Top 5 This Week

Related Posts

మీ పిల్లలకూ ఇలానే భోజనం పెడతారా?: కలెక్టర్ ఆగ్రహం

దమ్మపేట: పాఠశాల విద్యార్థులకు అందిస్తున్న ఆహారంపై భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీ పిల్లలకు కూడా ఇలానే భోజనం పెడతారా?’ అని సిబ్బందిని ప్రశ్నించారు. జిల్లాలోని దమ్మపేట మండలంలో కలెక్టర్ అంకిత్ బుధవారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయం, పలు పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు అందుతున్న సేవలు, విద్యార్థులకు అందుతున్న సదుపాయాలు, ముఖ్యంగా మధ్యాహ్న భోజన నాణ్యతపై సమగ్రంగా ఆరా తీశారు.

ఇందులో భాగంగానే దమ్మపేట తెలంగాణ గిరిజన సంక్షేమ బాలుర ఉన్నత పాఠశాలను పరిశీలించిన కలెక్టర్,ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు వడ్డించేందుకు సిద్ధంగా ఉన్న భోజనాన్ని నేరుగా పరిశీలించారు. మెనూ ప్రకారం ఈ రోజు చికెన్ బగారా రైస్ అందించాల్సి ఉండగా, అది అందుబాటులో లేకపోవడాన్ని గమనించిన కలెక్టర్, మెనూ పాటించకపోవడంపై సంబంధిత సిబ్బందిని ప్రశ్నించారు. విద్యార్థులకు అందించవలసిన ఆహారాన్ని ఎందుకు ప్రదర్శించడం లేదని, వెంటనే ప్రదర్శించాలని ఆదేశించారు.

విద్యార్థులకు అందిస్తున్న ఆహార నాణ్యతపై ప్రశ్నిస్తున్న భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్

విద్యార్థులకు వడ్డించడానికి సిద్ధంగా ఉన్న ఆహారాన్ని స్వయంగా రుచి చూసిన కలెక్టర్, ఆహార నాణ్యతపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. “మీ పిల్లలకు కూడా ఇలానే భోజనం పెడతారా?” అని ప్రశ్నిస్తూ వంట సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీల్మేకర్ కూర సరిగా ఉడకపోవడం, రుచి, నాణ్యత లోపించడంపట్ల అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థులకు పోషక విలువలుగల నాణ్యమైన ఆహారం అందించాలని, భవిష్యత్తులో నిర్లక్ష్యం పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.

అదేవిధంగా విద్యార్థులు చేతులు శుభ్రం చేసుకునే ప్రదేశంలో కుళాయిలకు ట్యాప్‌లు లేకపోవడంతో నీరు వృథాగా పోతున్న పరిస్థితిని గమనించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ఈ పర్యటనలో తహసీల్దార్ రామ్ నరేష్, ఎంపీడీవో రవీందర్ రెడ్డి, ఎంఈఓ జగదీష్, ఉపాధ్యాయురాలు స్టెల్లా, వార్డెన్ దుర్గ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Popular Articles