ఖమ్మం: రైతులెవరూ వరి పంట సేద్యం చేయవద్దని తెలంగాణా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. భూగర్భ జలాలు, వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రాబోయే రెండు నెలల్లో మరింత తగ్గిపోతాయని, రైతులు ఎవరు వరి పంట సాగు చేయవద్దని ఆయన కోరారు. ఎల్నినో ప్రభావంతో ఏర్పడే పరిస్థితులను శాస్త్రీయ అంచనాలు, క్షేత్రస్థాయి వాస్తవాలు, శాఖల సమన్వయంతోనే సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని కూడా ఆయన అన్నారు.
సోమవారం ఖమ్మం కలెక్టరేట్ సమావేశ మందిరంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సురేంద్ర మోహన్, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రత్యేక అధికారి అనుదీప్ దురిశెట్టి, ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్., భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు లతో కలిసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎల్నినో పరిస్థితులు, వర్ష పాతం, త్రాగునీటి లభ్యత, సాగునీటి పరిస్థితి, భూగర్భ జలాలు, విద్యుత్ సరఫరా, పంటల ప్రణాళికలపై సంబంధిత శాఖల అధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించారు.
సమావేశంలో పెద్దపల్లి జిల్లాకు చెందిన శాస్త్రవేత్త డాక్టర్ సంపత్ ఎల్నినో పరిస్థితులపై ప్రజెంటేషన్ ఇచ్చారు. జూలై 15 నాటికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 35 శాతం వర్షపాతం లోటు నమోదైందని, రైతులు ప్రస్తుతం పత్తి అధికంగా సాగు చేశారని, వర్షాలు వస్తే వరి పంట వేద్దామని చూస్తున్నారని, భూగర్భ జలాలు గలవారు వరి పంట సాగుకు ముందుకు వెళ్తున్నారని అధికారులు వివరించారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకే జిల్లాల్లో సమీక్షా సమావేశాలను ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నీటి పారుదల, ప్రణాళిక, వ్యవసాయ, భూగర్భ జలాలు, విద్యుత్ శాఖలు పూర్తి సమన్వయంతో పనిచేస్తూ ముందస్తు కార్యాచరణను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
జిల్లాలో ఇప్పటి వరకు నమోదైన వర్షపాతం లోటు ఎంత, దాని ప్రభావం ఏమిటనే అంశాలపై ప్రతి రైతుకు స్పష్టమైన అవగాహన కల్పించాలని సూచించారు. రైతులు సరైన నిర్ణయాలు తీసుకునేలా ప్రభుత్వం వద్ద ఉన్న వాస్తవ సమాచారం క్షేత్రస్థాయిలో నిరంతరం ప్రజలకు చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
గత ఏడాది, ఈ ఏడాది నీటి వనరుల లభ్యత, జలాశయాల్లో నీటి నిల్వలు, భూగర్భ జలాల పరిస్థితిపై వివరాలతో ప్రణాళిక శాఖ సమగ్ర నివేదిక సిద్ధం చేసి మీడియాకు, క్షేత్రస్థాయి అధికారులకు, రైతులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించిన మేరకు రాజీవ్ లింక్ కాలువ ద్వారా గోదావరి జలాలను ఖమ్మం జిల్లా అవసరాలకు ఎలా వినియోగించుకోవచ్చో అన్ని సాంకేతిక అవకాశాలను పరిశీలించి తక్షణమే సమగ్ర నివేదిక సమర్పించాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.
ఈ సమీక్షా సమావేశంలో ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్, ఉద్యాన శాఖ డైరెక్టర్ యాస్మిన్ బాషా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ, పి.శ్రీనివాస రెడ్డి, ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, డీఎఫ్వో, ఉమ్మడి ఖమ్మం జిల్లాల వ్యవసాయ, ఉద్యాన, నీటిపారుదల, భూగర్భ జలాలు, విద్యుత్, గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
ప్రయివేట్ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం:
కాగా ఖమ్మం జిల్లా కొణిజెర్ల మండలం అంజనాపురంలో తెలంగాణ ప్రభుత్వ సహకారంతో నిర్మించిన గోద్రెజ్ సమీకృత (ఇంటిగ్రేటెడ్) ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ప్రారంభించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, గోద్రెజ్ ఇండస్ట్రీస్ చైర్పర్సన్ నాదిర్ బి. గోద్రెజ్, గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సునీల్ కటారియా, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సురేంద్ర మోహన్, జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్, సిపి సునీల్ దత్, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ లు పాల్గొన్నారు.

