హైదరాబాద్: తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీస్ జారీ చేశారు. గ్లోబరీనా టెక్నాలజీస్ సంస్థ అంశంలో రేవంత్ రెడ్డి తనపై చేసిన అసత్య ఆరోపణలకు 48 గంటల్లోపు బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ తన నోటీసులో డిమాండ్ చేశారు. ఎటువంటి ఆధారాలు లేకుండా రేవంత్ రెడ్డి తనపై మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని, నిర్దిష్ట గడువులోగా క్షమాపణ చెప్పకుంటే సివిల్, క్రిమినల్ చర్యలతో పాటు పరువు నష్టం దావా దాఖలు చేస్తానని కేటీఆర్ హెచ్చరించారు.
గ్లోబరీనా సంస్థతో తనకెటువంటి ఆర్థిక సంబంధాలు లేవని, యాజమాన్య హక్కులు కూడా లేవన్నారు. గ్లోబరీనా సంస్థ తన బినామీ కంపెనీగా, సీబీఎస్ఈ కాంట్రాక్టులు ఇప్పించానని ఆరోపించడం నిరాధారమని కేటీఆర్ పేర్కొన్నారు. రాజకీయ లబ్ధికోసమే ఇటువంటి నిరాధార ఆరోపణలు చేశారని, అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉంటూ తన ప్రతిష్టకు భంగం కలిగేలా దురుద్ధేశపూరిత వ్యాఖ్యలు చేశారని కేటీఆర్ అన్నారు.
