అగర్తల: త్రిపుర డీజీపీ అనురాగ్ ధన్కడ్ ఆత్మహత్య చేసుకున్నట్లు జాతీయ మీడియా నివేదిస్తోంది. అగర్తలలోని పోలీసు ప్రధాన కార్యాయంలో డీజీపీ అనురాగ్ ధన్కడ్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయా వార్తల సారాంశం. ఆయన మృతదేహాన్ని జీబీ ఆసుపత్రికి తరలించారు.
అనురాగ్ ధన్కడ్ 1994 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి. నిరుడు మే నెలలో ఆయన త్రిపుర డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు ఇంటలిజెన్స్ డీజీగా పని చేశారు. అనురాగ్ ధన్కడ్ తన సుదీర్ఘ సర్వీసు సీబీఐ, బీఎస్ఎఫ్ విభాగాల్లో కీలక బాధ్యతలను నిర్వహించారు. ధన్కడ్ సీబీఐలో పనిచేసిన సమయంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం నిందితుడు నీరవ్ మోడీ కేసు దర్యాప్తునకు నాయకత్వం వహించారు.
అగర్తలలోని పోలీసు హెడ్ క్వార్టర్ లో ఆయన విగతజీవిగా కనిపించిన దృశ్యాన్ని ఆత్మహత్యగా అనుమానిస్తున్నారు. అయితే ఈ ఘటనపై అధికారిక సమాచారం వెల్లడి కావలసి ఉంది.

