(సమీక్ష శైలి ప్రత్యేక కథనం)
‘మీడియావాళ్ల విషయానికొస్తే.. మెయిన్ ఛానల్స్ ఏయి ఉన్నాయో, వాళ్లకి, ఇప్పుడు ఉన్న ఛానల్స్ కి రెండు తేడాలు నేను అబ్జర్వ్ చేశాను. మెయిన్ ఛానల్స్ ఏ న్యూస్ ఒచ్చినాగూడాను, న్యూస్ ఒచ్చింది గదా..? అని టక్కున టెలీకాస్ట్ చేయట్లేదు. ఫస్ట్ దాన్ని వెరిఫై చేస్తున్నారు.. ఆడిట్ చేస్తున్నారు.. వాస్తవాలు ఏంటీ అనేది చెక్ జేసుకుంటున్నారు. ప్రెజెంట్ ఇప్పుడు మీడియా వాళ్లకేంటి..? త్రీ పాయింట్ ఫోర్ ఫైవ్ అనే ఫిగర్ ఒక్కటి చూసుకుని, టక్కా టక్కా స్క్రిప్ట్ కొడుతున్నారు. మా ఛానల్ వ్యూ ఎక్కువ చూడాలన్న ఉద్ధేశంతో టక్క టక్కా పోస్ట్ చేస్తున్నారు. కానీ అన్నీ మీరు చెక్ చేయండి.. టీవీ9లో ఎప్పుడూ రాలేదు.. ఎందుకూ అంటే.. వాళ్లు వెరిఫై చేశారు.. వెరిఫై చేశాక ఇందులో నిజము లేదూ.., ఇందులో తీసుకున్నది లేదూ.., ఈయన పర్సనల్ గా వాడింది లేదూ.. అని చెక్ జేశాక.. ఈరోజుదాకా టీవీ9లో ఒక్క బైట్ కూడా రిలీజ్ చేయలేదు. సో.. ఏ న్యూస్ ఒచ్చినాగూడ దాన్ని చెక్ జేసుకునే ఆడిట్ టీం ఉండాలి.. ‘హెచ్ ఆర్ డీఏ’ చెక్ జేసుకునే ఆర్ అండ్ డీ ఉండాలి. వ్యాలిడేషన్ చేసుకోవాలి.. న్యూస్ ని. ఆ తర్వాత అన్నీ వింగ్స్ చూసినాక మాత్రమే టెలీకాస్ట్ చేస్తే ఒచ్చే న్యూస్ లో క్వాలిటీ ఉంటుంది’
మీడియాకు ఈ సుద్దులు చెప్పింది ఎవరో తెలుసా..? దశాబ్ధాల తరబడి పాత్రికేయ రంగంలో గల నిష్ణాతులైన జర్నలిస్టు పెద్దలు కాదు. ప్రభుత్వ మీడియా అకాడమీకి చెందిన వాళ్లు కూడా కాదు. చివరికి పాలక పార్టీకి చెందిన రాజకీయ నాయకులు కూడా కాదు. పోలీసు ఉన్నతాధికారులు అంతకన్నా కాదు. ఇంతకీ ఎవరంటారా? మొన్నా మధ్య సైబరాబాద్ క్రైమ్స్ అండ్ EOW విభాగానికి చెందిన పోలీసులు మోసం, నమ్మకద్రోహం అభియోగాలపై నమోదు చేసిన కేసులో నిందితుడైన కొండపల్లి గణేష్.
ఇంకాస్త సూటిగా చెప్పాలంటే వైన్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో జనం నుంచి రూ. 33.5 కోట్ల మేరకు చేసిన అప్పుల మొత్తాన్ని తీర్చలేనని, తనను దివాళాకోరుగా ప్రకటించాలని గత ఏప్రిల్ నెలాఖరున ఖమ్మం కోర్టులో ‘దివాళా’ పిటిషన్ దాఖలు చేసిన కొండపల్లి గణేషే మీడియాకు ఈ సూక్తులు చెబుతున్నది. ఔను.. మీరు చదివింది అక్షారాల నిజమే.
ఇదీ చదవండి:
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ వైన్ షాపుల వ్యాపారం పేరుతో పలువురిని మోసం చేసినట్లు అందిన ఫిర్యాదుపై ఇల్లెందు పోలీసులు నమోదు చేసిన మరో కేసులోనూ నిందితుడైన కొండపల్లి గణేష్ మీడియాకు ఎందుకు పాఠాలు చెబుతున్నాడంటే..? ఈ మధ్య సైబరా బాద్ EOW (ఎకనమిక్ అఫెన్సెన్ వింగ్) పోలీసులు గణేష్ పై బీఎన్ఎస్ చట్టంలోని 318(4), 316(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మక మైహోం భుజాలో నివసిస్తూ, ఆర్థిక స్థితిమంతునిగా నమ్మించి పలువురి నుంచి వైన్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో పెట్టుబడుల పేరుతో రూ. 3.45 కోట్ల వరకు వసూళ్లు చేసి మోసగించాడనేది గణేష్ పై ఈనెల 3వ తేదీన సైబరాబాద్ EOWలో నమోదైన కేసులోని ఫిర్యాదు సారాంశం.
