ఖమ్మం రూరల్: పాలేరు నియోజకవర్గంలలోని ఏదులాపురం మున్సిపాలిటీలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం పర్యటించారు. మున్సిపాలిటీ పరిధిలోని 22, 23వ వార్డులైన సాయిగణేష్ నగర్, సత్యనారాయణపురం, ఇందిరమ్మ కాలనీల్లో కాలినడకన తిరుగుతూ అభివృద్ధి పనులు, పారిశుధ్య పరిస్థితులు, ప్రజా మౌళిక వసతులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి వారి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలోనే ఏదులాపురాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. ఏదులాపురం మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి కోసం రూ.100 కోట్ల నిధులను సీఎం రేవంత్ రెడ్డి మంజూరు చేశారని చెప్పారు.
అనంతరం మంత్రి తిరుమలాయపాలెం మండలంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి, ఏదులాపురం మునిసిపల్ చైర్ పర్సన్ పోకబత్తిని అనిత, మునిసిపల్ కమీషనర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

