హైదరాబాద్: తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డికి బాసటగా 16 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు నిలిచారు. దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే ప్రక్రియలో భాగంగా శుక్రవారం సీఎల్పీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయా సంఖ్యలో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి అండగా నిలిచారు. కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా వారు ఖండించారు. కొండా సురేఖను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి నిర్ణయాలను వ్యతిరేకించేవాళ్లకు పార్టీలో స్థానంల లేదన్నారు. తన కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని మంత్రి కొండా సురేఖ బుకాయించడమేంటని, ఖండించకపోవడం దారుణమన్నారు. కొండా కుటుంబ సభ్యులు చేస్తున్న వ్యాఖ్యల వల్ల పార్టీతోపాటు సీఎం రేవంత్ రెడ్డి మూల్యం చెల్లిస్తున్నారని, సురేఖ మాత్రం పదవిని ఆస్వాదిస్తున్నారని అన్నారు. పార్టీ నుంచి బహిష్కరించకముందే వెళ్లిపోవాలని సురేఖకు మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సూచించారు. పార్టీ అధిష్టానం సురేఖపై చర్య తీసుకోవాలని కోరారు.

విలేకరుల సమావేశంలో వివిధ నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, బీర్ల ఐలయ్య , మధుసూదన్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి , దొంతి మాధవరెడ్డి, మందుల సామెల్, వెడ్మ బొజ్జు, వేముల వీరేశం, బుయ్యని మనోహర్ రెడ్డి, కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, బత్తుల లక్ష్మా రెడ్డి, బాలు నాయక్, వీర్లపల్లి శంకర్, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, బస్వరాజు సారయ్య, కాంగ్రెస్ నేత జంగా రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