‘లడ్డూ వేలం కోట్లల్లో మోసం చేసిన గణేేష్ ‘గారి’ తొలి ఇంటర్వ్యూ’ అనే థంబ్ నెయిల్ తో ఓ యూ ట్యూబ్ ఛానల్ ప్రసారం చేసిన వీడియోల్లో గణేష్ మీడియాకు చెప్పిన పాఠాల సారాంశంలో తనపై నమోదైన కేసు గురించీ సోదాహరణంగా పేర్కొన్నాడు. తనదైన శైలిలో మాట్లాడిన గణేష్ వైన్ షాపుల టెండర్లలో ఫిర్యాదుదారు ప్రభుత్వానికి చెల్లించిన డబ్బుకు తానెలా బాధ్యుడినవుతానంటూ ఎదురుదాడికి దిగడమే ఇందులోని అసలు విశేషం. మరికొంత మొత్తం ఇల్లెందు వైన్ షాపుల్లో పెట్టుబడులుగా ఉన్నాయని, కానీ ఆ షాపులను ఇల్లెందు ఎమ్మెల్యే అనుచరుడు కబ్జా చేశారని గణేష్ ఆరోపించడం గమనార్హం.
పనిలో పనిగా పలువురు ప్రభుత్వ అధికారులపైనా గణేష్ అనేక ఆరోపణలు గుప్పించాడు. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, రాష్ట్ర డీజీపీకి, ఎక్సైజ్ శాఖ కమిషనర్ కు, ఏసీబీ డీజీకి, భద్రాద్రి జిల్లా కలెక్టర్ కు, ఎస్పీకి, ఖమ్మం ఏసీపికి ఇచ్చినట్లు పేర్కొంటున్న ఫిర్యాదుల ప్రతులను సోషల్ మీడియాలో గణేష్ షేర్ చేస్తుండడం గమనార్హం. ఎక్సైజ్ శాఖకు చెందిన ఉమ్మడి ఖమ్మం జిల్లా అధికారిపైనా, ఇల్లెందుకు చెందిన ఓ పోలీసు అధికారిపైనా ఫిర్యాదు చేసినట్లు గణేష్ పేర్కొన్నాడు. అయితే ‘సమీక్ష’కు కూడా గణేష్ పంపిన ఆయా ఫిర్యాదు ప్రతులపై సంబంధిత అధికారుల కార్యాలయం స్వీకరించినట్లు ఎక్కడా రబ్బర్ స్టాంపు ముద్రలుగాని, అధికారుల సంతకాలుగానీ లేకపోవడం గమనార్హం.
ఇదీ చదవండి:
అంతేకాదు పనిలో పనిగా ఇల్లెందు ఎమ్మెల్యేను కూడా ప్రస్తావిస్తూ, ఆ ఎమ్మెల్యే అనుచరున్ని రౌడీషీటర్ గా సంబోధిస్తూ తన వైన్ షాపులు అతని కబ్జాలో ఉన్నాయని గణేష్ ఈ ఇంటర్వ్యూలో ఆరోపించాడు. తద్వారా అధికార పార్టీకి చెందిన ఇల్లెందు ఎమ్మెల్యేను కూడా గణేష్ వైన్ షాపుల కబ్జా ఆరోపణల్లోకి లాగాడనే రాజకీయ చర్చ జరుగుతోంది. తనకోసం పోలీసులు గాలించడం లేదని, తన ఫోన్ ఆన్ లోనే ఉందని, ప్రతి ఫోన్ కాల్ ను మాట్లాడుతున్నానని, సిగ్నల్ చూసుకుని కూడా పోలీసులు మీట్ కావచ్చని, తనపై నమోదైన కేసుకు సంబంధించి ఇప్పటి వరకు పోలీసు శాఖ నుంచి సింగిల్ ఫోన్ కాల్ కూడా లేదన్నాడు.
మొత్తంగా వ్యాపారం పేరుతో కోట్ల రూపాయలను వసూళ్లు చేసినట్లు సైబరాబాద్ క్రైమ్స్ అండ్ EOWలో నమోదైన కేసులో నిందితుడు, తనను దివాళా తీసినట్లు ప్రకటించాలని ఖమ్మం కోర్టులో ఐపీ దాఖలు చేసిన కొండపల్లి గణేష్ యూ ట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఆయా ఇంటర్వ్యూలో టీవీ9లో తన గురించి ఒక్క బైట్ కూడా రిలీజ్ చేయలేదని తనకు తాను కితాబును ఇచ్చుకోవడం విశేషం. టీవీ9 వాళ్లు గణేష్ పై నమోదైన కేసు గురించి ఎందుకు పట్టించుకోలేదోగాని, ప్రముఖ దినపత్రిక ‘ఈనాడు’ కూడా ఇతనిపై నమోదైన కేసు గురించి ‘గణేష్ లడ్డూ పంచాడు.. రూ. కోట్లు కొట్టేశాడు’ శీర్షికన కలర్ ఫుల్ గా వార్తను ప్రచురించడం అసలు విశేషం.

