(‘సమీక్ష’ న్యూస్ డెస్క్)
ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న నాయకుడి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు అనుమతిని నిరాకరించింది? సరిగ్గా రెండు రోజుల క్రితం ఢిల్లీలో సీడబ్ల్యూసీ సమావేశానికి వెళ్లిన తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి అటు నుంచి అటే లండన్ కు వెళ్లారు. లండన్ లో తన పర్యటనను ముగించిన తర్వాత సీఎం రేవంత్ అమెరికాకు వెళ్లాల్సి ఉంది. కానీ సీఎం అమెరికా పర్యటనకు కేంద్ర విదేశాంగ శాఖ అనుమతిని నిరాకరించిన ఫలితంగా ఆయన లండన్ నుంచి తిరిగి హైదరాబాద్ కు రావలసిన అనివార్యత ఏర్పడింది. సీఎం విదేశీ పర్యటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చాలా రోజుల క్రితమే కేంద్రానికి లేఖ రాసిందట. అయితే యూకే పర్యటనకు మాత్రమే అనుమతించిన విదేశాంగ శాఖ అమెరికా పర్యటనకు మాత్రం నో చెప్పింది.
ఈ పరిణామం తెలంగాణా రాజకీయల్లోనే కాదు, పరిశీలక వర్గాల్లోనూ తీవ్ర చర్చకు దారి తీసింది. తన అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతిని నిరాకరించిన ఘటన తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. రాజకీయ కోణంలో తన పర్యటనను అడ్డుకోవడం దిగ్భ్రాంతికి కారణంగా ఆయన పేర్కొన్నట్లు సమాచారం. మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం ‘నో’ చెప్పడంతో ఈనెల 23న లండన్ పర్యటన ముగించుకుని ఆయన తిరిగి హైదరాబాద్ కు చేరుకోనున్నారు.
అయితే ఓ రాష్ట్రానికి సీఎంగా వ్యవహరిస్తున్న నాయకుడి అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతిని నిరాకరించవచ్చా..? సీఎం రేవంత్ రెడ్డి విషయంలో విదేశాంగ శాఖ అనుమతిని నిరాకరించిన ఘటనపై ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీసింది. ఇంతకీ సీఎంల విదేశీ పర్యటనకు కేంద్రం అనుమతిని నిరాకరించవచ్చా..? సందేహమేమీ లేదు ముఖ్యమంత్రుల విదేశీ పర్యటనకు కేంద్రం ఖచ్చితంగా అనుమతించాలనే నిబంధనేమీ లేదు. కేంద్ర ప్రభుత్వం అనుమతిని నిరాకరించవచ్చు. రాజ్యాంగ నిబంధనలు, కేబినెట్ సెక్రటేరియల్ గైడ్ లైన్స్ ప్రకారం.. ముఖ్యమంత్రుల స్థాయి నాయకులే కాదు, రాష్ట్ర మంత్రులు కూడా తమ అధికారిక, వ్యక్తిగత విదేశీ పర్యటనలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతిని పొందడం తప్పనిసరి.
అవి ఏ తరహా అనుమతులంటే..?
విదేశాంగ శాఖ నుంచి రాజకీయ అనుమతి తీసుకోవాలి. ఇది అత్యంత కీలకం. నాయకుడి పర్యటన ఉద్ధేశం, దేశాల మధ్య సంబంధాలపై ఆ నాయకుడి పర్యటన ప్రభావం వంటి పలు అంశాలను పరిశీలించిన తర్వాతే క్లియరెన్స్ ఇస్తారు. దీంతోపాటు ఆర్థిక అనుమతి కూడా తీసుకోవాలి. ఫైనాన్స్ మినిస్ట్రీ పరిధిలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ (డీఈఏ) నుంచి విదేశీ మారకద్రవ్యం, ఖర్చులకు సంబంధించిన అనుమతి కూడా తీసుకోవాలి. అదేవిధంగా విదేశీ సంస్థల నుంచి ఆతిథ్యాన్ని, నిధులను స్వీకరించే పరిస్థితి ఉంటే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద అనుమతి పొందాలి. ఆయా నాయకుల అధికారిక పర్యటనలకైతే ప్రధాని కార్యాలయం (పీఎంవో) తుది ఆమోదాన్ని తెలపాల్సి ఉంటుంది.

