ఖమ్మం: పోక్సో కేసులో నిందితునిపై నేరారోపణ రుజువు కావడంతో అతనికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ. 50 వేల జరిమానా విధిస్తూ ఖమ్మం మొదటి అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి బి. శ్రీనివాసరావు తీర్పునిచ్చారు. ఈ అంశాన్ని ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి తెలిపారు.
ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. ఖమ్మం రూరల్ మండలానికి చెందిన బోయినపల్లి వీరబాబు (40) ఇంటి బయట ఆడుకుంటున్న అయిదేళ్ల బాలికను 2023 మే 28వ తేదీన బలవంతంగా తన ఇంట్లోకి తీసుకెళ్లి, టీవీ సౌండ్ ఎక్కువ పెట్టి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో ఖమ్మం రూరల్ పోలీసులు క్రైమ్ నెంబర్ 279/2023 ద్వారా పోక్సో చట్టం కింద వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం విచారణ, దర్యాప్తు, సాక్ష్యాధారాల సేకరణ వేగవంతంగా పూర్తిచేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశాశారు.
వాద, ప్రతివాదనల అనంతరం కేసు పూర్వపరాలు, సాక్ష్యాధారాలు, వైద్య నివేదికను పరిశీలించిన న్యాయమూర్తి బి. శ్రీనివాసరావు నిందితున్ని దోషిగా నిర్ధారించారు. బోయినపల్లి వీరబాబుకు ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ. 50,000 జరిమానా విధిస్తూ తీర్పును వెలువరించారు. ప్రాసిక్యూషన్ తరపున అదనపు ప్రాసిక్యూటర్ జమ్ముల శరత్ కుమార్ రెడ్డి వాదించారు.
ఈ కేసులో విచారణాధికారులు ఎస్సై వెంకటకృష్ణ, భరోసా లీగల్ ఆఫీసర్ ఎం.ఉమారాణి, కోర్టు కానిస్టేబుల్ ఎం. వెంకయ్య , కోర్టు లైజనింగ్ ఆఫీసర్ శ్రీకాంత్, హోం గార్డ్ చిట్టిబాబులను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించినట్లు ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి వివరించారు.

