హైదరాబాద్: నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ఓ మహిళా ఐపీఎస్ అధికారిని లైంగికంగా వేధింపులకు గురి చేశాడనే అభియోగంపై మరో ట్రైనీ ఐపీఎస్ అధికారిపై పోలీస్ కేసు నమోదైన ఘటన ఇది. బాధిత ఐపీఎస్ అధికారిణి ఇచ్చిన ఫిర్యాదుపై ఆరోపణలు ఎదుర్కుంటున్న మరో ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిపై అత్తాపూర్ పోలీసులు బీఎన్ఎస్ చట్టంలోని 74, 75, 77, 78, 79, 127(2), 115(2), 351(2), ఐటీఏ చట్టం-2008లోని 66E, 67 A సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం వివరాల్లోకి వెడితే.. కర్నాటక రాష్ట్రానికి చెందిన ఓ మహిళా ఐపీఎస్ అధికారి హైదరాబాద్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు. ఇక్కడే శిక్షణ పొందుతున్న మరో ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి ఆమెకు వాట్సాప్ ద్వారా అసభ్యకరమైన మెసేజ్ లు పంపుతూ వేధిస్తున్నాడు. అకాడమీలో ఆమె స్నేహితుల సమక్షంలో బాధితురాలి గురించి తెలుగులో అవమానకరమైన వ్యాఖ్యలు చేశాడు. ఎటువంటి ఆధారాలు లేకుండా ఆమె మరో ట్రైనీతో లైంగిక సంబంధం కలిగి ఉందని తప్పుడు ఆరోపణలు చేశాడు.
ఆ తర్వాత అటువంటి సంబంధం ఉందని అంగీకరించేలా ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. అంతేగాక ఆమెను అసభ్య పదాలతో దూషించాడు. బెదిరింపులు, బ్లాక్ మెయిలింగ్ ద్వారా ఆమె తన పర్సనల్ మెసేజ్ లను చూపించేలా ఆమెను బలవంతం చేశాడు. గతనెల 23వ తేదీ నుంచి ఈ రకమైన వేధింపులకు పాల్పడ్డాడు. ఈనెల 8వ తేదీన ఆమె తన మొబైల్ ఫోన్ ను తన గదికి తీసుకువెళ్లి, దాని పాస్ వర్డ్ చెప్పేలా బలవంతం చేయడం ద్వారా ఉదయ్ కృష్ణారెడ్డి తన వేధింపులను తీవ్రతరం చేశాడు.
ఈనెల 9వ తేదీన రాత్రి 9.00 గంటల ప్రాంతంలో మహిళా ఐపీఎస్ అధికారిని అక్రమంగా అడ్డుకుని, బలవంతంగా తన గదికి తీసుకువెళ్లి, ఆమె జుట్టు పట్టుకుని, గొంతు నులిమి చంపడానికి ప్రయత్నించాడు. ఇదే సందర్భంలో ఆమె మెడవద్ద కత్తిని ఉంచి గదినుంచి బయటకు వెళ్లనివ్వలేదు. ఆ తర్వాత ఉదయ్ కృష్ణారెడ్డి ఆమెపై మూడు కండోమ్ పాకెట్లను విసిరాడు. అంతేగాక ఈనెల 10వ తేదీన ఉదయం 7.50 గంటలకు ఉదయ్ కృష్ణారెడ్డి మళ్లీ ఆమెపై చేతితే భౌతిక దాడి చేశాడు. అంతకు ముందు 8వ తేదీన కూడా ఆమె ప్రైవేట్ పార్టులను తాకడానికి ప్రయత్నించాడు.
అంతేగాక ఆమెకు తెలియకుండా, ఆమె అనుమతి లేకుండా ఆమెకు సంబందించిన ఒక వ్యక్తిగత వీడియోను రికార్డు చేసి, ఆమెను బ్లాక్ మెయిల్ చేసే ఉద్ధేశంతో వీడియోను ఆమె భర్తకు పంపించాడు. ఇలా తప్పుడు, కించపరిచే సమాచారాన్ని ఆమెపై వ్యాప్తి చేయడం ద్వారా మహిళా ఐపీఎస్ అధికారి పరువుకు భంగం కలిగించేందుకు ఉదయ్ కృష్ణారెడ్డి ప్రయత్నించినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. అందువల్ల నిందితునిపై చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారు కోరిన నేపథ్యంలో కేసు నమోదు చేసినట్లు అత్తాపూర్ పోలీసులు ఎఫ్ఐఆర్ లో నివేదించారు.

