(సమీక్ష శైలి వార్తా కథనం)
ఎవరి పేరూ పెట్టకుండా, నర్మగర్భంగా రాసే వార్తా కథనాలను జర్నలిజం పరిభాషలో ‘బ్లైండ్ ఐటమ్స్’ అంటారు. తెలుగు జర్నలిజంలో ఈ తరహా వార్తా కథనాలకు ప్రత్యేకంగా పేరంటూ ఏమీ లేదు. ఇంగ్లీష్ జర్నలిజంలో మాత్రమే ఇటువంటి నర్మగర్భ వార్తా కథనలను ‘బ్లైండ్ ఐటమ్స్’గా వ్యవహరిస్తుంటారు. ఈ తరహాలో రాసే వార్తా కథనాల్లో సంబంధిత వ్యక్తుల పేర్లనుగానీ, సంస్థల పేర్లను ఎక్కడా నేరుగా ప్రస్తావించకపోవడమే ‘బ్లైండ్ ఐటమ్స్’లోని ప్రత్యేకత.
అయితే ఇటువంటి కథనాల్లో సంబంధిత వ్యక్తులు, సంస్థలు ఎవరనేది పాఠకులు గ్రహించేలా, ఊహించేలా అవసరమైన క్లూస్ కూడా నర్మగర్భంగా ఉంటకిస్తుంటారు. ఈ తరహా వార్తా కథనాలను రాయడంలో చట్టపరమైన అంశం దాగి ఉందని వేరే చెప్పనక్కరలేదు. న్యాయపరమై చిక్కులు, ముఖ్యంగా పరువు నష్టం దావాల నుంచి తప్పించుకునేందుకు ఇటువంటి వార్తా కథనాలు రాయడం జర్నలిజంలో కొత్తమే కాదు.
కానీ ఈ ‘బ్లైండ్ ఐటమ్స్’కు కూడా రాజకీయ నాయకులు స్పందిస్తూ ‘అడ్మిట్’ అవుతుండడమే తాజా విశేషం. ‘అడ్మిట్’ అనే ఆంగ్ల పదానికి సందర్భాన్ని బట్టి చాలా అర్థాలు ఉన్నప్పటికీ, జర్నలిజంలో ‘బ్లైండ్ ఐటమ్స్’కు సంబంధిత వ్యక్తులు ‘అడ్మిట్’ కావడాన్ని ఆయా వార్తా కథనాలు తమ గురించి రాసినవేనని స్పందించిన వ్యక్తులు బాహాటంగానే అంగీకరించినట్లుగా భావిస్తుంటారు. ‘బ్లైండ్ ఐటమ్స్’కు ‘అడ్మిట్’ తరహాలో కొందరు ప్రముఖ రాజకీయ నాయకులు స్పందిస్తూ మీడియా సమావేశంలో ఖండిస్తుండడం ఈ సందర్భంగా గమనార్హం. ఇటీవలి రెండు వార్తా కథనాలను, ఆ తర్వాత పరిణామాలను పరిశీలిస్తే ఇదే అంశం బోధపడుతుంది.

