హైదరాబాద్: పాన్ ఇండియా సైబర్ ఛీటింగ్ వర్క్ ను హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. ‘ఆపరేషన్ ఆక్టోపస్ 2.0’ అనే భారీ ఆపరేషన్ ద్వారా మొత్తం 52 మంది నిందితులను అరెస్ట్ చేయగా, అందులో 32 మంది ప్రయివేట్, ప్రభుత్వ రంగ బ్యాంక్ అధికారులే ఉండడం గమనార్హం. కుట్రలో భాగస్వామ్యం ఉందనే అభియోగాలపై వివిధ బ్యాంక్ అధికారులను అరెస్ట్ చేశారు. అరెస్టయిన మిగతా నిందితుల్లో 15 మంది మ్యూల్ ఖాతాదారులు, ఐదుగురు మధ్యవర్తులు ఉన్నారు. దేశవ్యాప్తంగా మొత్తం తొమ్మిది రాష్ట్రాల్లో గల నెట్ వర్క్ ను ఈ సందర్భంగా పోలీసులు బ్రేక్ చేశారు.

సైబర్ క్రైమ్స్ డీసీపీ వి. అరవింద్ బాబు, ఏసీపీ ఆర్.జి. శివమారుతి ఆధ్వర్యంలో హైదరాబాద్ నగర పోలీసులు దేశవ్యాప్తంగా పనిచేస్తున్న సైబర్ క్రైమ్ సిండికేట్ ముఠాను ఛేదించేందుకు భారీ ఆపరేషన్ నిర్వహించారు. దేశవ్యాప్తంగా 850 కేసులతో ముడిపడిన ఈ నెట్ వర్క్ నిందితులు రూ. 150 కోట్ల లావాదేవీలను నిర్వహించినట్లు పోలీసులు కనుగొన్నారు. అనుభవజ్ఞులైన మొత్తం 16 స్పెషల్ టీంలతో ఏడు రోజుల వ్యవధిలోనే తొమ్మిది రాష్ట్రాల్లో ఏకకాలంలో ‘ఆపరేషన్ ఆక్టోపస్ 2.0’ను నిర్వహించారు. నిందితుల నుంచి 26 మొబైల్ ఫోన్లు, 14 చెక్ బుక్కులు, రెండు పెన్ డ్రైవ్ లు, ఒక లాప్ టాప్, నకిలీ కంపెనీల రబ్బర్ స్టాంపులు 21 స్వాధీనం చేసుకున్నారు.

