Top 5 This Week

Related Posts

జర్నలిజాన్ని దిగజారుస్తున్నదెవరు?

“మీడియా బాగా దిగజారిపోయింది. మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా అమ్ముడుపోతోంది.” అనే మాటలు తరచూ వింటున్నాం. ఇలా అనుకోవటానికి కారణం ఇప్పటిదాకా మీడియా గురించి కాస్త ఉన్నతంగా ఆలోచించటమే. కానీ, జాగ్రత్తగా గమనిస్తే అన్ని రంగాల్లో వస్తున్న మార్పులే మీడియాలో కూడా కనబడుతున్నాయి. ‘విలువల క్షీణత’ లాంటి పెద్ద మాటలు మాట్లాడ్డం అనవసరం. ఆ క్షీణత మీడియాలో పనిచేస్తున్నవాళ్ళదా? వాళ్ళను నడిపించే యాజమాన్యాలదా? ఆ యాజమాన్యాలను వెనకనుంచి నడిపించే రాజకీయ పార్టీలదా? ఈ ప్రశ్నలకు జవాబులు ఆలోచిస్తే ఇప్పటి పరిస్థితికి కారణాలు అర్థమవుతాయి.

యజమాని కోణంలో ఆలోచిస్తే, “ కోట్లు గుమ్మరించిన యాజమానిని” అనే స్పృహ యజమాని మనసులోనుంచి ఒక్క క్షణం కూడా మాయం కాదు. మీడియా అధిపతిని అని చెప్పుకోవటంలో ఉండే హోదాను ఆస్వాదిస్తాడు. ఆ హోదా వలన వచ్చే పలుకుబడి తన వ్యాపారాలకు ఎలా ఉపయోగపడుతుందో ఆలోచిస్తూ వస్తాడు. అదే సమయంలో తన ఎడిటర్ కి ఉన్న కాస్తో కూస్తో పేరు, అధికారంలో ఉన్న పెద్దలతో ఉన్న పరిచయాలు కూడా తనకు మాత్రమే ఉపయోగపడాలని కోరుకుంటాడు. ఎందుకంటే, ఆ ఎడిటర్ తన ఉద్యోగి మాత్రమే అనే స్పృహ ఎలాగూ ఉండనే ఉంటుంది. ఈ విషయాన్ని రాజకీయ పార్టీలు కూడా గుర్తించాయి. ఒకప్పుడు ఎడిటర్ల పట్ల మర్యాదగా వ్యవహరించి వాళ్ళ దగ్గర మంచి మార్కులు కొట్టేసే పనిలో ఉండేవి. కానీ, ఆ తరువాత కాలంలో రాజకీయ పార్టీల, నాయకుల ఆలోచనలో మార్పు వచ్చింది. పత్రికలను తమ వైపు తిప్పుకోవాలంటే వాటి యాజమానులను ప్రసన్నం చేసుకోవాలి తప్ప ఎడిటర్లను కాదన్న సంగతి అర్థమైపోయింది. ఎడిటర్ అనేవాడు కేవలం ఆ పత్రిక యజమాని దగ్గర ఉద్యోగి మాత్రమేనన్న అభిప్రాయం క్రమంగా బలపడింది.

