ఖమ్మం: ఖమ్మం V6 జిల్లా రిపోర్టర్ గా పని చేస్తున్న సయ్యద్ ఖదీర్ వేర్వేరు కేసుల్లో నిందితునిగా మారుతున్న తీరు జర్నలిస్టు సర్కిళ్లలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఓ కేసులో నేరాన్ని అంగీకరించినందుకుగాను శిక్షను జరిమానాగా మారుస్తూ ఖమ్మం కోర్టు ఇచ్చిన తీర్పు అనంతరం కూడా ఖదీర్ మరో కేసులో నిందితునిగా మారడమే ఈ చర్చకు కారణంగా చెప్పవచ్చు.. తాజాగా రాము సుధా అనే ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై V6 రిపోర్టర్ ఖదీర్ నిందితునిగా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్లే ముందు సరిగ్గా ఏడాది క్రితంనాటి ఘటనను, న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు వివరాల్లోకి వెడితే..
నిరుడు ఇదే జూన్ నెలలో ముగ్గురు విలేకరులపై ఖమ్మం టూ టౌన్ పోలీసులు ఓ కేసు నమోదు చేశారు. ఖమ్మం నగరంలోని ద్వారకానగర్ కు చెందిన మీగడ వెంకటకృష్ణ ప్రసాద్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై ఖమ్మం టూ టౌన్ పోలీసులు ఎఫ్ఐఆర్ నెం. 315/2025, సీసీ నెం. 2500/2025 ద్వారా కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితులుగా V6 రిపోర్టర్ ఖదీర్, మరో ఇద్దరు జర్నలిస్టులు దువ్వా సాగర్, కొత్తపల్లి శ్రీనివాసరెడ్డిలను పోలీసులు చేర్చారు. ఈ కేసు గత డిసెంబర్ 21వ తేదీన లోక్ అదాలత్ ముందు పరిష్కారానికి వచ్చింది. కేసులో నిందితులైన ఖదీర్, శ్రీనివాసరెడ్డి, సాగర్ లు తమపై పోలీసులు మోపిన అభియోగపు నేరాన్ని అంగీకరించారు. ఈ సందర్భంగా నేరాన్ని అంగీకరించిన ఆయా నిందితులను హెచ్చరిస్తూ జైలు శిక్ష పడుతుందని కూడా కోర్టు స్పష్టం చేసింది. అయితే నిందితులు తాము చేసిన నేరాన్ని స్వచ్ఛందంగా అంగీకరించినందున వారిని బీఎన్ఎస్ఎస్ లోని 275 సెక్షన్ కింద, బీఎన్ఎస్ చట్టంలోని 296(b), 115(2), 351(2) r/w 3(5) సెక్షన్ల పరిధలోకి వచ్చే నేరానికి సంబంధించి నిందితులు దోషులుగా నిర్ధారించబడ్డారు. ఈ సందర్భంగా నిందితులు కోర్టుకు విన్నపం చేసుకుంటూ మొదటిసారి ఈ నేరానికి పాల్పడ్డామని, తమకు వృద్ధ తల్లిదండ్రులు ఉన్నారని, మరోసారి ఇటువంటి నేరానికి పాల్పడబోమని పేర్కొన్నారు. దీంతో భవిష్యత్తులో ఎటువంటి నేరానికి పాల్పడకూడదని కోర్టు వారిని ఆదేశిస్తూ, సమర్పించిన ఆధారాలను పరిగణణలోకి తీసుకుని నిందితుల అంశంలో జైలు శిక్షకు బదులుగా జరిమానా విధించడమే సముచితమని న్యాయస్థానం భావించింది. మొత్తం ఈ కేసులో నేరాన్ని స్వచ్ఛందంగా అంగీకరించిన నిందితులను దోషులుగా నిర్ధారిస్తూ అభియోగం మోపిన సెక్షన్లకు సంబంధించి రెండు సెక్షన్లలో ఒక్కో సెక్షన్ కు రూ. 600 చొప్పున, ఇంకో సెక్షన్ కు రూ. 800 చొప్పున ఒక్కో నిందితునికి మొత్తం రూ. 2,000 చొప్పున ముగ్గురికి రూ. 6,000 జరిమానాను విధిస్తూ ఖమ్మం ఫస్ట్ అడిషనల్ జ్యూడిషియల్ కోర్టు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ శ్రీమతి బెక్కం రజని గత డిసెంబర్ 21వ తేదీన తీర్పు చెప్పారు.
