హైదరాబాద్: జనసేన పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేష్ కుమారుడు సంజూష్ పై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యంగా అతివేగంతో కారు నడిపి ఓ యువతి మరణానికి కారణమయ్యాడనే అభియోగంపై సంజూష్ పై మాదాపూర్ పోలీసులు బీఎన్ఎస్ చట్టంలోని 106 (1) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఈనెల 16వ తేదీన జరిగిన ఘటన గురువారం వెలుగులోకి రావడం గమనార్హం.
మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇనార్భిట్ మాల్ లో గల లైఫ్ స్టైల్ స్టోర్ లో పనిచేస్తున్న భారతి ముఖి (26) అనే యువతి భోజనం తీసుకురావడానికి ఓ స్టార్ హోటల్ సమీపానికి వెళ్లారు. ఈ సందర్భంగా రోడ్డు దాటుతుండగా TG-09-G-0666 అనే నెంబర్ గల ఆస్టన్ మార్టిన్ కారు ఢీకొట్టింది. దీంతో భారతి ముఖి తీవ్రంగా గాయపడ్డారు. తలకు బలమైన దెబ్బ తగలడంతో తీవ్ర రక్తస్రావంలో గల బాధితురాలిని జూబ్లీ హిల్స్ లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తరలించగా, ఆమె అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
ప్రమాదానికి కారణమైన కారు జనసేన పార్టీకి చెందిన ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు సంజూస్ దిగా పోలీసులు గుర్తించారు. కారును సంజూష్ నడిపినట్లు విచారణలో కనుగొన్న పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి మాదాపూర్ దర్యాప్తు చేస్తున్నారు. కాగా చనిపోయిన భారత ముఖి ఒడిషాకు చెందిన యువతి. ప్రమాదం జరిగిన తర్వాత ఆమె కుటుంబ సభ్యులను హుటాహుటిన విమానంలో రప్పించి మృతదేహాన్ని ఆమె స్వగ్రామానికి తరలించారని, విషయం వెంటనే బయటకు పొక్కకుండా పలుకుబడి పనిచేసిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

