Top 5 This Week

Related Posts

క్రీం + పామాయిల్ + వనస్పతి + గంజి + ఫ్లేవర్స్ = ప్యూర్ ఆవు నెయ్యి..! తింటే ‘గుండె’ గుభేల్!!

హైదరాబాద్: తెలంగాణా రాజధాని నగరంలో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ నెయ్యి తయారీ, విక్రయ ముఠాలపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్, టాస్క్ ఫోర్స్ (H-FAST), ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ మంగళవారం సంయుక్తంగా దాడులు జరిపింది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఒకేసారి 130 ప్రాంతాల్లోని 39 తయారీ కేంద్రాల్లో, 91 విక్రయ దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి భారీ కల్తీ నెయ్యి దందాను బట్టబయలు చేశారు.

ఈ దాడుల్లో దాదాపు 36 టన్నుల కల్తీ నెయ్యి, దానికి ఉపయోగించే ముడి పదార్థాలు, హానికర రసాయనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సంఘటనా స్థలంలో ఫుడ్ సేఫ్టీ ఇన్‌స్పెక్టర్లు శాంపిళ్లను సేకరించి ల్యాబ్‌కు పంపగా, స్వాధీనం చేసుకున్న సరుకును తదుపరి చట్టపరమైన చర్యల కోసం ఫుడ్ సేఫ్టీ అథారిటీకి అప్పగించారు.

స్వాధీనం చేసుకున్న వస్తువుల వివరాలు:
• కల్తీ నెయ్యి: సుమారు 25.5 టన్నులు
• క్రీమ్ (ముడి సరుకు): సుమారు 8.7 టన్నులు
• పామ్ ఆయిల్: 1,200 లీటర్లు
• వనస్పతి (డాల్డా): 600 లీటర్లు
• కృత్రిమ నెయ్యి సువాసన ద్రవాలు (Flavours): 3 రకాలకు చెందిన 6 బాటిళ్లు
• స్టార్చ్ (పిండి పదార్థం): 30 కేజీలు
• మొత్తం: 36 టన్నులు

తయారీ విధానం:
అత్యంత ప్రమాదకరమైన పద్ధతుల్లో కల్తీ నెయ్యిని తయారు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. పాలు లేని పదార్థాలతో కల్తీ చేస్తున్నారు. పాల ఘనపదార్థాలకు పామ్ ఆయిల్, వనస్పతి (డాల్డా), కృత్రిమ సువాసన రసాయనాలను కలిపి అసలు నెయ్యిలా భ్రమింపజేస్తున్నారు. అసలు పాలు లేకుండానే స్కిమ్డ్ మిల్క్ పౌడర్ (0% ఫ్యాట్), పామ్ ఆయిల్, వనస్పతి, స్టార్చ్, రసాయన సువాసనలు కలిపి బొత్తిగా పాలు, వెన్న లేకుండానే నెయ్యిని సృష్టిస్తున్నారు.

    లేబులింగ్ నిబంధనల ఉల్లంఘన:
    కల్తీ నెయ్యిని ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేసి ‘100% ప్యూర్ నెయ్యి’, ‘ప్రీమియమ్ నెయ్యి’, ‘ఫార్మ్ ఫ్రెష్ నెయ్యి’, ‘నేచురల్ నెయ్యి’ అనే పేర్లతో మార్కెట్లోకి వదులుతున్నారు. వీటిపై ఎలాంటి FSSAI లైసెన్స్ నెంబర్ గానీ, బ్యాచ్ నెంబర్ గానీ, తయారీ/ఎక్స్‌పైరీ తేదీలు ఉండటం లేదు.

    ఎక్కడెక్కడ విక్రయిస్తున్నారంటే..?
    ఈ నెయ్యిలో 10% నుండి 40% వరకు కల్తీ చేసి, దాని నాణ్యతను బట్టి వేర్వేరు రకాలుగా విక్రయిస్తున్నారు:
    • పూజా/దీపం నెయ్యిగా..
    • రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, స్వీట్ షాపులకు
    • ఆయుర్వేద మందుల దుకాణాలకు (దవాసాజ్)
    • డెయిరీ షాపులు, స్టార్ హోటళ్లు, కేటరర్లకు సరఫరా చేస్తున్నారు.

    కల్తీకి వాడే మిల్క్ క్రీమ్‌ను మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి తెప్పిస్తున్నారు. నాసిరకం పదార్థాలతో అతి తక్కువ ఖర్చుతో తయారు చేసి, మార్కెట్‌లో అసలు నెయ్యి ధరలకు విక్రయిస్తూ భారీగా అక్రమార్జనకు పాల్పడుతున్నారు. తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాలకు కూడా దీనిని సరఫరా చేస్తున్నారు.

    తీవ్రమైన ఆరోగ్య ముప్పు:
    పామ్ ఆయిల్, పామ్ కర్నెల్ ఆయిల్‌కు బీటా-కెరోటిన్, ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్, లాక్టిక్ యాసిడ్, మోనోగ్లిజరైడ్స్ వంటి రసాయనాలను కలిపి ల్యాబ్ పరీక్షల్లో దొరక్కుండా జాగ్రత్తపడుతున్నారు. వీటిని తినడం వల్ల..
    • ట్రాన్స్-ఫ్యాట్ పెరిగి, బాడ్ కొలెస్ట్రాల్ (LDL) ఎక్కువవుతుంది.
    • గుండె జబ్బులు, స్ట్రోక్ (పక్షవాతం), గుండె సంబంధిత సమస్యలు వస్తాయి.
    • జీర్ణక్రియ సమస్యలు, కాలేయం (లివర్), మూత్రపిండాల (కిడ్నీ) పై తీవ్ర ప్రభావం పడుతుంది.
    • చర్మ అలర్జీలు, దీర్ఘకాలిక జీవక్రియ సమస్యలు వస్తాయి.

    పోలీసుల హెచ్చరిక:
    కల్తీ ఆహారంపై పోరాటంలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ మీడియా సమావేశంలో చెప్పారు. నాణ్యమైన, గుర్తింపు పొందిన సీల్డ్ ప్యాకెట్లను మాత్రమే కొనుగోలు చేయాలన్నారు. ప్యాకెట్‌పై FSSAI లైసెన్స్ వివరాలు ఉన్నాయో లేదో గమనించాలన్నారు. తక్కువ ధరకు లభించే బ్రాండ్ లేని, విడి నెయ్యి/పాల ఉత్పత్తులను కొనకూడదన్నారు.

    తమ ప్రాంతంలో ఎక్కడైనా కల్తీ నెయ్యి లేదా అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలు తయారు చేస్తుంటే ఎమర్జెన్సీ నంబర్ 112 లేదా H-FAST హెల్ప్‌లైన్ నంబర్ 8712661212 కు సమాచారం అందించాలని సీపీ కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు అత్యంత రహస్యంగా ఉంచుతామని సజ్జన్నార్ స్పష్టం చేశారు. ఈ ప్రత్యేక దాడులు టాస్క్ ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ నాయకత్వంలో H-FAST ఇన్‌స్పెక్టర్లు ఎన్. రంజిత్ కుమార్ గౌడ్, ఎమ్. అంజయ్య, సబ్‌ఇన్‌స్పెక్టర్లు రమ్య, అభిలాష్, శంకర్, కృష్ణ, అఖిల్, సిబ్బంది విజయవంతంగా నిర్వహించారని సీపీ సజ్జన్నార్ వివరించారు.

    Popular Articles