ఢిల్లీ: హైదరాబాద్ సైబర్ క్రైం డీసీపీ అర్వింద్ బాబు అటాచ్మెంట్ పరిణామంపై తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో గల సీఎం రేవంత్ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ, డీసీపీ అర్వింద్ బాబు అటాచ్మెంట్ అంశంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన విమర్శలపై స్పందించారు.
దేశ ప్రధాని నరేంద్ర మోదీని తిడితే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక్క కేసైనా పెట్టారా? అని సీఎం కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. కానీ ప్రధానిని సోషల్ మీడియాలో దూషించినవారిపై తమ ప్రభుత్వం కేసు నమోదు చేసిందని గుర్తు చేశారు. బీజేపీ నాయకులు కూడా అసభ్యంగా దూషిస్తున్నారని, కాక్రోచ్ జనతా పార్టీని, విద్యార్థులను అంతకంటే ఎక్కువే దూషించారని సీఎం ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి:
ఓ డీసీపీని బదిలీ చేశానని కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారని, అధికారిని బదిలీ చేయడం ప్రభుత్వానికి ఉన్నటువంటి అధికారమని సీఎం పేర్కొన్నారు. తన పరిధిలో ఉంది కాబట్టి డీసీపీని తానే బదిలీ చేశానని సంబంధిత పోలీసు శాఖను ఉటంకిస్తూ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ప్రధాని నరేంద్రమోదీని దూషించినట్లు తెలంగాణా బీజేపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదుపై హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు మెటా ఇండియా హెడ్ పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనానంతరం సైబర్ క్రైం డీసీపీ అర్వింద్ బాబును ఆశ్చర్యకరమైన రీతిలో డీజీపీ ఆఫీసుకు అటాచ్మెంట్ చేస్తూ, బాధ్యతల నుంచి వెంటనే రిలీవ్ చేసిన సంగతి తెలిసిందే. తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ అంశంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శకు సీఎం రేవంత్ ఆయా విధంగా రియాక్టయ్యారు.

