Top 5 This Week

Related Posts

కొండపల్లి గణేష్ ‘ఐపీ’ బాధితుల్లో ఖమ్మం డాక్టర్లు, ప్రముఖులు

(సమీక్ష శైలి వార్తా కథనం)
సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం (EOW) పోలీసులు నిన్న అరెస్ట్ చేసిన లిక్కర్, రియల్ ఎస్టేట్ వ్యాపారి కొండపల్లి గణేష్ కు సంబంధించి ఆసక్తికర అంశాలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. వ్యాపారంలో అధిక లాభాల పేరుతో తమను ఆకర్షించి, నమ్మించి, నయవంచనకు పాల్పడిన కొండపల్లి గణేష్ పై చర్యలు తీసుకోవాలంటూ గచ్చిబౌలిలోని మైహోం భుజాలో నివసించే బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో సైబరాబాద్ పోలీసులు గణేష్ పై ఈనెల 3వ తేదీన కేసు నమోదు చేసి, నిన్న అతన్ని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

అయితే సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఈ కేసును కాసేపు అలా ఉంచితే.., భద్రాద్రి జిల్లా ఇల్లెందు పోలీసులు కూడా గణేష్ పై ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేశారు. బాణోత్ గోపీచంద్ అనే రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు గణేష్ పై బీఎన్ఎస్ చట్టంలోని 296(బి) 318(4) సెక్షన్లతోపాటు 3(1)(r)(s), 3(2)(va) ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద గత ఏప్రిల్ మొదటి వారంలో కేసు నమోదు చేశారు. ఈ కేసు నేపథ్యంలోనూ గణేష్ స్వీకరించిన ‘పెట్టుబడి’ అంశమే ఉండడం గమనార్హం,

వైన్ షాపులో పెట్టుబడి పేరుతో, లాభాలు వస్తాయని నమ్మబలికి అమాయక గిరిజనుడినైన తాను బ్యాంకులో దాచుకున్న రూ. 64.44 లక్షల మొత్తాన్ని తీసుకుని మోసగించాడని గోపీచంద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీటితోపాటు మరో వైన్ షాపు కొనుగోలు చేశానని రూ. 11.50 లక్షలు తీసుకున్నాడని, తనకు ఇవ్వాల్సిన డబ్బు గురించి అతన్ని ప్రశ్నించగా, అసభ్య పదజాలంతో, కులం పేరుతో గణేష్ తనను దూషించాడని ఆయన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు సారాంశం.

ఈ ఘటనానంతరం గణేష్ ఉన్నట్టుండి ఖమ్మం కోర్టులో ‘దివాళా’ పిటిషన్ దాఖలు చేశాడు. తనకు అప్పులిచ్చిన మొత్తం 95 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ, రూ. 33 కోట్ల 5 లక్షల, 95 వేల రూపాయలకు ఖమ్మం ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో గణేష్ తన లాయర్ ద్వారా గత ఏప్రిల్ నెలాఖరున దివాళా పిటిషన్ దాఖలు చేశాడు. వ్యాపార నిర్వహణ కోసం రుణదాతల నుంచి అధిక మొత్తంలో అప్పులు చేశానని, తీవ్ర నష్టాలు రావడంతో అప్పులిచ్చినవారి బాకీలు తీర్చలేని పరిస్థితి ఏర్పడింది, అందువల్ల తనను దివాళాదారునిగా ప్రకటించాలని కోరుతూ కొండపల్లి గణేష్ ఐపీ దాఖలు చేశాడు.

గణేష్ ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో అతను ఖమ్మం కోర్టులో దాఖలు చేసిన దివాళా పిటిషన్ లో ప్రతివాదులుగా పేర్కొన్న 95 మంది జాబితాలో పలువురు ప్రముఖులు ఉండడం విశేషం. ఖమ్మం, కొత్తగూడెం నగరాల్లో ప్రయివేట్ విద్యా సంస్థలను నడిపే కొందరితోపాటు, పలువురు ప్రముఖ డాక్టర్లు కూడా గణేష్ ఐపీలోని ప్రతివాదుల జాబితాలో ఉండడం గమనార్హం. ఓ ప్రముఖ రాజకీయ నాయకుని ఆంతరంగికునిగా పనిచేసే వ్యక్తి పేరు కూడా ఈ జాబితాలో 86వ ప్రతివాదిగా ఉంది. అయితే ఆ వ్యక్తి ఇతనేనా? కాదా? అనే అంశం ధ్రువపడాల్సి ఉంది.

ఇంకా విశేషం ఏమిటంటే.. గణేష్ పై సైబరాబాద్ EOW పోలీసులకు ఫిర్యాదు చేసి, అతని అరెస్టుకు హేతువైన సిల్వియా శ్రీనివాసరెడ్డి పేరు కూడా ఈ జాబితాలో 56వ ప్రతివాదిగా ఉండడం గమనార్హం. అదేవిధంగా మైహోం భుజాలోనే నివసించే మరో ఐదుగురి పేర్లను కూడా సైబరాబాద్ పోలీసులు గణేష్ బాధితులుగా ఎఫ్ఐఆర్ లో ప్రస్తావించారు. వీరిలో నలుగురు బాధితులు 39, 40, 60, 90వ ప్రతివాదులుగా గణేష్ దాఖలు చేసిన దివాళా పిటిషన్ లో ఉన్నారు.

కాగా మొత్తం 95 మంది ప్రతివాదుల జాబితాలో దాదాపు 15 మంది వరకు మహిళలే ఉన్నారు. గణేష్ ను నమ్మి అతని వ్యాపారంలో పెట్టుబడులుగా పెట్టినవారిలో చాలా మంది ప్రముఖులు ఆ వ్యక్తులం తాము కాదని చెబుతుండడం కూడా ఈ సందర్భంగా గమనార్హం. అందుకు కారణాలు అనేకం కావచ్చు.

మొత్తంగా తాను దాఖలు చేసిన దివాళా పిటిషన్ లో ప్రతివాదులుగా పేర్కొన్న 95 మంది నుంచి రూ. 33 కోట్ల, 5 లక్షల, 95 వేల మొత్తాన్ని రుణాలుగా స్వీకరించినట్లు గణేష్ ప్రస్తావించాడు. ఈ మొత్తాన్ని విభజిస్తే సగటున ప్రతి వ్యక్తి నుంచి రూ. 34.79 లక్షల మొత్తాన్ని గణేష్ అప్పులుగా స్వీకరించాడన్నమాట. అయితే ఒక్కో వ్యక్తి ఒక్కో మొత్తాన్ని గణేష్ కు అప్పుగా ఇచ్చారనేది గమనించాల్సిన కీలకాంశం. గణేష్ బాధితులు ఇంకా ఉండి ఉంటారని, బాధితుల నుంచి కోట్ల రూపాయలను వసూల్ చేసి విదేశాలకు తరలించి ఉంటాడనే కోణంలోనూ సైబరాబాద్ పోలీసులు గణేష్ పై నమోదైన కేసులో దర్యాప్తు చేస్తున్నారు.

Popular Articles