కేంద్రం ఎందుకు నిరాకరించవచ్చు..?
ముఖ్యమంత్రి స్థాయి నాయకుడైనా, మంత్రి హోదా లీడరైనా కేంద్ర ప్రభుత్వం ఆయా నేతల విదేశీ పర్యటనలకు అనుమతిని నిరాకరించేందుకు పలు కారణాలు ఉన్నాయి. సాధారణంగానే దేశ భద్రత, విదేశాంగ విధానం కోనంలో అనుమతిని నిరాకరించవచ్చు.. ఆయా నాయకుడి పర్యటన వల్ల ఇతర దేశాలతో గల ద్వైపాక్షిక సంబంధాలకుగానీ, మనదేశ విదేశాంగ విధానానికిగానీ భంగం వాటిల్లే అవకాశం ఉందని భావిస్తే అనుమతి నిరాకరించవచ్చు. ప్రొటోకాల్, పర్యటన స్థాయి వల్ల కూడా అనుమతి నిరాకకరించొచ్చు. అంటే ముఖ్యమంత్రి స్థాయికి తగని అంతర్జాతీయ వేదికలకుగానీ, స్థానిక కార్యక్రమాలకుగానీ ఇన్విటేషన్స్ వచ్చినపుడు అనుమతిని నిరాకరించే ఛాన్స్ ఉంది. అంతేకాదు రాష్ట్రంలో అత్యవసర పరిస్థితులు ఉన్నపుడు, పర్యటనకు చేసే ఖర్చుల వెనుక సరైన కారణాలు లేనపుడు అనుమతిని నిరాకరించవచ్చు.

గతంలోనూ పలువురు సీఎంలకు ఇదే అనుభవం:
ముఖ్యమంత్రి స్థాయి నాయకుడి విదేశీ పర్యటనకు కేంద్రం అనుమతిని నిరాకరించడం ఇదే మొదటిసారి కాదు.. చివరిసారి కూడా కాకపోవచ్చు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అరవింద్ కేజ్రీవాల్ సింగపూర్ పర్యటనకు కూడా కేంద్రం అనుమతిని ఇవ్వకపోవడం గమనార్హం. నిరుడు అక్టోబర్ లో కేరళ సీఎం పినరయి విజయన్ గల్ఫ్ దేశాల పర్యటనకు కూడా కేంద్రం అనుమతిని నిరాకరించింది. తాజాగా తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి ఎంచుకున్న అమెరికా పర్యటనకు కేంద్రం నిరాకరించింది. ఒక రాష్ట్రానికి ప్రతినిధులుగా మాత్రమే కాకుండా, అంతర్జాతీయ వేదికలపై సీఎంలు దేశ అధికారిక ప్రతినిధులుగా పరిగణించబడతారు. అందువల్ల ఈ అంశంలో కేంద్ర విదేశాంగ శాఖకు పూర్తి నియంత్రణాధికారం ఉంటుంది.

అనుమతి నిరాకరణపై తెలంగాణా సీఎం రియాక్షన్:
కాగా తన అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడంపై తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. “రాజకీయ కారణాలతో అనుమతి నిరాకరించడం” పట్ల ముఖ్యమంత్రి తీవ్ర విస్మయం వ్యక్తం చేసినట్లు సీఎంవో అధికారిక ప్రకటన తెలిపింది. అయినప్పటికీ కేంద్ర నిర్ణయాన్ని గౌరవిస్తూ లండన్ నుంచి హైదరాబాద్‌కు తిరిగి రావాలని, బోస్టన్, అమెరికా పర్యటనకు వెళ్లకూడదని సీఎం నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. “ఈ పర్యటన ఉద్దేశం ఒక్కటే. కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యా విధానంలో భాగంగా ప్రపంచంలోని ప్రఖ్యాత విద్యా సంస్థలను భారత్‌కు, తెలంగాణకు, హైదరాబాద్‌కు తీసుకురావడం. అత్యుత్తమ ఐవీ లీగ్ విశ్వవిద్యాలయాలను, ప్రపంచంలోని అగ్రశ్రేణి విద్యాసంస్థల నుంచి విద్య, నైపుణ్యాలు, శిక్షణ పొందాలన్న మన యువత ఆకాంక్షలకు ఇవి సమాధానంగా నిలిచేవి. దేశ నిర్మాణం, యువత భవిష్యత్తు విషయానికి వస్తే అందరూ రాజకీయాలు, ఎన్నికలకు అతీతంగా ఆలోచించాలని నేను ఎప్పుడూ విశ్వసిస్తాను” అని సీఎం వ్యాఖ్యానించినట్లు సీఎంవో ప్రకటన వివరించింది.
విదేశాంగ శాఖ క్లారిటీ:
కాగా తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరణపై విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జయస్ వాల్ క్లారిటీ ఇచ్చారు. సీఎంలు, ఇతర ప్రముఖుల విదేశీ పర్యటనలకు అనుమతి మంజూరు చేయడానికి ముందు ఆ వివరాలను విదేశీ వ్యవహారాల శాఖ పరిశీలిస్తుందని చెప్పారు. ఆయా నాయకులులు, ప్రముఖులు చేసే పర్యటన నిర్వహిస్తున్న పదవి ఉద్ధేశానికి తగినట్లుగా ఉండాలని, అమెరికా పర్యటన అంశంలో మాత్రం ఆ నిబంధనలను పాటించలేదని, అందువల్లే అనుమతి నిరాకరించినట్లు ఆయన పేర్కొన్నారు.

