హైదరాబాద్: తెలంగాణా రాష్ట్ర నూతన డీజీపీగా సీవీ ఆనంద్ నియామకమయ్యారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు మంగళవారం నియామకపు ఉత్తర్వు జారీ చేశారు. ప్రస్తుతం హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సీవీ ఆనంద్ ను డీజీపీగా నియమిస్తున్నట్లు జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొన్నారు. బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి ఈ ఉత్తర్వు అమలులోకి వస్తుందని స్పష్టం చేశారు.
ప్రస్తుతం డీజీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్న బి. శివధర్ రెడ్డి ఈ నెలాఖరును పదవీ విరమణ చెందనున్నారు. ఈ నేపథ్యంలో కొత్త డీజీపీ ఎంపికపై 1994 బ్యాచ్ కు చెందిన ముగ్గురు అధికారులతో కూడిన జాబితాను యూపీపీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. ఈ జాబితాలో సీవీ ఆనంద్, వీపీ ఆప్టే, సౌమ్య మిశ్రా అనే ఐపీఎస్ అధికారులు ఉండగా, అందరిలోనూ సీనియర్ అయిన సీవీ ఆనంద్ ను కొత్త డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది.


