హైదరాబాద్: హైదరాబాద్ సైబర్ క్రైం విభాగపు డిప్యూటీ పోలీస్ కమిషనర్ (డీసీపీ) వి. అరవింద్ బాబు అకస్మాత్తుగా అటాచ్మెంట్ గురైన పరిణామం తీవ్ర చర్చకు దారి తీసింది. ఉన్నఫళంగా ఆయనను విధుల నుంచి రిలీవ్ చేస్తూ డీజీపీ ఆపీసులో రిపోర్ట్ చేయాలని జారీ అయిన ఉత్తర్వు తెలంగాణా పోలీస్ శాఖలో చర్చకు తావు కల్పించింది. ఇదో అశ్చర్యకర పరిణామంగా పోలీసు వర్గాలు చర్చించుకుంటున్నాయి. డీసీపీ అరవింద్ బాబును డీజీపీ ఆఫీసుకు అటాచ్ చేస్తూ ఉత్తర్వు జారీ కావడం వెనుక దారి తీసిన పరిస్థితులపై రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది.
నీట్ పేపర్ లీక్ పై కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇటీవల ఆందోళనలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ గా చేసుకుని మార్ఫింగ్ చేసిన అభ్యంతకరమైన కంటెంట్ ను పోస్ట్ చేశారని ఆరోపిస్తూ రాష్ట్ర బీజేపీకి చెందిన నాయకులు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బీజేపీ సోషల్ మీడియా సీసీ మెంబర్ టి. సాయికిరణ్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదుపై ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్ లలో కంటెంట్ పోస్ట్ చేసిన ఖాతాలను ఏ1గా, మెటా ఇండియా హెడ్ ను ఏ2గా చేరుస్తూ సైబర్ క్రైం పోలీసులు గత నెల 29వ తేదీన కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నెం. 503/2026 ద్వారా నిందితులపై ఐటీఏ చట్టం-2000-2008లోని 66-C, 67, బీఎన్ఎస్ చట్టంలోని 353(2), 336(4) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
అయితే ఈ పరిణామం ప్రభుత్వ పెద్దలకు కొందరికి నచ్చలేదని, అందువల్లే డీసీపీ అరవింద్ బాబును ‘అటాచ్మెంట్’ ద్వారా బలి చేశారనే ప్రచారం జరుగుతోంది. జాతీయ, రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం విద్యార్థుల ఆందోళనకు, నిరసనలకు మద్దతుగా ఉన్న పరిస్థితుల్లో, బీజేపీ మద్ధతుదారుల ఫిర్యాదుతో సీజేపీ నిరసనల వీడియోలను ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా ఖాతాలపై, మెటా ఇండియా హెడ్ పై కేసు నమోదు చేయడంపై ప్రభుత్వ వర్గాలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నాయట. ముఖ్యంగా సీఎంవో ఉన్నతాధికారులు, మరికొందరు పోలీసు ఉన్నతాధికారులు ఈ అంశంలో సంతృప్తిగా లేరనే వార్తలు వెలువడ్డాయి.
ఈ నేపథ్యంలోనే సైబర్ క్రైం డీసీపీ అరవింద్ బాబుకు అటాచ్మెంట్ ఆర్డర్ ఇస్తూ, నిన్న సాయంత్రమే డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశించారనే ప్రచారం జరుగుతోంది. అయితే డీసీపీ అరవింద్ బాబు అటాచ్మెంట్ కు అంతర్గతంగా దారి తీసిన పరిణామాలపై వ్యాప్తిలోకి వచ్చిన ప్రచారపు సారాంశం ఉత్తర్వులో ఉండకపోవచ్చు. పరిపాలనా సౌలభ్యంలో భాగంగానే ఈ చర్య తీసుకున్నట్లు ఉత్తర్వులో ఉటంకించే అవకాశం ఉంది. కానీ ఈ కేసు నమోదు పరిణామాల్లోనే డీసీపీ అరవింద్ బాబును అటాచ్ చేశారనే ప్రచారం మాత్రం పోలీసు వర్గాల్లో జరుగుతోంది. మొత్తంగా డీసీపీ అరవింద్ బాబు అటాచ్మెంట్ ఆర్డర్ ఓ ఆశ్చర్యకర పరిణామంగా పోలీసు వర్గాలు అభివర్ణిస్తున్నాయి.

