హైదారాబాద్: లైంగిక వేధింపుల కేసులో భద్రాద్రి జిల్లా పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన రేగా కాంతారావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో నమోదైన లైంగిక వేధింపుల కేసును హైకోర్టు కొట్టేసింది. ఈమేరకు తనపై నమోదైన ఆయా కేసును కొట్టి వేయాలంటూ రేగా కాంతారావు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు అనుమతిస్తూ, లైంగిక వేధింపుల కేసును కొట్టేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో గత నెల 26వ తేదీన లైంగిక వేధింపుల కేసు నమోదైన సంగతి తెలిసిందే. పెళ్లి పేరుతో తనను లైంగికంగా వేధించాడనే అభియోగాలపై ఓ యువతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కాంతారావుపై ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలంటూ రేగా కాంతారావు హైకోర్టును ఆశ్రయించి ఊరట పొందారు.
నేను ఎక్కడికీ పారిపోలేదు: రేగా కాంతారావు
కాగా తనను ఏ పోలీసులూ అరెస్టు చేయలేదని, తాను ఎక్కడికీ పారిపోలేదని మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఈ సందర్భంగా స్పందించారు. గౌరవ హైకోర్టులో న్యాయపోరాటం చేశానని, తన ప్రతిష్టకు భంగం కలిగేలా కొందరు వ్యవహరించారని, అబద్ధాలు ప్రచారం చేస్తూ తాను అరెస్టు అయినట్లుగా వార్తలు రాయించారని అన్నారు. చివరికి న్యాయమే గెలిచిందని, ఇది తప్పుడు కేసుగా తేలిందని, హైకోర్టు కొట్టేసిందని కాంతారావు పేర్కొన్నారు.

