Top 5 This Week

Related Posts

భూ వివాదాలపై మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు

హైదరాబాద్: భూ వివాదాలకు ముగింపు పలకాలని అధికార యంత్రాంగాన్ని తెలంగాణా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఎక్కువ మొత్తంలో అటవీభూములున్నాయని, రెవెన్యూ, ఫారెస్ట్ విభాగాల మధ్య చాలా సరిహద్దు వివాదాలు ఉన్నాయని ఆయన అన్నారు. ఈ రెండు విభాగాలు కలిసి జాయింట్ సర్వే నిర్వహించి వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. పట్టా, రెవెన్యూ, ఫారెస్టు విభాగాలకు చెందిన భూముల మధ్య కూడా వివాదాలు ఉన్నాయని, ప్రభుత్వం ఇటీవల కొనుగోలు చేసిన రోవర్స్ తో సర్వే నిర్వహించి భూ వివాదాలకు ముగింపు పలకాలని మంత్రి ఆదేశించారు. ఈమేరకు ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో రెవెన్యూ, హౌసింగ్ శాఖలపై శుక్రవారం ఆయన హైదరాబాద్ లో సమీక్ష జరిపారు.

ఈ సమీక్షా సమావేశంలో ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, హౌసింగ్, రెవెన్యూ, ఫారెస్టు, హౌసింగ్ డిపార్ట్ మెంట్ అధికారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఆయా రెండు ఉమ్మడి జిల్లాల్లోని నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సహచర మంత్రులు, అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు ప్రతిపక్ష పార్టీల ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సైతం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని రాజకీయాలకతీతంగా అభినందించినట్లు చెప్పారు. గూడు లేని నిరుపేదలకు ఇండ్లు ఇచ్చే ఈ పథకాన్ని అమలు చేయడానికి వారు సహకరిస్తామన్న తీరుకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.

మొదటి దశ పూర్తి చేసుకుని రెండవ దశ ఇందిరమ్మ ఇండ్లను ముఖ్యమంత్రి చేతుల మీదుగా జూన్ 2న, రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అదిలాబాద్ జిల్లాలో ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. మొదటి విడతలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరును విజయవంతంగా పూర్తి చేసి లక్షలాది పేద కుటుంబాల సొంత ఇంటి కలలను నెరవేర్చామన్నారు. మూడు లక్షలకు పైగా ఇండ్లను మంజూరు చేయగా, దాదాపు 2.90 లక్షల వరకు గ్రౌండింగ్ కాగా, ఇందులో ఇప్పటికే సుమారు 50 వేల గృహ ప్రవేశాలు కూడా జరిగాయని చెప్పారు. అలాగే మరో రెండు లక్షలకు పైగా ఇండ్ల నిర్మాణం పనులు వివిధ దశల్లో ఉన్నాయని, వచ్చే రెండు నెలల్లో అవి పూర్తి అవుతాయని ప్రకటించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని 2,3,4 విడతల్లో కూడ అందిస్తామని చెప్పారు.

పేదల కోసమే అమలు చేస్తున్న ఈ పథకము అందే లబ్దిదారుల విషయంలో మానవీయకోణంతో వ్యవహరించాలని అధికారులకు సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇరవై వేల వరకు ప్రభుత్వం నుంచి సహాయం పొందిన వారికి కూడా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామన్నారు. ఇందిరమ్మ పైలట్ గ్రామాల్లో ఆరువందలకు పైగా చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇండ్లను నిర్మించిన వారి బిల్లులను కూడ క్లియర్ చేయాలని అధికారులను ఆదేశించారు.

ఇండ్ల బేస్ మెంట్ కోసం చెరువులు, కుంటల నుంచి మట్టిని తరలిస్తే రెవెన్యూ, పోలీసు అధికారులు అడ్డు చెప్పకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఇసుకను వీలైనంత వరకు సమీప ప్రాంతాల్లోనే అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా ఈ నెలాఖరుకల్లా వివిధ నిర్మాణ దశల్లో ఉన్న 2 బిహెచ్ కె ఇండ్లన్నిటికీ పూర్తి పారదర్శకంగా అర్హులైన నిరుపేదలకే లబ్ధి చేకూరేలా ఎంపికను పూర్తి చేయాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లకు అప్పగించారు.

డబుల్ బెడ్ రూం కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాలైన విద్యుత్, మంచినీరు, డ్రైనేజి వంటి వాటి పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. నిర్మాణంలో ఉన్న కాలనీల్లో టవర్ ను యూనిట్ గా తీసుకుని , లబ్ధిదారుల అసోసియేషన్ ల ద్వారా పనులు వేగవంతం అయ్యేలా చూడాలని సూచించారు.

Popular Articles