Top 5 This Week

Related Posts

బడా కాంట్రాక్టర్ ‘పనితనం’..! సీతారామ కాల్వ నాణ్యత ‘పగిలిపోయింది’!!

ఖమ్మం: సీతారామ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా చేపట్టిన ఓ లింక్ కెనాల్ పనులు అప్పుడే ధ్వంసమైన ఘటన పనుల నాణ్యతను ప్రశ్నిస్తోంది. పది కాలాలపాటు మన్నికగా ఉండాల్సిన పనులు అప్పుడే ‘పగిలి’పోతున్న వైనం కాంట్రాక్టర్ పనితీరుపై పలు ప్రశ్నలను రేకెత్తిస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని భూములను సస్యశ్యామలం చేసేందుకు తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ బహుళార్థ సాధక ప్రాజెక్టు పనులను బడా బడా కాంట్రాక్టర్లే నిర్వహిస్తున్నారు.

సీతారామ ప్రాజెక్టు కొత్తగూడెం సీఈ శ్రీనివాసరెడ్డి చెబుతున్న ప్రకారమే ఈ కాల్వ పనుల నాణ్యత కనీసం 25-30 ఏళ్లపాటు నిలవాలి. కానీ నిర్మించిన ఏడాదికే ఇలా ధ్వంసమైన చిత్రాలు కాంట్రాక్టర్ పనితీరుకు ప్రబల నిదర్శనంగా స్థానిక రైతులు అభివర్ణిస్తున్నారు.

ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం రేపల్లెవాడ-ఇమామ్ నగర్ మధ్య నిర్మించినటువంటి సీతారామ ప్రాజెక్టు లింక్ కెనాల్ సీసీ లైనింగ్ పనులు ఎలా ఉన్నాయో పెద్దగా ఉపోద్ఘాతం అక్కర్లేదు. అనేకానేక అక్షరాల కథనమూ అవసరం లేదు. ఈ దృశ్యాలే చెబుతున్నాయి పనుల నాణ్యత ఏపాటిదో..?

చూశారుగా.. సీతారామ ప్రాజెక్టు ఏన్కూరు సమీపంలోని లింక్ కెనాల్ దుస్థితిని..? ఈ పనులు చేసింది ఎవరో సాధారణ కాంట్రాక్టర్ కాదు సుమీ.. అత్యంత బడా కాంట్రాక్టర్. కాకపోతే ఈ కాంట్రాక్టర్ అధికార పార్టీకి చెందిన ఓ మంత్రితో, సీఎం రేవంత్ రెడ్డికి కుడిభుజంగా వ్యవహరిస్తున్న మరో బడా నాయకునితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నట్లు బహుళ ప్రాచుర్యం పొందారు. దీంతో పనుల నాణ్యతపై అధికారులు కూడా కిమ్మనడం లేదట.

దాదాపు 72 కోట్లతో నిర్మించినట్లు తెలుస్తున్న ఈ కాల్వ ‘ధ్వంస’ స్థితిపై సీతారామ ప్రాజెక్టు కొత్తగూడెం చీఫ్ ఇంజనీర్ శ్రీనివాసరెడ్డిని ‘సమీక్ష’ ప్రశ్నించగా, ఇటీవల ఈ కాల్వ ద్వారా వదిలిన 1,700 క్యూసెక్కుల నీటి ప్రవాహానికి ఇలా ధ్వంసమైందట. వాస్తవానికి కాల్వ సామర్థ్యం 1,400 క్యూసెక్కుల నీరు మాత్రమేనని, నీటి విడుదల సందర్భంగా మోటార్ ఎక్కువ ఉధృతితో నీటిని ఎత్తిపోయడం వల్ల 1,700 క్యూసెక్కులు ప్రవహించి ఇలా జరిగిందట! బాగుంది కదా.. బడా కాంట్రాక్టర్ పనుల నాణ్యత+చీఫ్ ఇంజనీర్ వివరణ..!!

Popular Articles