Top 5 This Week

Related Posts

నాపై కుట్ర: అప్పుల చెల్లింపులపై మంచిర్యాల ఎమ్మెల్యే క్లారిటీ

హైదరాబాద్: రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణపైగానీ, మంత్రి పదవికి సంబంధించిన చర్చ వచ్చిన ప్రతీసారి తనపై కుట్ర జరుగుతోందని అధికార పార్టీకి చెందిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. అందులో భాగంగానే తనపై నిరాధార, అవాస్తవాలతో కూడిన వార్తా కథనాలను మీడియా ముందుకు తీసుకువస్తున్నారని అన్నారు. ఇదంతా కుట్రలో భాగమేనని ఆయన అన్నారు.

తనపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కొందరు ప్రజాప్రతినిధులు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని, వారు వారి సొంత పత్రికల్లో కాకుండా ఇతర మీడియాలో తనపై తప్పుడు వార్తలు రాయించి, బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తమ సంస్థలకు మంజూరైన రూ. 450 కోట్ల రుణ మొత్తాన్ని వాడుకోలేదని, అందులో రూ. 109.11 కోట్లు మాత్రమే వినియోగించుకున్నట్లు చెప్పారు. మంజూరైన రుణంలో వాడుకున్న మొత్తం మేరకే చెల్లింపులు చేశామన్నారు. ఈమేరకు ప్రేమ్ సాగర్ రావు బుధవారం మీడియాతో మాట్లాడారు.

కేవలం రెండేళ్లలోనే రూ. 450 కోట్ల రుణాలను తీర్చేశారంటూ ప్రచురించిన వార్తలు పూర్తిగా అవాస్తవమని, అవి నిరాధార కథనాలని ఆయన అన్నారు. తన వ్యాపార, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలను పక్కా గణాంకాలతో ఆయన మీడియా ముందుంచారు. తాను 450 కోట్ల రూపాయలు వాడుకున్నట్లు వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదన్నారు. 2009-10 కాలంలో సాయినాథ్ ప్రైవేట్ లిమిటెడ్, భాగ్యనగర్ హోటల్స్ పేరుతో బ్యాంకుల నుంచి నిబంధనల ప్రకారమే రుణం తీసుకున్నామని వెల్లడించారు.

అదేవిధంగా 2014 నుండి 2025 మధ్య కంపెనీకి వాడిన ఫండ్స్ 109 కోట్ల 11 లక్షల రూపాయలు మాత్రమేనని, ఆర్‌బీఐ, సెబీ నిబంధనలకు లోబడే ఈ రుణాలు తీసుకున్నట్లు వివరించారు. 2014-15లో బ్యాంకులు 109.11 కోట్లు ఎన్‌పీఏగా ప్రకటిస్తే, తాము 2014-25 మధ్యకాలంలో 44.81 కోట్లు, ఆ తర్వాత కూడా మిగిలిన మొత్తాన్ని క్రమం తప్పకుండా చెల్లిస్తూ వచ్చామని స్పష్టం చేశారు. రూ. 450 కోట్ల ఫ్రాడ్ జరిగితే బ్యాంకులు 109 కోట్లకే వేలం ఎలా వేస్తాయని ప్రేమ్ సాగర్ రావు ఈ సందర్భంగా ప్రశ్నించారు.

తాను కాంగ్రెస్ పార్టీ కోసం పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేశానని చెప్పారు. అధికారం ఉన్నప్పుడు కూడా ఎలాంటి ఇసుక, మట్టి మాఫియాలకు, అధికార దుర్వినియోగానికి పాల్పడలేదన్నారు.. యూఎస్ ట్రేడింగ్‌లో నష్టం రావడం వల్ల వ్యక్తిగతంగా 160 కోట్లు నష్టపోయినప్పటికీ, చట్టబద్ధంగానే బ్యాంక్ బకాయిలను చెల్లిస్తున్నానని ఆయన చెప్పారు.

తనపై వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం నిజనిర్ధారణ కమిటీ వేస్తే పూర్తి ఆధారాలు సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు. ఆరోపణలు చేస్తున్నవారు బహిరంగంగా ఎక్కడైనా చర్చకు రావాలని సవాల్ విసిరారు. రాష్ట్రవ్యాప్తంగా సొంత నిధులతో 15 పాఠశాలలు నిర్మించి విద్యా రంగానికి సహకరించిన తనకు ఎలాంటి అక్రమాలు చేయాల్సిన అవసరం లేదన్నారు. త్వరలోనే తనపై కుట్రలు పన్నిన వారి అసలు రంగును బయటపెడతానని ప్రేమ్ సాగర్ రావు పేర్కొన్నారు.

Popular Articles