Top 5 This Week

Related Posts

‘లడ్డూ’ పంచి కోట్లు కొల్లగొట్టిన కొండపల్లి గణేష్, EOWలో కేసు

హైదరాబాద్: కొండపల్లి గణేష్ గుర్తున్నాడుగా..? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు చెందిన గణేష్ హైదరాబాద్ గచ్చిబౌలిలోని మైహోం భుజాలో నివాసముంటూ గత వినాయక చవితి సందర్భంగా విఘ్నేశ్వరస్వామి లడ్డూను రూ. 51.00 లక్షలకు దక్కించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన సంగతి తెలిసిందే. గణేష్ లడ్డూను ఇంత భారీ మొత్తానికి దక్కించుకున్నకొండపల్లి గణేష్ పై తాజాగా నమోదైన వైట్ కాలర్ నేరాల కేసు ఏమిటో తెలుసా..?

కొండపల్లి గణేష్ తమను నమ్మించి కోట్ల మొత్తంలో కొల్లగొట్టాడని బాధితుల నుంచి అందిన ఫిర్యాదుపై సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం (EOW)లో కేసు నమోదైంది. మైం హోంభుజాలో నివసించే కొండపల్లి గణేష్ ఆర్థిక స్థితిమంతుడనే పేరు గాంచాడు. రూ. కోటికిపైగా విలువైన బెంజ్ కారులో తిరిగే కొండపల్లి గణేష్ గత వినాయక చవిత సందర్భంగా వేలంలో దక్కించుకున్న లడ్డూను మైహోం భుజా అపార్ట్మెంటులో నివసించేవారికి ఆ లడ్డూను పంపిణీ చేశాడు.

ఈ నేపథ్యంలోనే బోయినపల్లి కిరణ్ అనే వ్యక్తి ద్వారా అపార్ట్మెంటులో నివసించే ఆళ్ల శ్రీనివాసరెడ్డి, సిల్వియా దంపతులతో పరిచయం పెంచుకున్నాడు. ఈ పరిచయాన్ని ఆసరాగా చేసుకుని, తాము ప్రారంభించే వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలని, ఇందుకు నెలసరి 6% శాతం చొప్పున లాభాలు ఇస్తామని కొండపల్లి గణేష్, బోయినపల్లి కిరణ్ లు నమ్మబలికారు

వినాయకుని లడ్డూతో కొండపల్లి గణేష్ (ఫైల్ ఫొటో)

వీరి మాటలను విశ్వసించిన శ్రీనివాసరెడ్డి దంపతులు ముందుగా రూ. 31.00 లక్షలను గణేష్ కు ముట్టజెప్పారు. అయితే కొంతకాలం తర్వాత శ్రీనివాసరెడ్డి, సిల్వియా దంపతులు లాభం గురించి కొండపల్లి గణేష్ ను ప్రశ్నించారు. విషయాన్ని వాయిదా వేస్తూ వచ్చిన గణేష్ ఆ తర్వాత వారు చేసే ఫోన్లకూ స్పందించడం మానేశాడు.

అయితే గత ఏప్రిల్ లో గణేష్ తోపాటు కిరణ్ మైహోం భుజాలోని నివాసపు ఫ్లాట్లను ఖాళీ చేసి వెళ్లారు. దీంతో ఇతని గురించి ఆరా తీయగా అనేక మందిని ఇలాగే మోసం చేసినట్లు బహిర్గతమైంది. ఇక్కడ నివసించే సుమారు ఐదుగురు వ్యక్తుల నుంచే రూ. 3.45 కోట్ల మొత్తాన్ని కొండపల్లి గణేష్ వసూళ్లు చేసి వెళ్లినట్లు బాధితులు గుర్తించారు.

కొండపల్లి గణేష్ వసూళ్ల బాధితుల్లో కొందరు రిటైర్డ్ ఉద్యోగులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. జీవితాంతం ఉద్యోగాలు చేసి, పొదుపు చేసుకున్న భారీ మొత్తాలను గణేష్ ను మాటలకు నమ్మి ఇవ్వడం ద్వారా మోసపోయినట్లు తెలుస్తోంది. బాధితురాలు సిల్వియా శ్రీనివాసరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై సైబరాబాద్ EOW (ఎకనమిక్స్ అఫెన్సెస్ వింగ్) విభాగం పోలీసులు బీఎన్ఎస్ చట్టంలోని 318(4), 316(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సైబరాబాద్ పోలీసుల పరిధిలోని EOW అనేది తెలంగాణాలోని గచ్చిబౌలి కేంద్రంగా పనిచేసే ఓ ప్రత్యేక విభాగం. భారీ ఆర్థిక మోసాలు, రియల్ ఎస్టేట్ కుంభకోనాలు, అధిక మొత్తంలో.. అంటే రూ. 3.00 కోట్లకు మించి ఆర్థిక నష్టంతో కూడిన వైట్ కాలర్ నేరాలపై ఈ విభాగం దర్యాప్తు చేస్తుంది. కొండపల్లి గణేష్ పాల్పడినట్లు బాధితులు ఇచ్చిన ఫిర్యాదులో వసూళ్ల మొత్తం రూ. 3.45 కోట్లు ఉన్న నేపథ్యంలో సహజంగానే EOW విభాగం చేతికి ఈ కేసు వెళ్లింది.

Popular Articles