శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గా పనిచేసిన తమ్మినేని సీతారాం, ఆయన కుటుంబ సభ్యులు ఇప్పుడు ఎక్కడున్నారు? ఆయన సహా కుటుంబం అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్లింది? వైఎస్ఆర్ సీపీకి చెందిన ఈ మాజీ స్పీకర్ కుటుంబం నిన్న తెల్లవారుజాము నుంచి పరారీలో ఉందనే వార్తలు వస్తున్నాయి. సొంత వాహనాలు ఉన్నప్పటికీ, ఓ ప్రయివేట్ కారును తెప్పించుకుని, తమ ఫోన్లు కూడా ఇంట్లోనే వదిలి తమ్మినేని కుటుంబం ఆముదాలవలస నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిందనేది ఆయా వార్తల సారాంశం. తమ్మినేని ఇంటికి తాళం వేసి ఉందని ఎలక్ట్రానిక్ మీడియా కూడా తాజాగా బ్రేకింగ్ న్యూస్ ప్రసారం చేస్తోంది. ఇంతకీ తమ్మినేని సీతారాం సహా ఆయన కుటుంబ సభ్యులు ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్లారనేది ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఏపీ రాష్ట్ర అసెంబ్లీకి స్పీకర్ గా వ్యవహరించిన తమ్మినేని సీతారాం కుటుంబం ఇంతకీ ఎక్కడికి వెళ్లింది? పరారీ వార్తలు ఎందుకు వస్తున్నాయి? ఇంటికి తాళం వేసి, ఫోన్లు వదిలేసి, ప్రయివేట్ కారులో పలాయనం చిత్తగించాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ఓసారి వివరాల్లోకి వెళ్లి సమీక్షిస్తే..
శ్రీకాకుళం జిల్లాలోని ఓ భూకబ్జా వ్యవహారం తమ్మినేని సీతారాం కుటుంబం ప్రస్తుత పరిస్థితికి కారణంగా వార్తలు వస్తున్నాయి. నకిలీ పత్రాలు, బూటకపు డెత్ సర్టిఫికెట్లు, వారసుల పేరుతో కల్పిత రికార్డుల కారణంగా నమోదైన భూకబ్జా కేసు తమ్మినేని సీతారాంకు ప్రస్తుతం తీవ్ర చిక్కులను తెచ్చిపెట్టినట్లు సమాచారం. ఈ కేసుపై ప్రస్తుతం శ్రీకాకుళం పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు.
ఈ భూకబ్జా కేసులో సీతారాం కుటుంబ సభ్యులు సహా మొత్తం 13 మందిని పోలీసులు నిందితులుగా పేర్కొన్నారు. వీరిలో ఎనిమిది మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. చాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని 900 చదరపు గజాల ఖాళీ స్థలాన్ని నకిలీ పత్రాల ద్వారా కబ్జాకు పాల్పడ్డారనేది కేసులోని అసలు సారాంశం. ఓ ముఠా నకిలీ పత్రాలను సృష్టించి తప్పుడు యాజమాన్య హక్కులను క్లెయిమ్ చేసిందని శ్రీకాకుళం ఎస్పీ కె.వి. మహేశ్వర్ రెడ్డి ప్రకటించారు.
భూమి అసలు యజమాని చనిపోయినట్లు ఫేక్ డెత్ సర్టిపికెట్ ను తయారు చేసి, యాజమాన్య హక్కులను అక్రమంగా బదిలీ చేయడానికి కుటుంబ, వారసత్వ సంబంధిత కల్పిత పత్రాలను సృష్టించారని ఎస్పీ పేర్కొన్నారు. ఈ అంశంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి భూమితో ఎటువంటి సంబంధం లేని వ్యక్తిని అసలు భూయజమాని కుటుంబ సభ్యునిగా చూపించారని తెలిపారు. తద్వారా ఆయా ఆస్తిని తమ్మినేని సీతారాం కుమారుడు తమ్మినేని వెంకట శ్రీరామ చిరంజీవి నాగ్ అలియాస్ నాని పేరుపై రిజిస్ట్రేషన్ చేశారనేది పోలీసుల కథనం.
ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టయినవారిలో అడబాల రజని, తెలుగు సతీష్ కుమార్, సలిపిల్లి లక్ష్మణ్ రావు, ఎం. ఉపేంద్ర కుమార్, జేగురుపాటి ఉపేందర్ రావు, మామిడి గోపాలకృష్ణ, సంబాన సాంబశివరావు, కూన పెద్దిరాజు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మిగతా నిందితుల్లో తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణి, కుమారుడు వెంకట శ్రీరామ చిరంజీవి నాగ్ లతోపాటు మాజీ హోంగార్డు త్రినాథ్, హిర మండలం సబ్ రిజిస్ట్రార్ ఉన్నారు.
నకిలీ పత్రాల ద్వారా భూమిని రిజిస్ట్రేషన్ చేసినందుకు సంబంధిత సబ్ రిజిస్ట్రార్ పాత్రను కూడా పరిశీలిస్తున్నామని ఎస్పీ మహేశ్వర్ రెడ్డి చెప్పారు. ఇదే దశలో తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణి, కుమారుడి ప్రమేయంపైనా దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఎస్పీ చెప్పారు. తమ్మినేని సీతారాం, ఆయన కుటుంబ సభ్యులు ఈ వ్యవహారంలో కుమ్ముక్కయినట్లు తేలితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు.
కేసు దర్యాప్తులో భాగంగా నేరానికి ఉపయోగించినట్లు భావిస్తున్న నకిలీ రబ్బర్ స్టాంపులను, మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా ఈ భూమి విలువ రూ. 4.00 కోట్లుగా తెలుస్తోంది. ఓ భూకబ్జా కేసు అసెంబ్లీ స్పీకర్ గా పనిచేసిన తమ్మినేని సీతారాం కుటుంబం నిన్నటి నుంచి పత్తా లేకుండా పరారీ అయినట్లు వ్యాప్తిలోకి వచ్చిన వార్తలు సహజంగానే చర్చకు దారి తీశాయి.
అయితే ఈ కేసులో అరెస్ట్ భయంతోనే తమ్మినేని, ఆయన భార్య, కుమారుడు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ముందస్తు బెయిల్ ప్రయత్నాల్లో తమ్మినేని సీతారాం కుటుంబం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తంగా వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వంలో అసెంబ్లీ స్పీకర్ గా కీలక బాధ్యతలు నిర్వహించిన తమ్మినేని సీతారాం కుటుంబం భూకబ్జా కేసులో నిందితులుగా మారి ఎదుర్కుంటున్న ప్రస్తుత చిక్కులు రాజకీయంగానూ చర్చకు దారి తీశాయి.

