జగిత్యాల: ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి సెగ తగిలినట్లే కనిపిస్తోంది. జీవన్ రెడ్డి రాజీనామా పరిణామాలు పార్టీలో ఆందోళన కలిగిస్తున్నట్లే గోచరిస్తోంది. ఆయన తాజా రాజకీయ కదలికలపై, బీఆర్ఎస్ లో చేరికపై అధికార పార్టీ అనుకూల, భజన మీడియాపరులు ఎంతగా ఆయనపై చులకన తరహా, కిరికిరి ముచ్చట్లతో వార్తా కథనాలు వండి వార్చినప్పటికీ, అధికార పార్టీకి మాత్రం జీవన్ రెడ్డి పార్టీని వీడుతున్న గుబులు కాంగ్రెస్ నేతల్లో ఉన్నట్లు తాజా సీన్ స్పష్టం చేస్తోంది.
జగిత్యాలకు చెందిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి గత నెల 25వ తేదీన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. నాలుగు దశాబ్ధాల సుదీర్ఘ అనుబంధాన్ని తెంచుకుంటూ ఆయన తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు పంపారు. అయితే జీవన్ రెడ్డి రాజీనామా పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ, దాని ముఖ్య నాయకులకన్నా ‘భుక్తి’ మీడియాపరులే అతిగా స్పందించినట్లు అనేక వార్తా కథనాలు ప్రబల నిదర్శనాలుగా ఉన్నాయి. ఈనెల 20వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహణ ద్వారా జీవన్ రెడ్డి గులాబీ పార్టీలో చేరికకు రంగం సిద్దమైంది.

కానీ తాజా పరిణామమేమిటి? సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే ఈ అంశంపై స్పందించడం గమనార్హం. జగిత్యాల నియోజకవర్గానికి చెందిన కొందరు కాంగ్రెస్ నాయకులతో ఆయన మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, జీవన్ రెడ్డిని ఎప్పుడూ తక్కువ చేసి చూడలేదని, ఆయన మర్యాదను తగ్గించేలా మాట్లాడలేదన్నారు. రాష్ట్రంలో 2023లో జరిగిన ఎన్నికల్లో ఆయన గెలుపు కోసం అంతా కష్టపడ్డామన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ఆయనను కరీంనగర్ నుంచి పోటీ చేయాలని సూచించామని, కానీ ఆయన నిజామాబాద్ నుంచి పోటీ చేస్తానని కోరినా పార్టీ టికెట్ ఇచ్చిందని, దురదృష్టవశాత్తు ఆయన ఓడిపోయారని సీఎం పేర్కొన్నారు.
మొండి పట్టుతో జీవన్ రెడ్డి పార్టీని వీడారని, 40 ఏండ్లు ఆయన కోసం పనిచేసిన కార్యకర్తలను మోసం చేసి, దుర్మార్గుడైన కేసీఆర్ తో జతకట్టారని కూడా సీఎం వ్యాఖ్యానించారు. జీవన్ రెడ్డిలాంటి వ్యక్తి కేసీఆర్ దగ్గర చేతులు కట్టుకుని నిలబడటం అత్యంత బాధాకరమన్నారు. ఈనాటికీ తాను ఆయన గౌరవానికి భంగం కలిగేలా ఒక్క మాట మాట్లాడలేదన్నారు.

‘మీరంతా అండగా నిలబడండి, మళ్లీ కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొద్దాం, ధైర్యంగా ఉండండి, త్వరలోనే కార్యకర్తలను కలిసేందుకు జగిత్యాలకు వస్తా, అంతా కలిసికట్టుగా జగిత్యాలను అభివృద్ధి చేసుకుందాం, వ్యక్తికంటే పార్టీ ముఖ్యమని నిరూపించిన మీ అందరినీ అభినందిస్తున్నా..’ అని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ సమవేశంలో సీఎంతో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, బీఆర్ఎస్ తరపున గెలిచిన ఎమ్మెల్యే సంజయ్ పాల్గొన్నారు.

