ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం స్పందించింది. ఇందులో భాగంగానే ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కూడి సంప్రదింపుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ చైర్ పర్సన్ గా రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, సభ్యులుగా పంచాయత్ రాజ్ విభాగపు ప్రభుత్వ కార్యదర్శి లోకేష్ కుమార్, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రెటరీ, ట్రాన్స్ కో సీఎండీ క్రిష్ణ భాస్కర్ లను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామక్రిష్ణారావు మంగళవారం ఉత్తర్వు జారీ చేశారు.

గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలతో, ఇతర స్టేక్ హోల్డర్ గ్రూపులతో ఈ కమిటీ సంప్రదింపులు చేస్తుందని ఉత్తర్వులో పేర్కొన్నారు. ఉద్యోగుల పెండింగ్ సమస్యలు, ఆచరణ సాధ్యమయ్యే సమస్యల పరిష్కారం దిశగా సంప్రదింపుల కమిటీ తనకు నిర్దేశించిన విధులను నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుంది. ఆయా అంశాలపై వారంలోగా ప్రభుత్వానికి ఈ కమిటీ నివేదికను సమర్పించాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ ఉద్యోగుల సమర సన్నాహం నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలు విదితమే. ఈ పరిణామాల్లో ప్రభుత్వం సంప్రదింపుల కమిటీని ఏర్పాటు చేయడం గమనార్హం.

ఆర్టీసీ సమ్మె వాయిదా:
కాగా ఆర్టీసీ సమ్మె వాయిదా పడింది. మంత్రి పొన్నం ప్రభాకర్ తో ఆర్టీసీ జేఏసీ జరిపిన చర్చలు సఫలం కావడంతో తలపెట్టిన సమ్మెను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

