Top 5 This Week

Related Posts

డీజీపీ మాట వినని ఆ ‘ఐపీఎస్’ అధికారులెవరు!?

హైదరాబాద్: తెలంగాణా డీజీపీ సీవీ ఆనంద్ ఇచ్చిన ఆదేశాలను రాష్ట్రంలోని ముగ్గురు, నలుగురు ఐపీఎస్ అధికారులు ఏమాత్రం ఖాతరు చేయడం లేదా? శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఆయన ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేస్తున్న ఆ ముగ్గురు, నలుగురు ఐపీఎస్ అధికారులెవరు? ఇదీ పోలీసు శాఖలో జరుగుతున్న చర్చ. ఈమేరకు డీజీపీ సీవీ ఆనంద్ నిన్న వరంగల్ పర్యటనలో మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యల్లోని ఓ వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొత్తం 24 సెకన్ల పాటు గల ఆ వీడియో క్లిప్ లో డీజీపీ ఆనంద్ ఏమన్నారంటే..

ఇవీ ఆ వీడియోల డీజీపీ సీవీ ఆనంద్ చేసిన వ్యాఖ్యలు. వాస్తవానికి డీజీపీ స్థాయి అధికారి నేరుగా ఆదేశాలు ఇచ్చేది కమిషనరేట్లకు, జిల్లాలకు బాస్ లుగా వ్యవహరిస్తున్న పోలీస్ కమిషనర్లు, ఎస్పీల స్థాయి ఐపీఎస్ అధికారులకు మాత్రమే. డీఎస్పీలు, సీఐల వంటి ఆ దిగువ అధికారులు తన మాట వినకుంటే ఆ హోదాగల అధికారులపై చర్య తీసుకోవడం ఆయనకు పెద్ద సమస్య కాదు. ఈ నేపథ్యంలో కొందరు ‘ఐపీఎస్’ అధికారుల గురించే డీజీపీ సీవీ ఆనంద్ ఆయా వ్యాఖ్యలు చేసి ఉంటారనే చర్చ పోలీసు వర్గాల్లో జరుగుతోంది.

అయితే డీజీపీ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఆ ముగ్గురు, నలుగురు ఐపీఎస్ అధికారులపై చర్యలకు ప్రభుత్వానికి చెందిన ముఖ్యులు అంగీకరిస్తారా? అనే ప్రశ్నపైనా చర్చ జరుగుతోంది. ఎందుకంటే డీజీ స్థాయి అధికారి ఇచ్చిన ఆదేశాన్ని ఆ ముగ్గురు, నలుగురు అధికారులు పాటించడం లేదంటే పాలకపార్టీ ముఖ్యుల అండ వారికి ఉండడం వల్లే అలా వ్యవహరిస్తూ ఉండొచ్చనే చర్చ కూడా పోలీస్ శాఖలో జరుగుతుండడం గమనార్హం. మొత్తంగా వరంగల్ పర్యటనలో డీజీపీ సీవీ ఆనంద్ చేసిన ఆయా వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర పోలీస్ శాఖలో హాట్ టాపిక్.

Popular Articles