నార్ల వెంకటేశ్వర్ రావు

ఇదేమీ ఇప్పటికిప్పుడు కనబడుతున్న ధోరణి కాదు. రాజ్యసభ సభ్యత్వాలివ్వటంలోనే రాజకీయ పార్టీల వైఖరి బైటపడింది. ఆంధ్రపత్రికను 30 ఏళ్ళకు పైగా నడిపిన శివలెంక శంభుప్రసాద్ 1952లో రాజ్యసభ సభ్యుడయ్యారు. ఆంధ్రపత్రికలో సిబ్బంది ఆయనను ఎంతో గౌరవంగా ‘అయ్యగారూ..’ అనే పిలిచేవారని చెబుతారు. రాజ్యసభ సభ్యత్వం తరువాత ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలోనూ ఆయనకు సభ్యత్వం దక్కింది. ఆ తరువాత 1958 నుంచి 70 దాకా రెండు విడతలు నార్ల వెంకటేశ్వరరావుకు రాజ్యసభ సభ్యత్వం వచ్చింది. ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి పత్రికల్లో ముప్పై ఏళ్ళకు పైగా సంపాదకుడిగా పనిచేసిన నార్ల తెలుగు జర్నలిజంలో తనదైన ముద్రవేశారు. అలాంటి వారిని రాజ్యసభకు పంపటం తగినవిధంగా గౌరవించడమే.

నిజానికి ‘ఆంధ్రజ్యోతి’ కేవలం ఒక ఎడిటర్ కోసం పత్రిక పెట్టిన సందర్భానికి ఒక ఉదాహరణగా చెబుతారు. పేరుమోసిన సంపాదకుడు నార్ల అప్పట్లో ఆంధ్రప్రభ నుంచి తప్పుకొని ఖాళీగా ఉండటంతో ఆయన కోసం కె.యల్.ఎన్. ప్రసాద్ ఆధ్వర్యంలో కొంతమంది ప్రముఖులు ఆంధ్రజ్యోతి దినపత్రిక పెట్టారు. ఆంధ్రప్రభలో ఆయన ఉన్న కాలంలోనే మొదలై ఆంధ్రజ్యోతిలో పదేళ్ళు పూర్తిచేసుకునేదాకా ఆయన రాజ్యసభ సభ్యత్వం కొనసాగింది. అయితే, ఆ తరువాత ఈ సంప్రదాయం తెలుగు జర్నలిస్టులకు వర్తించలేదు. నార్ల తరువాత రాజ్యసభ సభ్యత్వాల విషయంలో రాజకీయ పార్టీల.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే కాంగ్రెస్ వాళ్ళ ఆలోచన మారిపోయింది.

నార్ల రెండు విడతల పదవి ముగిసిన వెంటనే 1970లో ఆంధ్రజ్యోతి యజమాని కానూరు లక్ష్మీ నారాయణ ప్రసాద్ అనే కెఎల్ఎన్ ప్రసాద్ రాజ్యసభ సభ్యుడయ్యారు. ఆ విధంగా రాజ్యసభ సభ్యత్వపు గౌరవం ఎడిటర్ నుంచి యజమానికి బదిలీ అయింది. అలా మూడు విడతలు అదే పదవి ఆయనకు కొనసాగి 1987లో ఆయన చనిపోయేవరకూ ఉంది. అప్పట్లో ఆంధ్రజ్యోతి కాంగ్రెస్ పత్రికగా పేరుబడ్ద సంగతి తెలిసిందే.

తిక్కవరపు చంద్రశేఖర్ రెడ్డి

ఇంకోవైపు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉండే డెక్కన్ క్రానికల్ యజమాని తిక్కవరపు చంద్రశేఖరరెడ్డికి కూడా రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాల్సి వచ్చింది. రెడ్ల పార్టీగా ముద్రపడి ఉండటం, పాఠకాదరణ ఉన్న ఇంగ్లిష్ పత్రిక క్రానికల్ తోబాటు తెలుగు పత్రిక ఆంధ్రభూమి కూడా ఉండటం, ఢిల్లీలో లాబీయింగ్ చేయగల సత్తా ఉన్న జాతీయ స్థాయి జర్నలిస్ట్ జీకే రెడ్డి అండదండలు బాగానే పనిచేశాయి. ఆ విధంగా 1981 నుంచి 1993దాకా మూడు విడతలు ఆయన ఆ హోదాలో కొనసాగారు. మూడో విడత రాజ్యసభ సభ్యునిగా ఉండగానే ఆయన చనిపోతే, వారసత్వంగా ఆ మిగిలిన కాలానికి ఆయన కొడుకు వెంకట్రామిరెడ్డికి రాజ్యసభ సభ్యత్వం దక్కింది.

