Top 5 This Week

Related Posts

22A భూములపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు

సత్తుపల్లి: తెలంగాణాలో 22A భూముల అంశంపై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొంతమంది భూ ఆక్రమణదారులు అమాయక ప్రజలను అడ్డుపెట్టుకుని 22ఏ భూములను క్రమబద్ధీకరించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి ఆరోపించారు. ఇటువంటి ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తాము అనుమతించబోమని, ఇప్పటికే వారిపై చర్యలు ప్రారంభించినట్లు మంత్రి ప్రకటించారు. సామాన్య ప్రజలను ముందుపెట్టి అక్రమంగా దోచుకున్న భూములను రెగ్యులరైజ్ చేసుకునేందుకు చేసే ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫలించబోవని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.

అదేవిధంంగా వచ్చే ఎన్నికల్లో తమ పాలనపై భూభారతి చట్టం రెఫరెండంగా నిలుస్తుందని మంత్రి ప్రకటించారు. గతంలోనూ తాము ఇదే విషయాన్ని చెప్పామన్నారు. రైతుల భూ సమస్యలను పరిష్కరించడమే తమ ప్రభుత్వ ప్రధాన బాధ్యతగా మంత్రి చెప్పారు. గురువారం సత్తుపల్లి మండలం నారాయణపురంలో కడాస్ట్రల్, నాన్‌-కడాస్ట్రల్ గ్రామాల భూ రీ సర్వేపై నిర్వహించిన రైతుల ముఖాముఖి, ప్రత్యేక అవగాహన సదస్సులో మంత్రి పొంగులేటి పాల్గొని ఆయా కీలక వ్యాఖ్యలు చేశారు.

విపక్షాల తింగర వేషాలకు, కుప్పిగంతులకు, తాటాకు చప్పుళ్లకు తమ ప్రభుత్వం భయపడదని, వణకదని, కనీసం సమాధానం కూడా చెప్పదన్నారు. సమాధానం చెప్పాల్సి వస్తే, రైతన్నలకు చెబుతానని, మీవంటి వాళ్లకు సమాధానం చెప్పే అవసరంగాని, ఆలోచనగానీ ఈ ప్రభుత్వానికి, తనకు లేదని మంత్రి పొంగులేటి అన్నారు.

పరస్పరం రాసుకున్న స్క్రిప్టులతో తోడుదొంగలు చదువుతున్నారని పరోక్షంగా బీజేపీ, బీఆర్ఎస్ నాయకులను ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. తోడు దొంగలను తమ ప్రభుత్వం ఉపేక్షిస్తోందని, చూస్తోందన్నారు. తన కుటుంబ సభ్యులను ముందుపెట్టి ఆడుతున్న డ్రామాలను కట్టేయాలని, రాజకీయాన్ని రాజకీయంగానే చేయాలన్నారు.

Popular Articles