ఖమ్మం: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేయాలని, ఆయన కుమారుడు భగీరథను వెంటనే అరెస్ట్ చేయాలని సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ (ప్రజా పంథా) పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు డిమాండ్ చేశారు. ప్రజాస్వామిక విలువలను, చట్టాన్ని, రాజ్యాంగాన్ని బండి సంజయ్ తుంగలో తొక్కుతున్నారని, అత్యాచారాలను బహిరంగంగా సమర్థిస్తున్నారని ఆయన అన్నారు. ధర్మం, దేశం, మహిళలకు రక్షణ, గౌరవం అంటూ మాట్లాడే బీజేపీ నాయకులు, మంత్రులు తమ కోసం ధర్మాన్ని, దేశాన్ని, చట్టాన్ని అవహేళన చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈమేరకు ఆయన గురువారం ఖమ్మంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ధార్మిక సమావేశాలలో, హిందూ సమ్మేళనాలలో బండి సంజయ్ తన కొడుకు భగీరథ్ అరాచకాలను, అత్యాచారాలను, దౌర్జన్యాలను వెనకేసుకు వస్తూ, రాజకీయ కుట్ర అంటూ, ఒక్కొక్కరి సంగతి చూస్తానంటూ రెచ్చగొడుతూ, విద్వేషం చిమ్ముతున్నారని రంగారావు అన్నారు. ధర్మరక్షణ, సనాతన ధర్మం, మహిళలకు గౌరవం అని మాట్లాడే బీజేపీ పరివారం ఈ విషయంపై నోరుమెదపకుండా పరోక్షంగా అత్యాచారాలను సమర్థిస్తున్నారన్నారు.
పోలీస్ అధికారులు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ మైనర్ బాలికపై అత్యాచార ఘటనను కప్పిపుచ్చడానికి, నీరుగార్చడానికి శత విధాలా ప్రయత్నం చేస్తోందని రంగారావు ఆరోపించారు. బాధితురాలి మీద, కుటుంబం మీదనే కరీంనగర్ పోలీస్ స్టేషన్ లో అన్యాయంగా కేసు నమోదు చేశారని, బాధితురాలు అఘోరిస్తూ, విలపిస్తున్నా బండి భగీరథ్ పై కేసును విచారణ పేరుతో సాగదీస్తున్నారని అన్నారు.
బండి భగీరథ్ ను అరెస్టు చేయకుండా తమ అధికార రాజకీయాల పట్ల, అమాత్యుల పట్ల ప్రేమను, లొంగుబాటును ప్రదర్శిస్తున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం డ్రగ్ మాఫియా, అత్యాచారాల నేరస్థుల పట్ల సాచివేత వైఖరిని విడనాడాలని, కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఈ ఘటనలో బాధితురాలికి సంఘీభావంగా, భగీరథ్ ను అరెస్టు చేయాలని, బండి సంజయ్ రాజీనామా చేయాలని ఈనెల 14, 15 తేదీలలో అన్ని స్థాయిలలో నిరసనలు తెలియజేయాలని పార్టీ శ్రేణులను, ప్రజలను కోరుతున్నట్లు రంగారావు పిలుపునిచ్చారు.
మక్క, వరి ధాన్యాన్ని సత్వరమే కొనుగోలు చేయాలి:
ఎకరాకు 45 క్వింటాళ్ళ మొక్కజొన్న పండిందని, కానీ ప్రభుత్వం ఎకరాకు 20 క్వింటాళ్ళు కొంటున్నదని, ఇది అన్యాయమని రంగారావు అన్నారు. అలానే గోనె సంచుల కొరతను నివారించలేదని, కొనుగోళ్ళు నత్తనడకన సాగుతున్నాయని అన్నారు. రైతులు పంటలు ఆరబోసి, వర్షానికి తడిసి అరిగోస పడుతున్నారని, కొందరు ఆందోళనతో ఆత్మహత్యల వైపు నెట్టబడుతున్నారని పేర్కొన్నారు. వరి ధాన్యం కొనుగోళ్ళలో కూడా తీవ్ర జాప్యం జరుగుతున్నదని, లోడింగ్, అన్ లోడింగ్, తూకాలలో కూడా నిర్లక్ష్యం కొనసాగి, గంటల, రోజుల తరబడి రైతులు నిరీక్షించాల్సి వస్తున్నదని రంగారావు అన్నారు.
ప్రభుత్వం రైతు పంటను మొత్తం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నామని, రైతు పంటనే శీఘ్రంగా తూకాలు వేయాలన్నారు. అంతేగాక వారి బిల్లులు కూడా తక్షణమే చెల్లించాలని, గోనే సంచులు, హమాలీల కొరతను నివారించాలని, రైతు పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద వహించాలని సూచించారు. తడిసిన మొక్క, వరి మొత్తం పంటలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయాలని రంగారావు డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో మాస్ లైన్ పార్టీ నాయకులు ఆవుల వెంకటేశ్వర్లు, సి.వై. పుల్లయ్య, జి. రామయ్య, ఆవుల అశోక్, సిహెచ్. శిరోమణి, ఝాన్సీ, శోభ, తదితరులు పాల్గొన్నారు.
