Top 5 This Week

Related Posts

అవినీతి ‘ముత్యం’ లిక్కర్ బాటిల్ విలువే ఎంతో తెలుసా..!?

హైదరాబాద్: తెలంగాణా రెనివబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (రెడ్కో) డివిజనల్ ఇంజనీర్ ముత్యం వెంకటరమణ నివాసంలో తనిఖీల ద్వారా ఏసీబీ అధికారులు గుర్తించిన అక్రమాస్తుల విలువ బహిరంగ మార్కెట్లో భారీగానే ఉంది. రూ. 200 కోట్లుగా, రూ. 400 కోట్లుగా భిన్న వార్తలు వెలువడగా, గరిష్టంగా ఈ మొత్తం రూ. 500 కోట్లు ఉంటుందనే అంచనాలు కూడా ఉన్నాయి. కానీ ఏసీబీ అధికారికంగా గుర్తించిన ఆయా ఆస్తుల విలువ మాత్రం రూ. 27.65 కోట్లు. ఏసీబీ తనిఖీలు నిర్వహించి కనుగొన్న అవినీతి అధికారుల అక్రమాస్తుల చరిత్రలోనే ముత్యం వెంకటరమణ పోగేసిన అక్రమాస్తుల విలువే అతిపెద్దదిగా అధికారులు అభివర్ణిస్తున్నారు. వెంకటరమణ 2019లోనే రూ. 26 లక్షల మొత్తాన్ని లంచంగా స్వీకరిస్తూ ఏసీబీకి పట్టుపడిన చరిత్రను కలిగి ఉండడం ఈ సందర్భంగా గమనార్హం.

రెడ్కో డీఈ వెంకటరమణ ఇంట్లో గుర్తించిన విదేశీ మద్యం సీసాలు

స్వాధీనం చేసుకున్న ఆస్తుల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల విలువకు, బహిరంగ మార్కెట్ లో ఆయా ఆస్తుల విలువకు మధ్య భారీ వ్యత్యాసముంటుందనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ముత్యం వెంకటరమణ ఇంట్లో ఏసీబీ అధికారులు గుర్తించిన మద్యం సీసాల విలువ సైతం చర్చనీయాంశంగా మారింది. సారువారి ఇంట్లో మొత్తం 20 లిక్కర్ బాటిల్స్ లభ్యం కాగా, అందులో 19 విదేశీ, ఒకటి ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (ఐఎంఎఫ్ఎల్) బాటిల్స్ ఉన్నాయి. ఈ మొత్తం లిక్కర్ బాటిల్స్ విలువ రూ. 2.50 లక్షలుగా ఏసీబీ అధికారులు వెల్లడించారు. అంటే ఈ మొత్తాన్ని విభజిస్తే సగటున ఒక్కో బాటిల్ విలువ రూ. 12,500 మొత్తం అన్నమాట.

తనిఖీల అనంతరం ఏసీబీ విడుదల చేసిన అధికారిక ప్రకటన

ఇక రెడ్కో డీఈ ముత్యం వెంకటరమణ ఇంట్లో ఏసీబీ అధికారులకు లభ్యమైన డాక్యమెంట్లకు సంబంధించిన ఆస్తుల విలువ వివరాలు ఇవీ:

రెడ్కో డీఈ ముత్యం వెంకటరమణ
  • కూకట్ పల్లి, శేరిలింగంపల్లిలో రూ. 1.23 కోట్ల విలువైన నాలుగు రెసిడెన్షియల్ ఫ్లాట్లు.
  • ఆంజనేయనగర్, కూకట్ పల్లిలో రూ. 1.82 కోట్ల విలువైన ఒక జీ+3 కమర్షియల్ బిల్డింగ్.
  • శేరిలింగంపల్లి పరిధిలోని గుట్టల బేగంపేటలో రూ. 2.90 కోట్ల విలువైన ఒక జీ+5 వాణిజ్య భవనం.
  • బ్యాంకు బ్యాలెన్సులుగా రూ. 52.02 లక్షలు.
  • రూ. 40.00 లక్షల విలువైన 2,094 గ్రాముల బంగారు ఆభరణాలు.
  • రూ. 45.00 లక్షల విలువైన కార్లు.
  • రూ. 30.00 లక్షల విలువైన గృహోపకరణ వస్తువులు.
  • రూ. 2.50 లక్షల విలువైన 19 విదేశీ, ఒక స్వదేశీ మద్యం సీసాలు.
  • ఇవిగాక ఆంజనేయనగర్, మూసాపేట, కూకట్ పల్లి తదితర ప్రాంతాల్లో రూ. 20.00 కోట్ల విలువైన గల రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లు నిర్మించారు.
  • ఇప్పటి వరకు గుర్తించిన ఆస్తుల విలువ మొత్తం రూ. 27.65 కోట్లు.

Popular Articles