ఈనెల 3వ తేదీన ‘సాక్షి’ దినపత్రిక ‘ఎమ్మెల్యేగా ఎన్నికైన ఏడాదిన్నరలోపే.. అప్పుల కొండ కరిగించేశారు!’ శీర్షికన ఓ ఆసక్తికర వార్తా కథనాన్ని బ్యానర్ స్టోరీగా ప్రచురించింది. దాని సారాంశం ఏమిటంటే.. ‘ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అధికార పార్టీ నేత ఒకరు రెండున్నర దశాబ్ధాలుగా రాజకీయాలలో ఉన్నారు. ఆరేళ్ల వ్యవధిలో 11 కంపెనీల పేరిట తొమ్మిది బ్యాంకుల నుంచి రూ. 470 కోట్ల మొత్తాన్ని రుణాలుగా తీసుకున్నారు. అప్పులు తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకులు డీఫాల్టర్లుగా ప్రకటించాయి. పదేళ్లకుపైగా నోటీసులు కొనసాగడమేగాక, ఎన్ఎస్ఎల్టీ కేసుల పర్వం కూడా ఉంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆ నేత ఏడాదిన్నరలోగానే ఆర్థికంగా బలపడ్డాడని, కేవలం వారం రోజుల వ్యవధిలోనే రూ. 400 కోట్లకు పైగా బకాయిలు చెల్లించిన వైనంపై చర్చ..’ అంటూ సాక్షి పత్రిక తన కథనంలో విశేషాలుగా ప్రస్తావించింది.
నిజానికి ఈ వార్తా కథనంలో ప్రస్తావించిన ఆయా అంశాలన్నీ నిజమే అయితే బాజాప్తాగా ఆ ఎమ్మెల్యే పేరును పత్రిక రాయవచ్చు. కానీ చట్టపరమైన సమస్యలు ఉత్పన్నమవుతాయని పత్రిక ఎడిటోరియల్ ముఖ్యులు భావించారో, ఏమో తెలియదుగాని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆ ఎమ్మెల్యే ఎవరనే అంశంపై మాత్రం ఆసక్తికర చర్చను రేకెత్తించిందనే చెప్పాలి. ఓ రకంగా ఆ ఎమ్మెల్యే పేరును ఉటంకించకుండా తన వార్తా కథనంపై చర్చ జరిగేలా వ్యవహరించిందనే పేర్కొనవచ్చు.

మరోవైపు ఈ వార్తా కథనంపై అసెంబ్లీలో బీజేపీ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పందించారు. ప్రభుత్వానికి ధైర్యముంటే ఆ ఎమ్మెల్యే పేరు బహిర్గతం చేయాలని, అతని అవినీతిపై నిజనిర్ధారణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఎమ్మెల్యే సంపాదనలో సీఎం, డిప్యూటీ సీఎంలకు వాటా లేకపోతే వాస్తవం బయటపెట్టాలని కూడా ఆయన అన్నారు. అయినా వేలానికి వెళ్లిన తమ ఆస్తులను ఆ కాంగ్రెస్ నాయకుడు ఎమ్మెల్మేగా ఎన్నికైన స్వల్ప వ్యవధిలోనే రూ. 470 కోట్ల మొత్తాన్ని చెల్లించి ఎలా విడిపించుకన్నారనేది ఈ అంశంలో మహేశ్వర్ రెడ్డి సంధించిన మరో సూటి ప్రశ్న.

ఈ నేపథ్యంలోనే ఆయా వార్తా కథనంలో తన పేరును ఎక్కడా ప్రస్తావించకపోయినా, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు స్పందించడం గమనార్హం. తన కంపెనీలకు బ్యాంకు రుణంగా రూ. 450 కోట్లు మంజూరైనప్పటికీ, తాను వినియోగించుకున్నది రూ. 109.11 కోట్లు మాత్రమేనని ప్రేమ్ సాగర్ రావు మీడియా ముందుకు వచ్చి స్పష్టం చేశారు. అప్పులను వడ్డీతో కలిపి 2024లో రూ. 150.32 కోట్లు చెల్లించామని, అప్పు మొత్తాన్ని వారంలో చెల్లించాననడం నిరాధారమని అన్నారు. తనకు మంత్రి పదవి అనే చర్చ వచ్చిన ప్రతీసారి ఇలాంటి ఆరోపణలే వస్తున్నాయని, తమ జిల్లాకు చెందినవారే తనపై కుట్ర చేస్తున్నారని, వారి సొంత పత్రికల్లో కాకుండా ఇతర పత్రికల్లో ఈ తరహా వార్తా కథనాలు రాయిస్తున్నారని ప్రేమ్ సాగర్ రావు ఆరోపించారు.

