హైదరాబాద్: తెలంగాణా రాష్ట్ర కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా బి. శివధర్ రెడ్డి బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ లక్డీకాపూల్ లోని డీజీపీ ఆఫీసులో ప్రత్యేక పూజల నిర్వహణ అనంతరం శివధర్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు. తెలంగాణా పోలీస్ శాఖలో శాంతి భద్రతలను కట్టుదిట్టంగా అమలు జరిపేందుకు బలమైన టీం ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను శాంతియుతంగా, సమర్ధవంతంగా నిర్వహించడం తమ ముందున్న మొదటి ఛాలెంజ్ గా ఆయన చెప్పారు. కొత్త డీజీపీగా ఛార్జి తీసుకున్న తర్వాత శివధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చేసిన కీలక వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే..
- డీజీపీగా నియమించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు.
- ఏ లక్ష్యంతో నన్ను నియమించారో అందుకు అనుగుణంగా పనిచేస్తాను.
- లోకల్ బాడీ ఎన్నికలు మాకు మొదటి ఛాలెంజ్.
- శాంతియుతంగా ఎన్నికలు పూర్తి చేయడానికి సన్నద్ధమవుతున్నాం.
- పోలీస్ శాఖలో 1,7000 ఖాళీలు ఉన్నాయి, ఆ నియామకాలు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటాం. ఈ విషయంలో ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదను వెళ్లినట్లున్నాయి.
- బేసిక్ పోలీసింగ్ తో సాంకేతికను ఉపయోగించుకుని మరింత సమర్థవంతంగా పని చేస్తాం.
- మావోయిస్ట్ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ ఇటీవల ఒక ప్రకటన విడుదల చేశారు.
- బయటకు రావడానికి, ఆయుధాలు వదిలి పెట్టడానికి నిర్ణయం తీసుకున్నామని ప్రకటన విడుదల చేశారు.
- జనరల్ సెక్రటరీ బసవరాజు ఉన్నపుడే ఆ నిర్ణయం జరిగిందని వేణుగోపాల్ తన ప్రకటనలో పేర్కొన్నారు.
- వేణుగోపాల్ ఇచ్చిన స్టేట్ మెంట్ ను మరో మావోయిస్ట్ నేత జగన్ ఖండించారు.
- ప్రజా పోరాటపంథా సక్సెస్ కాలేదని మావోయిస్టులే అంటున్నారు.
- పోలీసులు వేధిస్తారనే భయం లేకుండా, ఎలాంటి సంశయం లేకుండా మావోయిస్టులు జన జీవన స్రవంతిలోకి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
- చాలా మంది ఇప్పటికే పార్టీ నుండి బయటకు వస్తున్నారు. ఇటీవలే సెంట్రల్ కమిటీ సభ్యురాలు కవితక్క కూడా లొంగిపోయారు.
- మావోయిస్టులతో మాకు ఇక్కడ సమస్య లేనపుడు వాళ్ళతో చర్చలు అనవసరం.
- సైబర్ సెక్యూరిటీ, ఈగల్ టీంలకు పూర్తి సహకారం ఉంటుంది.
- బేసిక్, విజువల్ పోలీసింగ్ మానిటరింగ్ సిస్టమ్ ఇంప్రూవ్ చేస్తాం.
- మాకు ఉన్నదంతా ఖాకీ బుక్ మాత్రమే.. మాకు పింక్ బుక్కు గురించి తెలియదు.
- ఇతరుల వ్యక్తిత్వ హననానికీ పాల్పడేలా సోషల్ మీడియా పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటాం.

