కరీంనగర్: కరీంనగర్ లో భారీ దోపిడీ జరిగింది. దాదాపు 60 తులాల బంగారం, వెండి ఆభరణాలతోపాటు రూ. 21.00 లక్షల నగదును దుండగులు దోచుకుపోయారు. నగరంలోని భగత్ నగర్ లో గత అర్థరాత్రి జరిగిన ఈ భారీ చోరీ ఉదంతం కలకలం రేపింది.

ప్రాథమిక సమాచారం ప్రకారం.. భగత్ నగర్ చౌరాస్తాలో నివాసముండే అజ్మత్ ఆలీ అనే వ్యక్తి ఇంట్లో సుమారు ఐదుగురు దుండగులు మాస్కులతో ప్రవేశించి, తుపాకులతో బెదిరించి, కుటుంబ సభ్యుల చేతులు కట్టేసి ఈ చోరీకి పాల్పడ్డారు. దోపిడీకి పాల్పడిన ఇంటి ఆవరణలో పార్కు చేసిన అద్దెకు ఉండేవారి రెండు బైకులను కూడా దుండగులు అపహరించారు. దోపిడీ అనంతరం ఈ బైకులపైనే పారిపోతూ సమీపంలోని బంకులో పెట్రోల్ పోసుకున్నట్లు సీసీ టీవీ విజువల్స్ లో నమోదైంది.

కాగా ఉత్తరాదికి చెందిన ముఠానే ఈ దోపిడీకి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కుటుంబ కలహాలు సైతం ఘటనకు కారణమనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. సీసీ పుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నగరంలోని పీఎంజే జ్యువెలరీ షాపులో జరిగిన దోపిడీ ఘటన అనంతరం మరోసారి భారీ చోరీ జరగడం కరీంనగర్ లో కలకలం సృష్టిస్తోంది. ఘటనా స్థలిని పోలీసులు సందర్శించి పరిశీలిస్తున్నారు.

కాగా ఈ దోపిడీ ఘటనపై కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ, గత అర్థరాత్రి ఒంటి గంట ప్రాంతంలో చోరీ జరిగిందని, 21 లక్షల నగదు, 60 తులాల బంగారం, రెండు బైక్ లు అపహరణకు గురైనట్లు చెప్పారు. ఘటనలో డమ్మీ పిస్టల్, కత్తి ఉపయోగించారని, తద్వారా దాడి చేసి చోరీకి పాల్పడ్డారని చెప్పారు. ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ లో నివాసముండే అజ్మత్ ఆలీ అల్లుడు రజాహుద్దిన్, పెద్దకూతురు, కొడుకుపై అనుమానం ఉన్నట్లు తెలిపారు. అజ్మత్ ఆలీ అల్లుడు, మనువడిపై యూపీలో కేసులు ఉన్నాయని చెప్పారు.
దోపిడీ ఘటనకు సంబంధించి సీసీ కెమెరాలో ఐదుగురు విజువల్స్ రికార్డు అయ్యాయని, స్పెషల్ టీం ఏర్పాటు చేసి విచారణ చేపట్టామని, త్వరలోనే దుండగులను పట్టుకుంటామని పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం పేర్కొన్నారు.

