Top 5 This Week

Related Posts

విక్రమ్-1 విజయంలో సిరిసిల్ల యువ తేజాలు

అంతర్జాతీయ స్థాయిలో అంతరిక్ష రంగ యవనికపై సిరిసిల్ల యువ తేజాలు తళుక్కున మెరిశాయి. శ్రీహరికోట షార్ కేంద్రం నుంచి నింగిలోకి శనివారం విజయ విహారం చేసిన విక్రం- 1 ఆర్బిటాల్ వాహకం ప్రయోగంలో పాల్గొన్న ఇంజనీర్లలో సిరిసిల్లకు చెందిన ముగ్గురు ఇంజనీర్లు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం విశేషం. ఈ విజయంలో పాలుపంచుకున్న ముగ్గురు యువకులు సిరిసిల్ల ప్రాంత ప్రజలకు గర్వకారణంలా నిలిచారు.

సిరిసిల్ల పట్టణానికి చెందిన ఇద్దరు సోదరులు అడుప సంతోష్ కుమార్, అడుప కిరణ్, అలాగే బొమ్మ దేని నాగరాజు ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరంతా విక్రం-1 సక్సెస్ లో భాగస్వాములు కావడం ఇక్కడి ప్రజలను ముఖ్యంగా యువకులను విశేషంగా ఆకర్షించింది. హైదరాబాద్ కు చెందిన తొలి ప్రైవేట్ అంతరిక్ష సంస్థ “స్కై రూట్ ఏరో స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్” రూపొందించిన తొలి ఆర్బిటల్ ప్రయోగ వాహకం విక్రమ్ వన్ శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుండి దూసుకెళ్లి సక్సెస్ అయిన విషయం విదితమే.

ఇది తమ మొదటి ప్రయత్నంలోనే ఉపగ్రహాలను దిగువ భూ కక్ష్య లో ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించింది. భారత అంతరిక్ష ప్రయోగాల చరిత్రలో ప్రైవేటు రంగం సత్తా చాటడం ద్వారా భారత అంతరిక్ష చరిత్ర లో ఓ సరికొత్త అధ్యాయం మొదలవగా, ఈ ఆర్బిటల్ ప్రయోగంలో సిరిసిల్ల ముగ్గురు యువ ఇంజనీర్లు అంతర్భాగం కావడం భారత అంతరిక్ష విజయానికి తమ వంతు సేవగా అందించినట్లు అయిందని భావిస్తున్నారు. ముఖ్యంగా ఒకే ఊరు, ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువ ఇంజనీర్లు విశేష సేవలు అందించడం ద్వారా వీరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఈ ప్రయోగంలో అడుప సంతోష్ కుమార్ “అవియానిక్స్ చెక్ అవుట్ లీడ్” గా రాకెట్ అవియానిక్స్ వ్యవస్థల తనిఖీలు పరీక్షలు, అలాగే ప్రయోగానికి ముందు కీలకమైన గ్రౌండ్ చెక్ అవుట్ కార్యకలాపాలకు నాయకత్వం వహించారు. అడుప కిరణ్ ” రాకెట్ క్యాడ్ డిజైనర్” గా రాకెట్ రూపకల్పనకు సంబంధించిన డిజైన్ పనుల్లో కీలక పాత్ర పోషించారు. ఇక బొమ్మదేని నాగరాజు “ఎలక్ట్రికల్ ఇంటిగ్రేషన్” విభాగంలో రాకెట్ విద్యుత్ వ్యవస్థల సమీకరణ పనులను విజయవంతంగా నిర్వహించారు.

భారత ప్రైవేట్ అంతరిక్ష రంగ ప్రపంచ వేదికపై తన సామర్థ్యాన్ని చూపడంలో విక్రమ్ వన్ ద్వారా అపూర్వ విజయాన్ని సాధించగా అందులో తమ ప్రాంతానికి చెందినవారు ఆ విజయ గాధలో తమ ప్రతిభా పాటవాలను చూపడం ద్వారా సిరిసిల్ల ఖ్యాతిని దశ, దిశలా చాటారని ఇక్కడి ప్రజలు ఆ ముగ్గురు ఇంజనీర్లను అభినందిస్తున్నారు.

Popular Articles