హైదరాబాద్: సిటీ సివిల్ కోర్టులో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కి ఊరట లభించింది. బండి భగీరథ్ కేసులో బండి సంజయ్ పై దుష్ప్రచారాన్ని ఆపాలని సిటీ సివిల్ కోర్టు ఆదేశించింది. పోక్సో కేసులో భవిష్యత్తులో తన పేరు వాడకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి బండి సంజయ్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన సిటీ సివిల్ కోర్టు గురువారం ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు తన పేరుతో వాడిన వీడియోలను తొలగించాలని సంజయ్ కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఆయనకు ఈ ఊరట లభించింది.
బండి సంజయ్ పై దుష్ప్రచారం ఆపాలని, వీడియోలు తొలగించాలని, పత్రిక క్లిప్పింగులు, డిజిటల్ కంటెంట్, వాల్ పోస్టర్లను తొలగించాలని కోర్టు ఆదేశించింది. ఈనెల 26వ తేదీలోగా ఆయా అభ్యంతరకర కంటెంట్ ను తొలగించాలని కూడా మధ్యంతర ఉత్తర్వులో పేర్కొంది. ఇదిలా ఉండగా బండి భగీరథ్ కేసులో బాలిక వివరాలను సోషల్ మీడియాలో ప్రసారం చేసిన ఘటనలపై పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. మేడ్చల్ జిల్లా బాలల సంక్షేమ కమిటీ ఛైర్ పర్సన్ ఇచ్చిన ఫిర్యాదుపై సోషల్ మీడియా నిర్వాహకులపై పోలీసులు ఈ కేసులు నమోదు చేశారు.
