు సంప్రదింపులు చేస్తారని డిప్యూటీ సీఎం తెలిపారు. మూసీ నది ఒడ్డున ఓంకారేశ్వర ఆలయం పనులకు ఈనెల 28న శంకుస్థాపన జరిగిందని, ఆ రోజు నుంచి మూసీ ఫేస్ -1, ఫేస్- 2 వరకు చేయాల్సిన పనులకు సంబంధించిన రోడ్ మ్యాప్ ను సిద్ధం చేసుకోవాలని భట్టి అధికారులను ఆదేశించారు.

డిఫెన్స్ భూములు, మూసీ పునరావాసితులతో సంప్రదింపులు, నిర్మాణ డిజైన్లు తుది దశకు తీసుకురావడం, బ్యాంకర్స్ తో మాట్లాడటం ఇలా పనులను ఎక్కడికక్కడ విభజన చేసుకొని ముందుకు వెళ్లాలని అధికారులకు డిప్యూటీ సీఎం సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి యావత్ కేబినెట్ సంకల్పాన్ని అర్థం చేసుకొని అధికారులు ఉత్సాహంగా ముందుకు వెళ్లాలన్నారు. మీ జీవితాల్లో ఈ ప్రాజెక్టు ఒక మైలురాయిగా నిలుస్తుందని అధికారులకు డిప్యూటీ సీఎం నిర్దేశించారు. ఈ అంశంలో అధికారులకు ఎలాంటి సలహా, సూచన ఇతర ఏ అవసరాలు ఉన్న మూసీ సబ్ కమిటీ సభ్యులు 24 గంటల పాటు అందుబాటులో ఉంటారని తెలిపారు.

సమావేశంలో స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి. ఇవి. నరసింహారెడ్డి, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమి, అధికారులు వినయ్ కృష్ణారెడ్డి , అశోక్ రెడ్డి, కలెక్టర్లు హరిచందన, నారాయణరెడ్డి, మన చౌదరి, జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్వీ కర్ణన్ తదితరులు పాల్గొన్నారు

Popular Articles