Top 5 This Week

Related Posts

పలువురు తెలంగాణా జర్నలిస్టులకు NIA నోటీసులు

హైదరాబాద్: తెలంగాణాలోని పలువురు జర్నలిస్టులకు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) నోటీసులు జారీ చేసింది. గత నవంబర్ 26వ తేదీన హైదరాబాద్ ఎన్ఐఏ పోలీస్ స్టేషన్ లో నమోదైన ఎఫ్ఐఆర్ నెం. RC- 04/2025/NIA/HYD ద్వారా బీఎన్ఎస్ లోని సెక్షన్ 152, ఉపా చట్టం-1967 లోని 13, 39 సెక్షన్ల కింద అనేక మంది జర్నలిస్టులకు NIA నోటీసులు జారీ చేసింది.

జాతీయ దర్యాప్తు సంస్థ ద్వారా ఆయా నోటీసులు అందుకున్నవారిలో పలువురు పేరెన్నిక గల యూ ట్యూబర్లతోపాటు ఓ డిజిటల్ పేపర్ కు చెందిన యూ ట్యూబ్ ఛానల్ విలేకరి, మరో ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్ కు చెందిన ఇన్ పుట్ ఎడిటర్ హోదా గల జర్నలిస్టు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో కొందరిని ఇప్పటికే NIA విచారించగా, మరికొందరిని సోమవారం విచారణకు పిలిచింది.

గాదె ఇన్నయ్యపై నమోదైన కేసు ఆధారంగానే పలువురు ప్రజా సంఘాల నాయకులకు, ప్రజా కవులకు, వామపక్ష భావజాల పార్టీల నాయకులకు NIA నోటీసులు జారీ చేస్తున్నట్లు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా అనేక మంది జర్నలిస్టులకు కూడా NIA నోటీసులు జారీ చేసి, విచారణకు పిలుస్తుండడం గమనార్హం.

కాగా ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు జర్నలిస్టులు కూడా NIA రాడార్ లో ఉన్నారని, నేడో, రేపో వారికి కూడా నోటీసులు అందవచ్చనే ప్రచారం పాత్రికేయ వర్గాల్లో జరుగుతోంది.

Popular Articles