హైదరాబాద్: మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బడుగుల సుమతి సంచలన ఆపరేషన్ నిర్వహించారు. కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన తొలిరోజే ఆమె నిర్వహించిన ఈ ఆపరేషన్ లో 40 మంది పోకిరీలు ఆమెను వేధించడం గమనార్హం. చుడీదార్ ధరించి సివిల్ దుస్తుల్లో ఎటువంటి సెక్యూరిటీ లేకుండా ఆమె అర్థరాత్రి దిల్ సుఖ్ నగర్ బస్టాండ్ లో ఉండడంతో, సుమతిని గుర్తించని పోకిరీలు ఆమెను వేధించిన ఘటన తీవ్ర సంచలనం రేకెత్తించింది. పోకిరీల అడ్డాగా మారినట్లు ఆరోపణలు వచ్చిన దిల్ సుఖ్ నగర్ బస్టాండునే ఆమె తన ఆపరేషన్ కు కేంద్రంగా ఎంచుకోవడం విశేషం. పోలీస్ కమిషనర్ గా కాకుండా, సగటు మహిళా పరిస్థితిని పరిశీలించేందుకు సుమతి ఈ ఆపరేషన్ నిర్వహించారు.

ఇందులో భాగంగానే గత అర్థరాత్రి 12 గంటల నుంచి ఈ తెల్లవారుజామున 3.00 గంటల వరకు ఆమె తన ఆపరేషన్ నిర్వహించారు. సుమతిని గుర్తించని దాదాపు 40 మంది పోకిరీలు ఆమెను వేధించడం ప్రారంభించారు. వీరిలో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నారు. మద్యం, గంజాయి మత్తులో గల యువకులు సుమతిని రకరకాల అసభ్యకరమైన ప్రశ్నలతో వేధించినప్పటికీ, ఆమె మొక్కవోని ధైర్యంతో ఒంటరిగానే ఉన్నారు.

దాదాపు మూడు గంటలపాటు ఎటువంటి పోలీసులు కూడా సుమతి వెంట లేరు. తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఓ బీట్ కానిస్టేబుల్ ఆమెను గమనించారు. అనంతరం 40 మంది పోకిరీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాను మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ గా నియమితులైన తర్వాత మూడు రోజులపాటు దిల్ సుఖ్ నగర్ బస్టాండ్ పై నిఘా ఉంచిన సుమతి, తనను వేధించిన పోకిరీలను గమనించారు. చదువకోవడానికి వచ్చిన విద్యార్థులు సైతం సుమతిని వేధించిన పోకీరీల్లో ఉన్నారు. వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ నిర్వహించారు. సుమతి నిర్వహించిన ఈ ఆపరేషన్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.



