ఖమ్మం: ఖమ్మం నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పన్నెండేళ్ల వయస్సు గల ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడి, ఆతర్వాత ఆమెను మూడంతస్తుల భవనంపై నుంచి కిందకి తోసేశాడో కామోన్మాది. ఈనెల 6వ తేదీన జరిగిన ఘటనపై ఖమ్మం టూ టౌన్ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన అమనుషపు ఉదంతం పూర్వాపరాలు ఇలా ఉన్నాయి.
ఖమ్మం నగరంలో ఓ ప్రాంతానికి చెందిన 12 ఏళ్ల బాలికపై లారీ డ్రైవర్ గా పనిచేసే గౌస్ (49) అనే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత బాలికను మూడంతస్తుల భవనంపై నుంచి తోసేశాడు. గౌస్ అఘాయిత్యం ఫలితంగా బాలిక వెన్నుపూస, చేతులు, కాళ్లు, పక్కటెముకలు విరిగినట్లు సమాచారం. బాధిత బాలికను తొలుత ఖమ్మంలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తరలించి, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం నగరంలోని మరో ప్రయివేట్ హాస్పిటల్ కు తరలించారు.
ఈ ఘటనపై ఖమ్మం టూటౌన్ పోలీసులు నిందితుడు గౌస్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అత్యంత అమానుషమైన ఈ ఘటనపై బాధిత సామాజిక వర్గానికి చెందిన వారు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. బాధిత బాలికకు న్యాయం చేయాలని, నిందితున్ని వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

