Top 5 This Week

Related Posts

సైబర్ నేరాల దోపిడీలో సత్తుపల్లి ‘పొలిటికల్ ముఠా’దే స్టేట్ రికార్డ్!

(సమీక్ష ప్రత్యేక కథనం)
సైబర్ నేరాల దోపిడీ పర్వంలో సత్తుపల్లి నియోజకవర్గానికి చెందిన కొందరు రాజకీయ వ్యక్తుల ముఠా రాష్ట్ర స్థాయి రికార్డును సాధించింది. గడచిన యాభై నెలల్లో సైబర్ నేరాల ద్వారా దోపిడీకి గురైన జనం సొమ్ములో సింహభాగం దక్కించుకున్నది సత్తుపల్లి ప్రాంత ముఠానే కావడం గమనార్హం. నిరుద్యోగ యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల పేరుతో నయవంచనకు గురిచేసి, దేశీయంగానేకాకుండా, ప్రపంచ స్థాయిలో సైబర్ నేరాల దోపిడీకి పాల్పడడంలో సత్తుపల్లి ముఠా సంచలనం సృష్టించందనే చెప్పాలి. అయితే ఈ ముఠాలో అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు, వారి బంధువులు ఉండడమే అత్యంత ఆసక్తికరం.

పోట్రు ప్రవీణ్ (ఫైల్ ఫొటో)

తెలంగాణాలో నమోదైన సైబర్ నేరాలకు సంబంధించి కేవలం 50 నెలల వ్యవధిలో రూ. 4,724.64 కోట్లు దోపిడీకి గురైనట్లు రికార్డులున్నాయి. అంటే సగటును నెలకు రూ. 94.00 కోట్ల పైచిలుకు మొత్తం దోపిడీకి గురైంది. గడచిన జనవరి, ఫిబ్రవరి నెలల్లోనే సైబర్ దోపిడీగాళ్లు రూ. 257.35 కోట్లను కొల్లగొట్టారు. రాష్ట్రంలో నమోదైన సైబర్ నేరాల వివరాలను అందించాలంటూ యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ వ్యవస్థాపకుడు పల్నాటి రాజేంద్ర ఆర్టీఐ ద్వారా కోరిన సమాచారం మేరకు తెలంగాణా సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) ఆయా వివరాలను వెల్లడించడం గమనార్హం. గడచిన నాలుగేళ్ల రెండు నెలల వ్యవధిలో బాధితులు కోల్పోయిన ఆయా మొత్తపు సొమ్ములో కేసుల నమోదు, దర్యాప్తు అనంతరం రీఫండ్ చేయించిన మొత్తం రూ. 382.8 కోట్లుగా పోలీసు అధికారులు వెల్లడించారు.

అయితే రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన సైబర్ నేరాల్లో సత్తుపల్లి నియోజకవర్గంలోని పెనుబల్లి, సత్తుపల్లి పోలీస్ స్టేషన్లలోనూ ఈ ఏడాది రెండు కేసులు నమోదయ్యాయి. ఆయా కేసుల్లో నియోజకవర్గంలోని పెనుబల్లి, కల్లూరు, సత్తుపల్లి ప్రాంతాలకు చెందిన ముఠా చేసిన దోపిడీ మొత్తం ఎంతో తెలుసా..? రూ. 549.95 కోట్లు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా దోపిడీకి గురైన మొత్తం రూ. 4,724.64 కోట్లలో సింహభాగం సత్తుపల్లి ప్రాంత ముఠానే దోచుకుందనేది సుస్పష్టం. పెనుబల్లి, సత్తుపల్లి పోలీస్ స్టేషన్లలో నమోదైన రెండు కేసుల్లో ఇప్పటివరకు పోలీసులు నిర్వహించిన దర్యాప్తులో తేలిన అంశం మాత్రమే ఇది. కాగా ఆయా రెండు కేసుల్లో ఇప్పటి వరకు సత్తుపల్లి సబ్ డివిజన్ పోలీసులు మొత్తం 48 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయినవారిలో మ్యూల్ అకౌంట్ల కోసం తమ ఖాతాల వివరాలను ఇచ్చిన నిరుద్యోగులతోపాటు, ఓ ప్రయివేట్ బ్యాంక్ మేనేజర్ సహా సిబ్బంది, రాజకీయ నాయకులూ ఉన్నారు.

చార్టెడ్ ఫ్లైట్ లో వికాస్ చౌదరి (ఫైల్ ఫొటో)

సైబర్ నేరాల దోపిడీ ముఠాలో నిందితులుగా మారినవారిలో బీఆర్ఎస్ నాయకుడు పోట్రు ప్రవీణ్. బీజేపీ సత్తుపల్లి పట్టణ మాజీ అధ్యక్షుడు పోట్రు మనోజ్ కళ్యాణ్, ప్రముఖ కాంగ్రెస్ నాయకుని సమీప బంధువైన ఉడతనేని వికాస్ చౌదరి ఉన్నారు. సైబర్ నేరాల దోపిడీ పర్వంలో మొత్తం ముఠా కార్యకలాపాలకు పోట్రు ప్రవీణ్, పోట్రు మనోజ్ కళ్యాణ్, వికాస్ చౌదరిలను పోలీసులు కీలక నిందితులుగా గుర్తించారు. ముగ్గురిలో వికాస్ చౌదరి అనే సైబర్ నేరాల నిందితున్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు చాలా శ్రమించాల్సి వచ్చింది. అధికార పార్టీకి చెందిన ప్రముఖ నాయకునికి సమీప బంధువు కావడం, చార్టెడ్ ఫ్లయిట్లలో విలాసవంతమైన జీవితాన్ని గడిపే వికాస్ చౌదరిని ఎట్టకేలకు పోలీసులు గత ఫిబ్రవరి నెలాఖరులో చాకచక్యంగా అరెస్ట్ చేశారు.

పోట్రు కళ్యాణ్ (ఫైల్ ఫొటో)

మొత్తంగా పరిశీలించినపుడు రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్న సైబర్ నేరాలు, దోపిడీకి గురవుతున్న బాధితుల సొమ్ములో సింహభాగం దోచుకున్నది సత్తుపల్లి ప్రాంత ముఠాగానే పోలీస్ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఈ ముగ్గురు కీలక నిందితుల్లో ఇప్పటికే పోట్రు ప్రవీణ్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తన ‘ఆర్థిక’ బలాన్ని చాటాడనే ప్రచారం ఉండగా, ముగ్గురిలో మరో వ్యక్తి నియోజకవర్గాల పునర్విభజన జరిగితే, ఖమ్మం జిల్లాలోని ఏదేని జనరల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయవచ్చనే కథనాలు కూడా తాజాగా వ్యాప్తిలోకి రావడం అసలు కొసమెరుపు.

Popular Articles