ఏడాది క్రితంనాటి ఈ కేసులో నేరాన్ని అంగీకరించి, భవిష్యత్తులో ఇటువంటి నేరానికి పాల్పడబోమని న్యాయమూర్తిని ప్రాధేయపడి దోషులుగా తేలిన ముగ్గురు నిందితుల్లో ఒకడైన ఖదీర్ తాజాగా మరో కేసులో నిందితునిగా మారడం గమనార్హం. గత డిసెంబర్ 21వ తేదీన తీర్పు వెలువడి, మరోసారి ఇటువంటి నేరాలకు పాల్పడబోమని న్యాయస్థానానికి హామీ ఇచ్చి నెలైనా గడవకముందే ఖదీర్ మరో క్రిమినల్ కేసులో నిందితునిగా పోలీసు రికార్డులకెక్కాడు.
గత జనవరి 19వ తేదీన జరిగినట్లు పేర్కొన్న ఈ ఘటనలో ఖమ్మం వన్ టౌన్ పోలీసులు ఖదీర్ పైనేగాక మరికొందరిపై బీఎన్ఎస్ చట్టంలోని 329(4), 115(2), 324(2), 79, 351(2), 296(b), 118(1), r/w 3(5) సెక్షన్ల కింద ఈనెల 16వ తేదీన అందిన ఫిర్యాదు ప్రకారం కేసు నమోదు చేశారు. పార్శీబంధానికి చెందిన రాము సుధా అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించి నమోదైన ఈ కేసులో పోలీసులు పేర్కొన్న బీఎన్ఎస్ చట్టంలోని పలు సెక్షన్లలో గల 296(b), 115(2), 351(2), r/w 3(5) సెక్షన్లు గత ఉదంతపు కేసులోనూ ఉండడం ఈ సందర్భంగా గమనార్హం. అంటే.. ఇటువంటి నేరానికి మరోసారి పాల్పడబోమని కోర్టుకు విన్నవించుకున్న అప్పటి కేసులోని ముగ్గురు నిందితుల్లో ఒకడైన ఖదీర్ పై పోలీసులు అదే తరహా నేరానికి సంబంధించిన సెక్షన్లను కూడా తాజా కేసులో పొందుపర్చడం గమనార్హం.

కాగా ఈ రెండు ఘటనల్లోనూ పోలీసులు కౌంటర్ కేసులు నమోదు చేశారు. అయితే జర్నలిజం వృత్తిలో ఉండడం వల్ల రెండు కేసుల్లోనూ నిందితుడైన ఖదీర్ వ్యవహార శైలి సహజంగానే ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ఏడాది క్రితం నాటి ఘటనలో కారు పార్కింగ్ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు అప్పట్లో కేసు నమోదుకు దారి తీయగా, తాజాగా నమోదైన కేసులో ఓ బేకరీ పొగ గొట్టపు వివాదం ఇందుకు కారణమైంది. ఇరువర్గాలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నట్లు, ఇందుకు సంబంధించి రెండు కేసులు నమోదు చేసినట్లు ఖమ్మం వన్ టౌన్ సీఐ కరుణాకర్ వెల్లడించినట్లు పత్రికల్లో శుక్రవారం వార్తలు వచ్చాయి.

ఈనెల 16న నమోదైన ఈ కేసుకు ముందే ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లోనూ బేకరీకి చెందిన రాము సుధా పెరుమాల్ దంపతులు ఖదీర్ పై బాహాటంగానే ఆరోపణలు చేశారు. కానీ వారి ఆరోపణలపై ఖదీర్ బహిరంగంగా ఎక్కడా నేరుగా స్పందించిన దాఖలాలు లేవు. కానీ, ఖదీర్ అనుకూల వర్గాలు మాత్రం బేకరీ పొగ గొట్టం వల్ల ఏర్పడుతున్న సమస్యపై డిజిటల్, పీడీఫ్, పత్రికల్లో పలు వార్తా కథనాలను వెలువరించాయి. అంతేకాదు ఖదీర్ పై పిచ్చి రాతలు రాస్తే మీ బతుకులు రోడ్డున పడడం ఖాయమంటూ కూడా సోషల్ మీడియా వేదికగా అతని అనుకూలురు కొందరు హెచ్చరికలు జారీ చేస్తుండడం గమనార్హం. ఈ తరహా హెచ్చరికల ఇమేజ్ లు ఏకంగా పోలీసు-ప్రెస్ గ్రూపులోనే పోస్ట్ చేస్తుండడం ప్రస్తావనార్హం.

