ప్రపంచాన్ని యుద్ధ మేఘాలు కమ్మేస్తున్న తరుణంలో పశ్చిమాసియా రాజకీయాల్లో అనూహ్య మార్పు చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువు ముగియడానికి కొన్ని గంటల ముందే, ఇరాన్‌తో రెండు వారాల పాటు కాల్పుల విరమణకు (Ceasefire) అంగీకారం కుదిరింది. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మధ్యవర్తిత్వం వహించిన ఈ ప్రతిపాదనకు ఇరు దేశాలు సానుకూలత వ్యక్తం చేయడం అంతర్జాతీయ సమాజాన్ని ఆశ్చర్యపరిచింది.
తెల్లావారేసరికే ఇరాన్ ను నాశనం చేస్తానన్న అమెరికా సంధి మార్గం ఎందుకు?
గత కొద్ది రోజులుగా ఇరాన్‌ను సర్వనాశనం చేస్తామని అమెరికా, ఇజ్రాయెల్ తీవ్ర హెచ్చరికలు చేస్తున్నప్పటికీ, అకస్మాత్తుగా సంధికి అంగీకరించడం వెనుక బలమైన ఆర్థిక లెక్కలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రపంచ ఇంధన సరఫరాకు గుండెకాయ వంటి హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో ముడిచమురు ధరలు ఆకాశాన్నంటాయి. యుద్ధం గనుక కొనసాగితే అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని గ్రహించిన ట్రంప్, తన దూకుడును తగ్గించి చర్చల మార్గాన్ని ఎంచుకున్నారు.
- ఇరాన్ పెట్టిన 10 సూత్రాల ‘చెక్’!
- ఈ కాల్పుల విరమణను ఇరాన్ తన నైతిక విజయంగా భావిస్తోంది. చర్చల కోసం ఇరాన్ పెట్టిన 10 ప్రధాన డిమాండ్లు అమెరికాను ఆత్మరక్షణలో పడేశాయి.
- హార్మూజ్ జలసంధిపై పూర్తి నియంత్రణ ఇరాన్‌కే ఉండాలి.
- ఆర్థిక ఆంక్షలను తక్షణమే ఎత్తివేయాలి.
- ఇరాన్ భూభాగం నుంచి అమెరికా సైన్యం నిష్క్రమించాలి.
- నిలిపివేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయాలి.
- ఈ షరతులకు ట్రంప్ “సూత్రప్రాయంగా” అంగీకరించడం గమనార్హం. అయితే, యురేనియం సుసంపన్నత విషయంలో మాత్రం అమెరికా కఠిన నిబంధనలను విధిస్తోంది.
మొజ్తాబా ఖమేనీ హెచ్చరిక: వేళ్లు ఇంకా ట్రిగ్గర్‌పైనే!
ఒకవైపు కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినప్పటికీ, ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ చేసిన వ్యాఖ్యలు యుద్ధ భయాన్ని ఇంకా పోగొట్టలేదు. “ఇది యుద్ధానికి ముగింపు కాదు.. మా వేళ్లు ఇంకా ట్రిగ్గర్‌పైనే ఉన్నాయి” అని ఆయన హెచ్చరించారు. శత్రువుల కదలికల పట్ల అప్రమత్తంగా ఉండాలని తన సైన్యాన్ని ఆదేశించడం ద్వారా, ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగిపోయే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ఎవరి ప్రతిష్ట పెరిగింది?
ఇరాన్: అగ్రరాజ్యం తనపై దాడులు చేయలేక వెనక్కి తగ్గిందని, తమ ప్రతిఘటన ముందు అమెరికా ఓటమిని ఒప్పుకుందని ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రకటించింది. ఇది ఇరాన్ ఆత్మవిశ్వాసాన్ని పెంచే విషయం.
అమెరికా: మరోవైపు, ట్రంప్ తనను తాను ఒక “శాంతి దూత”గా (Deal Maker) నిరూపించుకోవాలని చూస్తున్నారు. యుద్ధం లేకుండానే ఇరాన్ అణు కేంద్రాలపై అంతర్జాతీయ పర్యవేక్షణ సాధిస్తే అది ట్రంప్ దౌత్య విజయం అవుతుంది.
ప్రపంచ దేశాల స్పందన:
అమెరికా ఏకపక్ష వైఖరిని ఎండగడుతూనే, ఈ సంధి ప్రయత్నాలను ఆహ్వానిస్తున్నాయి. ఇరాన్‌కు వీటి మద్దతు దౌత్యపరంగా పెద్ద ఊరట.
భారత్ ఈ పరిణామాలను అత్యంత ఆశావహంగా చూస్తోంది. చమురు ధరలు తగ్గడం, రవాణా మార్గాలు తెరుచుకోవడం భారత ఆర్థిక వ్యవస్థకు ఊపిరినిచ్చే అంశం.
14 రోజుల తర్వాత ఏమవుతుంది?
ప్రస్తుతానికి 14 రోజుల గడువు లభించినప్పటికీ, శాశ్వత శాంతి నెలకొనడమనేది ఏప్రిల్ 10న ఇస్లామాబాద్‌లో జరిగే ప్రత్యక్ష చర్చలపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ చర్చలు విఫలమైతే, ట్రంప్ అన్నట్లుగా మళ్లీ దాడులు మొదలయ్యే ప్రమాదం ఉంది. పశ్చిమాసియా ఇప్పుడు ఒక సున్నితమైన మలుపులో ఉంది.

✍️ జంపన్న
( డెమొక్రటిక్ సోషలిస్ట్)

