భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని కేంద్రమైన భోపాల్ నగరంలో కేవలం 24 గంటల వ్యవధిలో ఇద్దరు మైనర్లు సహా పది మంది అదృశ్యమైన ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్నాయి. ఈ మిస్సింగ్ ఘటనలపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి. అదృశ్యమైన వారిలో 16 నుండి 19 ఏళ్ల మధ్య వయస్సు గల మైనర్లు కూడా ఉన్నారు. కొన్ని సందర్భాల్లో ఇంటి నుండి బయటకు వెళ్ళిన తర్వాత అదృశ్యమైన వారి మొబైల్ ఫోన్లు స్విచ్చాఫ్ అయ్యాయని, దీనివల్ల వారి ఆచూకీ కనుగొనడం కష్టంగా మారిందని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మిస్సింగ్ ఘటనలకు సంంధించి నగరంలోని కోలార్, అయోధ్య నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఈ రెండు ప్రాంతాల నుండి ముగ్గురు చొప్పున అదృశ్యమయ్యారు. అదేవిధంగా అశోక గార్డెన్, టీటీ నగర్, రతిబాద్, అవధ్‌పురి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా మిస్సింగ్ ఘటనలపై ఫిర్యాదులు వచ్చాయి.
ప్రాంతాలవారీగా అశోక గార్డెన్‌లో 17 ఏళ్ల విద్యార్థిని పాఠశాలకు హాజరయ్యేందుకు ఇంటి నుండి వెళ్లి తిరిగి రాలేదు. విద్యార్థిని కుటుంబ సభ్యులు ఆమె కోసం విస్తృతంగా గాలించినప్పటికీ ఎటువంటి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. అయోధ్య నగర్‌లో గరిమ (19), తను (24) మనీష్ (22) అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి.
ఇక కోలార్ పోలీస్ స్టేషన్ పరిధిలో శివకాంత్ (22), అమర్‌జీత్ (40) తులసీరామ్ (45)ల అదృశ్యానికి సంబంధించి ఫిర్యాదులు వచ్చాయి. టీటీ నగర్‌కు చెందిన ముస్కాన్, రతిబాద్‌కు చెందిన అన్మోల్ (30) సోని, అవధ్‌పురికి చెందిన 16 ఏళ్ల బాలికకు సంబంధించిన కేసులు కూడా నమోదయ్యాయి.
అదృశ్యమైన ప్రతి కేసును తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సంబంధిత పోలీస్ స్టేషన్ల బృందాలు కుటుంబ సభ్యులను విచారిస్తూ, వారు ఎక్కడికి వెళ్ళి ఉండవచ్చనే అంశంపై వివరాలు సేకరిస్తున్నాయి. సమీప ప్రాంతాలలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తుండగా, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, ఇతర బహిరంగ ప్రదేశాలలో కూడా గాలింపు చర్యలు చేపట్టారు.
కాగా అదృశ్యమైన వ్యక్తులకు సంబంధించిన ఫిర్యాదులు అందిన వెంటనే పోలీసులు తక్షణ చర్యలు చేపడతారని అదనపు పోలీస్ కమిషనర్ శైలేంద్ర సింగ్ చౌహాన్ జాతీయ మీడియాకు తెలిపారు. సైబర్ నేరాల దర్యాప్తు బృందం మొబైల్ ఫోన్ లొకేషన్లను, కాల్ వివరాలను పరిశీలిస్తోందని ఆయన చెప్పారు. అదృశ్యమైన వారిలో ఎవరి గురించైనా సమాచారం తెలిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా పోలీస్ కంట్రోల్ రూమ్‌కు తెలియజేయాలని పోలీసులు ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

