Top 5 This Week

Related Posts

షేక్ జానీ డెకాయిటీ గ్యాంగ్ అరెస్ట్

పెనుబల్లి: తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న షేక్ జానీ @ జానీ షరీఫ్, పేరాల నరసింహారావు @ బాబీ, అర్వ ఉదయ్ కుమార్ అనే ముగ్గురి ముఠాను ఖమ్మం జిల్లా పెనుబల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. వీరివద్ద నుంచి 24 గ్రా. బంగారం, 1,536 గ్రా. వెండి వస్తువులను, ఒక్కొటి చొప్పున కారు, బైకు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు కల్లూరi ఏసీపీ వసుంధర యాదవ్ సోమవారం మీడియాకు తెలిపారు.

జానీ గ్యాంగ్ నుంచి స్వాధీనం చేసుకున్న వెండి, బంగారు వస్తువులను పరిశీలిస్తున్న ఏసీపీ వసుంధర యాదవ్

గత కొంతకాలంగా ముగ్గురితో కూడిన షేక్ జానీ ముఠా ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లోనేగాక ఏపీలోని పలు దేవాలయాల్లో అనేక దొంగతనాలు చేసినట్లు చెప్పారు. ఈ ముఠా కొత్తగూడెం హనుమాన్ బస్తీలోని హనుమాన్ టెంపుల్ లో, పెనుబల్లి మండలం ఉప్పల్ చెలకలోని అక్కమ్మ గుడిలో, తల్లాడ మండలం అజానపురంలోని ఆంజనేయస్వామి గుడిలో, కల్లూరు మండలం గనియా తండాలోని హనుమాన్ టెంపుల్ లో, వేంసూరు మండలం లింగపాలెం హరిక్షేత్ర దేవాలయంలో, పెనుబల్లి మండలం బయన్నగూడెంలో, ఏపీలోని గోకవరంలోని గంగాలమ్మ గుడిలో దొంగతనాలకు పాల్పడినట్లు చెప్పారు. ఆయా దేవాలయాల్లో చోరీలకు పాల్పడడం ద్వారా గుడుల్లోని బంగారు, వెండి వస్తువులను దోచుకున్నట్లు చెప్పారు.

జానీ గ్యాంగ్ కు చెందిన కారును స్వాదీనం చేసుకున్న చిత్రం

షేక్ జానీ, పేరాల నరసింహారావు, అర్వ ఉదయ్ కుమార్ ల దోపిడీ ముఠా రెండు రాష్ట్రాల్లోని వివిధ ఆలయాల్లో చోరీ చేసిన బంగారు, వెండి వస్తువులను అమ్ముకోవడానికి తిరువూరు వెడుతుండగా సీతారామపురం గ్రీన్ ఫీల్డ్ హైవే సమీపంలో అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. షేక్ జానీ ముఠాలోని ముగ్గురూ పాత నేరస్థులేనని ఏసీపీ తెలిపారు. షేక్ జానీ, అర్వ ఉదయ్ కుమార్ లపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ లో డెకాయిటీ కేసులు ఉన్నట్లు చెప్పారు. అంతేగాక షేక్ జానీపై కొత్తగూడెంం టూ టౌన్, పాల్వంచ, ఇల్లెందు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇళ్లల్లో చోరీ కేసులు కూడా ఉన్నాయని వివరించారు. పేరాల నరసింహారావుపై హైదరాబాద్ ఎల్పీ నగర్ లో ఐదు చోరీ కేసులు, ముల్కలపల్లి, నేలకొండపల్లి, గోకవరం పోలీస్ స్టేషన్ల పరిధిలోని దేవాలయాల్లో దొంగతనం కేసులు ఉన్నట్లు చెప్పారు.


Popular Articles