Top 5 This Week

Related Posts

భద్రాద్రి జిల్లాలో పర్యటించిన డీజీపీ సీవీ ఆనంద్

కొత్తగూడెం: తెలంగాణా డీజీపీ సీవీ ఆనంద్ సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో డీజీపీ పాల్గొన్నారు.

పినపాక నియోజకవర్గంలోని మణుగూరులో నిర్మించిన పోలీస్ స్టేషన్‌ను డీజీపీ సీవీ ఆనంద్ ప్రారంభించారు. జిల్లా కేంద్రంలో ఏఆర్ డీఎస్పీ నివాస గృహాన్ని ప్రారంభించారు. అనంతరం 6వ బెటాలియన్‌ను సందర్శించారు. హేమచంద్రపురం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో నూతనంగా నిర్మించిన పోలీస్ గెస్ట్ హౌస్‌ను ప్రారంభించారు. అనంతరం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో పోలీసు అధికారులతో డీజీపీ సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ, జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పోలీసులు నిరంతరం అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. సైబర్ నేరాల పట్ల ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంతో పాటు, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.

మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రతి ఒక్కరూ వాటి నిర్మూలనకై కృషి చేయాలని, విద్యాసంస్థలు, యువతలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. రౌడీషీటర్లు, పాత నేరస్తుల కదలికలపై నిరంతర నిఘా ఉంచి, నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సీసీటీవీ కెమెరాల ఏర్పాటుపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి, ప్రతి గ్రామం, కాలనీ, వ్యాపార సముదాయం, విద్యాసంస్థలు, ప్రజా రద్దీ ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు పెంచాలని అధికారులను ఆదేశించారు.

మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల పట్ల సున్నితంగా స్పందిస్తూ, ప్రతి ఫిర్యాదుపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ అమలు మరింత సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్‌కు మరింత ప్రాధాన్యత ఇస్తూ ప్రజలతో సత్సంబంధాలు పెంపొందించుకోవాలని, గ్రామాలు, పట్టణాల్లో ప్రజలతో నిరంతరం మమేకమై వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలన్నారు.

అదేవిధంగా సీసీటీఎన్ఎస్ 2.0 సమర్థవంతంగా వినియోగించుకొని సమాచారాన్ని పొందుపరచాలని సూచనలు చేశారు. ఇండస్ట్రియల్ ఏరియాల్లో దొంగతనాల పట్ల ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించి నేరాల దర్యాప్తు నాణ్యతను మరింత మెరుగుపరచాలని సూచించారు. జిల్లాలో పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, నేరస్తులకు చట్టపరంగా శిక్షలు పడేలా పటిష్టమైన దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

డీజీపీ పర్యటనలో ఆయన వెంట మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి,జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, ఈగల్ ఫోర్స్ ఎస్పీ గిరిధర్, డీఎస్పీలు, సీఐలు, జిల్లా పోలీసు అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Popular Articles