ఇక ఇదే తరహాలో ప్రచురితమైన మరో వార్తా కథనానికి కూడా తెలంగాణా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించడం విశేషం. ‘ముఖ్యనేత పగ.. పీసీసీ నేతపై నిఘా’ శీర్షికన ఈనెల 6వ తేదీన గులాబీ పార్టీ పత్రిక ‘నమస్తే తెలంగాణా’ తనదైన శైలిలో ఓ వార్తా కథనాన్ని ప్రచురించింది. ఇంటెలిజెన్స్ ద్వారా ఆ పీసీసీ నేతపై నిఘా ఏర్పాటు చేశారని, అతని కొడుకు వ్యాపారాలపై ఉచ్చు బిగించారని, ఎవరికీ చెప్పుకోలేక సదరు పీసీసీ నాయకుడు లోలోనే కుమిలిపోతున్నారని ఆ పత్రిక తన వార్తా కథనంలో పేర్కొంది.
అంతేకాదు ఆయా పీసీసీ నాయకుని ప్రతీ కదలికను ముఖ్యనేత రికార్డు చేయించాడని, వారంలో కనీసం ఒక్క రోజైనా ఎల్బీనగర్కు ఆయన వెళ్లడం, లక్డీకాపూల్లోని ఓ అపార్ట్మెంట్కు కూడా అతను వెళ్లిన సీసీ టీవీ ఫుటేజీని కూడా సేకరించినట్టు తెలిసిందని, దాన్ని ఆసరా చేసుకొని ప్రభుత్వ నేత పీసీసీ నేతను హెచ్చరించినట్టు ప్రచారం జరుగుతున్నదని ‘నమస్తే తెలంగాణా పత్రిక ప్రచురించిన ఆయా వార్తా కథనంలో రాజకీయంగా ఆసక్తి రేకెత్తించే అంశాలు. ఈ వార్తా కథనంలోనూ ‘నమస్తే తెలంగాణా’ పత్రిక పీసీసీకి చెందిన ఏ నాయకుడి పేరునూ బహిర్గతం చేయకుండా నర్మగర్భపు వార్తా కథనాన్నే ప్రచురించింది.

కానీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అదేరోజు మీడియాతో మాట్లాడుతూ స్పందించడం విశేషం. రాష్ట్ర ముఖ్యమంత్రితో తనకు ఎలాంటి గ్యాప్ లేదని, ఇద్దరూ రోజూ ఫోన్లో మాట్లాడుకుంటామని ఆయన చెప్పారు. ఇటీవల తనకు సంబంధించిన ఆడియోలు, వీడియోలు ఉన్నాయని కొందరు ప్రచారం చేస్తున్నారని, అలాంటి ఆధారాలు నిజంగా ఉంటే, దమ్ముంటే వాటిని బహిర్గతం చేయాలని పీసీసీ చీఫ్ సవాల్ విసిరారు. ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని ఆయన సూచించారు. తనపై జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, పార్టీ బలోపేతం, ప్రభుత్వ కార్యక్రమాల అమలుపైనే తాను దృష్టి సారిస్తున్నానని మహేశ్ కుమార్ గౌడ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
అటు ‘సాక్షి’, ఇటు నమస్తే తెలంగాణా పత్రికలు ప్రచురించిన ఆయా వార్తా కథనాల్లో ఎక్కడా తమ పేర్లు లేకపోయినా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించడం జర్నలిజపు సర్కిళ్లలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఈ తరహాలో ప్రచురితమైన ‘బ్లైండ్ ఐటమ్స్’పై స్పందించడం ద్వారా అవి తమ గురించి రాసినవేనని ఆయా ఇద్దరు నేతలూ ప్రజలకు స్పష్టం చేసినట్లయిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వీళ్లిద్దరు నేతలు ఆయా కథనాలపై స్పందించకుండా ఉంటే అవి ‘బ్లైండ్ ఐటమ్స్’గానే మిగిలిపోయేవని సీనియర్ జర్నలిస్టులు కొందరు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

