(సమీక్ష ప్రత్యేక కథనం)
పోట్రు ప్రవీణ్ గుర్తున్నాడా..? ఖమ్మం జిల్లా పెనుబల్లి పోలీసులు నమోదు చేసిన రూ. 549.95 కోట్ల సైబర్ నేరాల దోపిడీ కేసులో తొలుత అరెస్టయిన కీలక నిందితుడు. కల్లూరు మండలంలో బీఆర్ఎస్ నాయకుడు కూడా. గత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థులను తన ‘ఆర్థిక బలం’తో అతలాకుతలాం చేసినట్లు ప్రాచుర్యంలోకి వచ్చి, ఆ తర్వాత సైబర్ నేరాల కేసులో అరెస్టయి ప్రస్తుతం బెయిల్ పై గల పోట్రు ప్రవీణ్ తాజాగా ఓ రియల్ ఎస్టేట్ సంస్థ నిర్వహించిన కార్యక్రమపు వేదికపై ప్రత్యక్షమైన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
టాలీవుడ్ లో సినిమా ప్రమోషన్ల ఈవెంట్స్ నిర్వహణ ద్వారా బహుళ ప్రాచుర్యం పొందిన శ్రేయాస్ మీడియా అనే సంస్థ తెలుసు కదా! ఆ సంస్థ ఇటీవలే రియల్ ఎస్టేట్ రంగంలోకి ప్రవేశించింది. ఇందులో భాగంగానే తన తొలి రియల్ వెంచర్ ను ఖమ్మం జిల్లా కేంద్రంలో శ్రేయాస్ సంస్థ గత ఉగాది రోజున ప్రారంభించింది. ఈ వెంచర్ లో శ్రేయాస్ మీడియా సంస్థ ఓ భాగస్వామిగానూ తెలుస్తోంది. ప్రముఖ సింగర్ సునీత, మీనాక్షి చౌదరి వంటి సినీతారలను తీసుకువచ్చి శ్రేయాస్ మీడియా తన రియల్ వెంచర్ ప్రయాణాన్ని ఖమ్మంలో ప్రారంభించింది.

వెంచర్ ప్రమోషన్ లో భాగంగా మూడు, నాలుగు రోజుల క్రిత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోనూ శ్రేయాస్ సంస్థ ఓ ఈవెంట్ ను నిర్వహించింది. అయితే ఈ కార్యక్రమపు వేదికపై పెనుబల్లి పోలీస్ స్టేషన్ లో నమోదైన సైబర్ నేరాల కేసులో కీలక నిందితుడైన పోట్రు ప్రవీణ్ ప్రత్యక్షం కావడం ప్రజల్లో.., ముఖ్యంగా రాజకీయ, రియల్ ఎస్టేట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. పోట్రు ప్రవీణ్, శ్రేయాస్ మీడియా సంస్థ అధినేత గండ్ర శ్రీనివాస్ లు కల్లూరు మండలం ఎర్రబోయినపల్లికి చెందినవారే కావడం ఈ సందర్భంగా గమనార్హం.
అయితే వందలాది కోట్ల రూపాయల దోపిడీకి సంబంధించిన సైబర్ నేరాల కేసులో కీలక నిందితుల్లో ఒకడైన పోట్రు ప్రవీణ్ పాల్వంచలో నిర్వహించిన ఆయా కార్యక్రమపు వేదికపై ప్రత్యక్షం కావడంపైనే తాజాగా భిన్న చర్చ జరుగుతోంది. గండ్ర శ్రీనివాస్, పోట్రు ప్రవీణ్ ఒకే గ్రామం వారు కావడం వల్ల ‘గౌరవం’తో ఆహ్వానించారా? లేక ఇద్దరి మధ్య ఏదేని బంధుత్వం ఉందా? ఇవేవీ కావంటే శ్రేయాస్ మీడియా సంస్థ ఖమ్మంలో ప్రారంభించిన రియల్ వెంచర్ లో పోట్రు ప్రవీణ్ సైలెంట్ భాగస్వామిగా ఉన్నారా? వంటి అనేక ప్రశ్నలు ప్రామాణికంగా ప్రజల్లోనేగాక, పొలిటికల్, రియల్ ఎస్టేట్ వ్యాపార వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అసలు ఏమిటీ శ్రేయాస్ వెంచర్ భూ నేపథ్యం.. వెంచర్ లోని భూమి ఏదేని వివాదాస్పద ఆరోపణల్లో చిక్కుకుందా? రైతుల నుంచి కొనుగోలు చేసిన భూమికి డబ్బు పూర్తిగా చెల్లించారా? లేదా? మొత్తం భూమిలో ఏదేని వివాదాస్పద విస్తీర్ణం కూడా ఉందా? వంటి అనేక ప్రశ్నల అంశాలపై పూర్తి వివరాలు మరో వార్తా కథనంలో సమీక్షించుకుందాం..