గిరీష్ సంఘీ

ఆ తరువాత కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ తన అనుకూల పత్రిక యాజమానిని రాజ్యసభకు పంపింది. ఆయనే వార్త యజమాని గిరీష్ కుమార్ సంఘీ. ఉదయం మూతబడిన వేళ ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి అందించే బలం చాలీచాలని స్థితిలో కాంగ్రెస్ పార్టీకి బలమైన పత్రిక అండ అవసరమైంది. ఈనాడు ను టార్గెట్ చేసుకొని మొదలుపెట్టిన వార్తను వాడుకోవాలన్న కాంగ్రెస్ వ్యూహం ఫలించింది. అప్పట్లో కాస్త గట్టి పత్రికగానే పేరుబడ్డ ‘వార్త’ కూడా కాంగ్రెస్ కు అనుకూలంగా పని చేస్తూ వచ్చింది. ఆ పాకేజ్ లో భాగంగానే 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆయనను రాజ్యసభకు పంపింది. 2010 వరకూ ఆయన ఆ హోదాలో కొనసాగారు.

కె. కేశవరావు

పాత్రికేయం ఒక వృత్తిగా కాకుండా ఒక ఉద్యోగంగా మారినప్పుడే విలువల చర్చకు అర్థం లేకుండా పోయింది. ఒకప్పుడు మీడియా సంస్థలు ఎడిటోరియల్ పాలసీ ఒకటి పెట్టుకునేవి. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు. ఎప్పటికప్పుడు ఆ పాలసీ మారిపోతోంది. ఒక పార్టీకి అనుకూలంగా ఉండాలని కూడా కాదు.. ఆ పార్టీలో ఎవరికి అనుకూలంగా, ఎవరికి వ్యతిరేకంగా ఉండాలో కూడా నిర్దేశిస్తున్న పరిస్థితి వచ్చింది. ఏ పత్రికలో/ఛానల్ లో ఏ వార్త ఎలా వస్తుందో పాఠకులు/శ్రోతలు సులభంగా అంచనా వేయగలుగుతున్నారంటే మీడియా విశ్వసనీయత గురించి కొత్తగా చెప్పుకోవడానికేముంది?

రాపోలు ఆనంద భాస్కర్

మీడియా అనేది ముమ్మాటికీ ఒక వ్యాపారమైనప్పుడు లాభార్జనే ధ్యేయం కావటం అత్యంత సహజం. అంతెందుకు.. ఎడిటర్ ఛాంబర్ కంటే మార్కెటింగ్ హెడ్ ఛాంబర్ సైజ్ పెరిగినప్పుడే మీడియా అంటే వ్యాపారమేనన్న సంగతి తేలిపోయింది. ఎడిటరే దండగ అనుకునేవాళ్ళు ఓనమాలు రాకపోయినా స్వయంప్రకటిత ఎడిటర్ హోదాతో వ్యాపారం నడిపే దుస్సాహసానికి పాల్పడుతున్నారు.

ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. కొత్తగా చెప్పుకోవడానికేమీ లేదు. అయినా సరే, మీడియా గురించి ఎక్కువగా ఊహించుకోవటం, ఆ ఊహలకు తగినట్టు లేదని బాధపడటం అత్యాశ కాదా? ఈ చట్రంలో ఇమడలేక సొంత వేదికల మీద గొంతెత్తి సంతృప్తి చెందుతున్నవాళ్ళు మాత్రమే అక్కడక్కడా కనబడుతున్నారు. కానీ ఇందులోనూ జర్నలిజం ముసుగులో ఇన్ ఫ్లూయెన్సర్లు చొరబడి అమ్ముడు పోవటానికి సిద్ధమవుతుంటే ఇంకెక్కడి మీడియా విలువలు?

Popular Articles