Top 5 This Week

Related Posts

రూ. 1,000 కోట్ల సైబర్ నేరాల కేసులో కీలక పరిణామం.. CSB కేసులో A1గా వికాస్ చౌదరి

హైదరాబాద్: అక్షరాల వెయ్యి కోట్ల విలువైన అనుమానాస్పద లావాదేవీల సైబర్ నేరాల దోపిడీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి, పెనుబల్లి (వీఎం బంజర) పోలీస్ స్టేషన్ల నుంచి తమకు బదిలీ అయిన రెండు సైబర్ నేరాల కేసులలో హైదరాబాద్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (CSB) విభాగం తాజాగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఇదే అంశాన్ని స్పష్టం చేస్తోంది.

ఎఫ్ఐఆర్ నెం. 50/2026 ద్వారా బీఎన్ఎస్ చట్టంలోని 318(4), 319(2), 336(3), 338, 3, ITA Act-2008లోని 66D సెక్షన్ల కింద CSB పోలీసులు గత నెల 14వ తేదీన నమోదు చేసిన కేసులో ఉడతనేని వికాస్ చౌదరిని ప్రధాన నిందితునిగా పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని రాజీవ్ కాలనీకి చెందిన పొదిలి నరేష్ ఇచ్చిన ఫిర్యాదుపై తమకు బదిలీ అయిన రెండు కేసులపై CSB పోలీసులు ఈ కేసులను తిరిగి నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఉడతనేని వికాస్ చౌదరిని ఏ1గా పేర్కొంటూ నమోదైన ఈ కేసులో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, కృష్ణా, ప్రకాశం జిల్లాలకు చెందిన మొత్తం 27 మందిని నిందితులుగా పేర్కొన్నారు. వీరిలో ఉడతనేని వికాస్ చౌదరి భార్య బొప్పన నాగప్రియను ఏ2గా, ఆ తర్వాత వరుసగా అడపా రామ వెంకట చరణ్, అడపా సూర్య వెంకట తరుణ్, ఇలాసారపు అనిరుధ్, పోట్రు వంశీ, పోట్రు చైతన్యసాయి, దోసపాటి నవీన్, నల్లబోతుల భవానీ సత్యశేఖర్, కాపుగంటి జోగేంద్ర శేషు ఉన్నారు.

అదేవిధంగా మామిడిశెట్టి సాయిశేఖర్, పఠాన్ ఇమ్రాన్ ఖాన్, దుబ్బల వెంకటేష్, ఉప్పతల గోపి, దేవళ్ల వేణు, ఇస్లావత్ లక్ష్మీకళ్యాణ్, బిల్ల సాయితరుణ్, వేరంశెట్టి వంశీ, సంగెం ప్రవీణ్ కుమార్, భూక్యా తరుణ్, అఖీల్ అబ్ధుల్, మందా శ్రీహరిబాబు, ఒర్సు కృప, జుంజునూరి రాధాకృష్ణ, మందా పవన్ కుమార్ తదితరులు నిందితులుగా ఉన్నారు.

విదేశాల నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న సైబర్ నేరగాళ్లు ‘మ్యూల్’ ఖాతాల ద్వారా రూ. 1,000 కోట్లకు పైగా దోపిడీ చేసిన రెండు ప్రధాన సైబర్ నేరాల కేసులను సమగ్ర విచారణ కోసం ఖమ్మం జిల్లా పోలీసులు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు బదిలీ చేశారు. డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు ఈ కేసులు బదిలీ కాగా, ఈ రెండు కేసులపై తిరిగి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు చెందిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) కేసును దర్యాప్తు చేస్తోంది.

అయితే తొలుత సత్తుపల్లి, పెనుబల్లి స్టేషన్లలో నమోదైన కేసులలో ఎక్కడా వికాస్ చౌదరి ప్రధాని నిందితుడు (ఏ1) కాకపోవడం గమనార్హం. పెనుబల్లి పోలీసులు నమోదు చేసిన కేసులో పోట్రు ప్రవీణ్ ను ఏ1గా పేర్కొన్నారు. ఆ తర్వాత రిమాండ్ రిపోర్టులో మాత్రం ఫైనల్ గా వికాస్ చౌదరిని ఏ1గా, అతని భార్య బొప్పన నాగప్రియను మరో కీలక నిందితురాలిగా ప్రస్తావించారు. సైబర్ నేరాల ద్వారా చేసిన దోపిడీలో అత్యంత ‘కీ’లక నిందితురాలిగా బొప్పన నాగప్రియనే పెనుబల్లి పోలీసులు ఉటంకించడం గమనార్హం.

ఇక సత్తుపల్లి పోలీసులు నమోదు చేసిన కేసులో వికాస్ చౌదరి ఐదో నిందితునిగా ఉన్నారు. కానీ ఈ రెండు కేసులను సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు బదిలీ చేసిన తర్వాత, CSB పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో ఉడతనేని వికాస్ చౌదరి ప్రధాన నిందితునిగా మారడం గమనార్హం. దీంతో రూ. 1,000 కోట్ల అనుమానాస్పద సైబర్ నేరాల లావాదేవీల కేసులో వికాస్ చౌదరి చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లుగా బాధితులు భావిస్తున్నారు.

అధికార పార్టీకి చెందిన ఖమ్మం జిల్లాలోని ఓ కీలక నేతకు బంధువైన వికాస్ చౌదరి ప్రధాన నిందితునిగా ఉన్న ఈ కేసును సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వహించే డీఎస్పీ కేవీఎం ప్రసాద్ నేతృత్వంలోని ‘సిట్’ దర్యాప్తు చేస్తోంది. దర్యాప్తు పురోగతిపై ప్రతీ వారం నివేదికను సమర్పించాలని ఉన్నతాధికారులు సిట్ టీంను ఆదేశించారు. ఇదీ ఖమ్మం జిల్లా నుంచి సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు బదిలీ అయిన రెండు సైబర్ నేరాల కేసుల్లో తిరిగి నమోదైన ఎఫ్ఐఆర్ లోని అసలు విశేషం.

Popular Articles